నేనూ- అతనూ
~~~~~~~~~
అతనొస్తాడు, బార్లా తెరిచిన వాకిలిలో అడ్డూ ఆపూ లేని సూర్యోదయంలా
అప్పుడప్పుడూ నవ్వుతూ, అరుదుగా మబ్బుల మూట లాగా
చీకట్ల చీర కట్టిన నన్ను కూడా ఆప్యాయంగా హత్తుకుంటూ
“ ఏమన్నా తిన్నావా “ అని అడుగుతాడు
చేదుగా మింగిన అవమానాలూ, బ్రతికి తీరాలని
తెలివిగా పడిన రాజీల బాధల పగుళ్ళూ
ప్రేమలా జీర్ణం కాని వెటకారపు భక్ష్యాలూ
వర్తమానపు వైరాగ్యంలో గతపు దుఃఖపు పాట గుర్తొస్తుంది
నేనే రాగం కట్టిన నా ఎలిజీ నన్ను జాలిగా చూస్తుంది
చిక్కటి చీకటిలోకి పారిపోయి మళ్ళీ కొత్తజన్మ కోసం మరణిస్తా నేను
“ నా చీకటి పరిచయం చేస్తా రా “ అని పిలుస్తాడతను
నిస్సిగ్గుగా అడుగెట్టిన అతని చీకటి కూడా
కొత్త వెలుగై వేళ్ళూనుకుంటుంది నాలో ..
“ నా దేహమంతా గత దుఃఖపు, జీవ మోహపు గాయాలే !”
సంకోచంగా స్వగతిస్తాను నేను
“ వేణువు కన్నీ కన్నాలే కదా చిన్నీ !” నిర్వికల్ప సమ్మోహనంతో
చిరునవ్వు నేపధ్యమవుతాడతను
నా, మిలమిల లాడే, తళుకులీనే డొల్ల వెలుగు నుండి
అతని అంతర్ముఖ చీకట్ల లో నిర్భయంగా అడుగేస్తాను నేను ..
మట్టికుండ లో నీటి చల్లదనంలా .. నా నమ్మకపు దాహం తీరుతుంది ..
పలికే పదాలతో, అతని పెదాలతో వూపిర్లూదే ఈ దేహ వేణువులో
ప్రతీ గాయం మానుపడుతుంది ..!!
--సాయి పద్మ
No comments:
Post a Comment