Saturday, August 31, 2013

ఇంద్రధనసు by ARUN SAGAR

ఇంద్రధనసు
మియర్ మేల్ సంకలనంలోని లవ్వాలజి ట్రియాలజిలో ఇది చివరిది 

ఫేర్వెల్ టూ యు. ఆల్ ద బెస్ట్ టు మి. వీడ్కోలు చెప్పడమెలాగో నేర్చుకో. ప్రేమకైనా ప్రాణానికైనా, ప్రాణాన్నిమించిన ప్రేమకైనా. వమ్ము కాదనుకున్న నమ్మకానికైనా, వికలమవదనుకున్న విశ్వాసానికైనా. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదు. స్పర్శల జాడలకైనా, జ్ఞాపకాల నీడలకైనా వీడ్కోలు తప్పదు. పాయింట్ టూ పాయింట్-స్టేజి కేరియర్. ఎక్కడ ఎక్కే వాడు అక్కడ. ఎక్కడ దిగే వాడు అక్కడ-గప్చుప్. తప్పు ఎంత మాత్రమూ తనది కాదు.

తెలిసీ వలచుట తొలినేరం. ఆత్రేయ చెప్పినా వినలేదేమిరా నాయనా. తెలిసి తెలిసి విలపించుటలో తీయదనం? బిట్టర్ స్వీట్ అంటే ఇదేనా మడోనా? ది పవర్ అఫ్ గుడ్ బై. అదేంటో తెలియదు. కాని వీడ్కోలు చెప్పాలంటే చాలా శక్తి కావాలి. పైగా ఇది పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు కాదు. వేరే!

అయినా ఆ హ్రుదయద్వారం మరెవరికోసమో తెరచి ఉన్నపుడు రమ్మన్నా వెళ్లి ఫలితం లేదు. ఆ హ్రుదయవేదిక ఎవరికో శయ్య కానున్నపుడు ఆశలు వికసించి అస్సలు ఉపయోగం లేదు. వీడ్కోలు స్వేఛ్చాగీతమట-దేని నుంచి దేనికొరకు దేని వలన స్వేఛ్చ. బందీ అవుతావో లేదో నీ ఇష్టం. బంధించే హక్కు నీకెక్కడిది?

పోయేదేమీలేదు. ఈ గుండెమీద కొత్త గాయాలకు చోటులేదు. దాక్కోవడానికి రహస్య స్థలాలు లేవు. కప్పుకోడానికిక ముఖాలు మిగిలిలేవు. వీడ్కోలు చెప్పడానికి గుండె కావాలి. దాని నిండా ధైర్యం కావాలి. కాని నిండుకుండలే జాగ్రత్తగా ఉండాలి-నీరైనా నిప్పయినా!

నువు డ్రీం సాంగైతే వేసుకోలేవు. ఎక్కడవున్న ఏమైనా తన సుఖమే నువు కోరుకున్న కోరుకోకపోయినా ప్రాబ్లమేమీలేదు. ఓరీ మధ్యయుగపు కాదలన్! తన సుఖం తను కోరుకోడం ముఖ్యం. నువు వీడ్కోలు చెప్పడమే మహాభాగ్యం.

చెప్పరా ఓ తెలుగువాడా పాడరా ఓ పాచిపాట. ప్రియా నీ జ్ఞాపకాలు చాలు వాటితో బతికున్నంతకాలం బతికేస్తాను. కిసుక్కు కిర కిర కిసుక్కు కిర్! నవ్వుతారురా జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. రొమాంటిక్ కష్టాల సెల్ఫ్ డిస్ట్రక్షన్. అందరానిదాని సంగతొదిలెయ్. చెయిజారిపోయిన పొందు?

నువ్వెవరయ్యా బాబూ చెయిజారుతుందని తెలియదా. మనం ముందే చెప్పుకున్నట్టుగా తెలిసికూడా వలచి మరి ఇప్పుడిక్కడ ఏడుస్తూకూచుంటే-టైం లేదు గురూ తర్వాత కలుద్దాం. ఈలోగా వెళ్లి ఆ కంఫెషన్ క్యూబికల్ ముందు కూర్చుని ధ్యానం చెయ్.

మామూలుగా మనం చెప్పాలంటే: వన్ లైఫ్ టూ లివ్. వన్ లవ్ టూ లవ్. ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి కారంపొడి వేసిచెప్పాలంటే వన్ లవ్ టు లివ్ ఫర్.

డూ యు థింక్ ఇట్ ఈజ్ పాజిబుల్? మళ్లీ అడుగుతున్నా చెప్పు. ప్రేమంటే కమిట్మెంట్ల కట్టా?

ఇది బూస్ట్ లోని సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ కాదు. నీ గుండె కండరాల రెటైనింగ్ పవరెంతో చెప్పు. ఫేర్వెల్ ఈజ్ ద టైం యూ స్టార్ట్ మిస్సింగ్ దెం. వీడ్కోలు చెప్పాలంటే మామూలు పని కాదురా అన్నా. దానికన్నా అసలా సిచ్యుయేషన్ తెచ్చుకోకుండా ఉండటమే బెటర్.

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని బెంగపడిపోతున్నవు కదూ. దిగులు మేఘాలమధ్య, దారి తెలియని మసక చీకట్ల ముసురు మధ్య; గుబులు గుండె శబ్దాన్ని ఏకాంతంగా వింటున్నవు కదూ. వద్దు ఏడవద్దు. కమాన్ హాండ్సం! పాత సామెతలూ సూత్రాలూ చట్రాలూ చట్టాలూ సతీవ్రతాలూ పతీధర్మాలూ చూసి భయపడవద్దు. ప్రేమలు ప్రణాళికలు కావు. ప్రేమలు సంభవాలు. యూ డోంట్ నో వెన్ యూ ఫాల్ ఇన్ లవ్. సమయమూ సందర్భమూ లేకుండా, హెచ్చరికలు ఎగురవేయకుండా వచ్చి ముంచే విస్మయాలు, విభ్రమాలు, విచిత్రసంచలనాల మనోవిన్యాసాలు.

తప్పు తనది కాదు. నీది. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పకతప్పదని తెలిసీ...నువ్వే అపరాధి.

నీకు దమ్మూధనియాలు ఉంటే వీడ్కోలు చెప్పు. నీకు దిధై ఉంటే వీడ్కోలును ఫ్లయింగ్ కిస్ లా కాచ్ చేసి పాకెట్ బుక్ పేజీల్లో నెమలి ఫింఛంలా పడేసి మర్చిపో.

కాని నాకు తెలుసురా. నీకేకాదు, హ్రుదయం ఉన్న ఎవడికైనా వీడ్కోలు చెప్పడమంటే గుండెను పీకి నేలకేసి రుద్దడమే. ఒసెయ్! ఈ బాధ భరించలేనే. ప్రొజాక్ లో జవాబుందా, మేన్షన్ హౌస్ లో శాంతి ఉందా?
-అరుణ్ సాగర్


No comments:

Post a Comment