Friday, May 24, 2013

Poem 11

వంశీ // మార్మిక వాక్యం //

వాక్యం ఎప్పుడూ అసంపూర్ణమే..
వీస్తున్న చీకటిపొరల 
నడుమ కురుస్తున్న గాలుల్లో 
దీపాల వెలుగుల నీడలు
పైకీ కిందికీ మునకలేస్తున్నట్టు
వాక్యాలెప్పటికీ మిగిలిపోతూనే..

చెట్ల కొమ్మలనుండి కిటికీకమ్మీకి
వంతెనై మెరుస్తుండే సాలీడు దారంపై
సీతాకోక సంగీతీకరించే నిస్వనపు శృతుల్నీ,
మూత్రశాలల్లో కరిగి రంగు మారిన
కలరాఉండల కన్నీటి చర్మాల్నీ
మనమనుభూతించగలమా
రాయలేనితనానికి తెలిసినతనం తోడై..

ఎంత సరదా
"నేను" కనపడని "నా" అక్షరాల్ని
ధ్వంసించి "నన్ను" వెతుక్కోవడం..
సముద్రం అడుగున మంచుకొండలా
మనిషెపుడూ మార్మికుడేగా..

యుగాలుగా
అసంపూర్ణవాక్యాల నడుమనేగా మనం,
అందుకే
మొదలుపెట్టడమే మన వంతు
పూరించబడేదెన్ని కాలాలకో
అవునూ,
కాలమెంత కాలానికి పుట్టిందో తెలుసా
ఎవరికైనా..

22-05-13

https://www.facebook.com/vamshidhar.reddy

No comments:

Post a Comment