Saturday, May 11, 2013

Poem 4 -- Pydi Theresh Babu

“ఆడుకో నా తండ్రీ ఆడుకో "
- పైడి తెరేష్ బాబు 

https://www.facebook.com/thereshbabu.pydi?fref=ts
అందాకా ...
గొంతు పట్టని మూలుగు తో పెనుగులాట 
ఎముక చాలని మూలుగ తో పీకులాట 
అప్పటికప్పుడు మరణించి 
ఇప్పటికిప్పుడు బతికి రావడం 
ఒక పండగ 

అందాకా ...
చెప్పులు పట్టని పాదాలతో చెర్లాట
పొంతన కుదరని వాదాలతో పొర్లాట
అప్పటికప్పుడు ముగించి
ఇప్పటికిప్పుడు మొదలుకావడం
ఒక పండగ

అందాకా ...
బతకనేర్వనితనం తో బందాట
బతుకు విసిరే సవాళ్ళతో బంతాట
అప్పటికప్పుడు ఓడిపోయి
ఇప్పటికిప్పుడు గెలవడం
ఒక పండగ

అందాకా ...
తోలుమందం గుంపులో తొక్కిసలాట
కాలుగాలిన పిల్లులతో కక్కిసలాట
అప్పటికప్పుడు తప్పించుకుని
ఇప్పటికిప్పుడు ఇల్లు చేరడం
ఒక పండగ

అందాకా ...
భరనభ భడవ లతో కొట్లాట
అరకొర భజనలకు ఆఖరాట
అప్పటికప్పుడు తిట్టించుకుని
ఇప్పటికిప్పుడు ఒప్పించుకొనుట
ఒక పండగ

అందాకా..
లకలకలక నినాదాల లవ్వాట
సర్వ సరస చీరలతో సయ్యాట
అప్పటికప్పుడు విప్పేసుకుని
ఇప్పటికిప్పుడు కప్పేసుకోవడం
ఒక పండగ

అందాకా..
తాత్విక నేపధ్యాల తన్నులాట
తలతిరుగుడు రాతలతో పెన్నులాట
అప్పటికప్పుడు అవతారం చాలించి
ఇప్పటికిప్పుడు మనిషిగా మారడం
ఒక పండగ

అందాకా...
జస్ట్ అందాకే ...
ఆడుకో నా తండ్రీ ఆడుకో
ఆడుకుంటే నీకు ఆయుష్షు పెరిగేను
అప్పటికప్పుడు రమించి
ఇప్పటికిప్పుడు విరమించడం
ఒక పండగ


-- Pydi Theresh Babu

No comments:

Post a Comment