Saturday, August 3, 2013

ఆ కనులతో కనులు కలిపాను - సామాన్య

ఐదు వందల ఏళ్ల పురాతనమైన కృష్ణ మందిరం అది. సాదాసీదాగా ఉన్న అతి చిన్న గుడి ఆవరణలో అటూ ఇటూ వరుసగా పది నివాస గదులున్నాయి. బహుశా అక్కడి పూజారులు, బయటి నుండి వచ్చే వైష్ణవి, వైష్ణవులు బస చేయడానికి ఉద్దేశించినవి అయ్యుండొచ్చు. మందిరం ఎదురుగా నాలుగుకాళ్ల మండపం. మందిర గోపురంపై కువకువమంటూ హాయిగా ప్రేమించుకుంటున్న పావురాలు. కుడిచేతివైపు పెద్దకొలను, కొలను నిండా విరగ పూసిన కలువలు. గలగలమంటూ తనపైన వాలిన పక్షులనడిగి ప్రాపంచిక చలన సమాచారాన్ని రాబడుతూ కొలను ఒడ్డున పెద్ద రావిచెట్టు. మందిరం నుండి బయటికి వచ్చేస్తే ప్రవేశద్వారం వద్ద మందిరం. మందిరంలో కృష్ణుని పాదముద్రలు వున్న ఒక బండరాయి.

 మేము ఆ మందిరానికి మెడికల్ క్యాంప్ చేయడానికి వచ్చాం. ప్రతి ఏడూ జూన్ మాసపు మొదటి వారంలో అక్కడ తిరనాళ్లు జరుగుతుంది. నేను పనిచేసేది శ్రీకృష్ణ మనోహరి మెడికల్ కాలేజ్‌లో. మా కాలేజి యజమానురాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కృష్ణ భక్తురాలు. ఇది ఆమె స్వగ్రామం. అందుకని ఏటా మేమిక్కడ మెడికల్ క్యాంప్‌ను ఆనవాయితీగా పెడుతుంటాం. అంతేకాదు ఈ గ్రామంలో ఎవరికి రోగమొచ్చినా ఆ బాధ్యత మా భుజస్కందాలపైనే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామాన్ని మా యజమాని దత్తత తీసుకుంది.

తిరనాళ్లకి ఈ ఏడాది కూడా దేశం నలుదిక్కుల నుండి భక్తులు వచ్చారు. అతి బీదలు, అతి ధనవంతులు..చీమల్లా చుట్టూ మనుషులే. మా క్యాంప్‌కి పక్కన ఒక పదిమంది బీద సన్యాసుల గుంపు కూర్చుంది. గంగరాయి చెట్టు చల్లటి నీడ కింద పొయ్యి పెట్టి అక్కడే వంట చేసుకుంటున్నారు. వంట చేస్తూ పాడుతున్నారు. వాళ్లు ఏ రాష్ట్రం వాళ్లో నాకు తెలీదు కానీ ఆ గుంపు నుండి పదే పదే వినిపించే ఒక పాట నా హృదయాన్ని హత్తుకుంది. అనుకరణకు తావులేని పచ్చిదనం, కొత్తదనం వారి గొంతుల్లో విని విని రెండవ రోజు సాయంత్రం టీ కోసమని బయటకొచ్చి ఆ గంగరాయి చెట్టుకిందకు చేరుకున్నాను.

వాళ్లు టీ కాచుకుంటున్నారు. నన్ను చూసి పరిచయంగా నవ్వారు. గిన్నెలోంచి టీని అందరూ తమ తమ గ్లాసుల్లోకి ఒంపుకుని ఆనందంగా తాగుతున్నారు. ఎందుకో ఆ దృశ్యం నాకు విపరీతమైన ఆనందాన్ని కలిగించి ఒక పాటని జ్ఞాపకం తెచ్చింది *"సంచారమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నదీ, జ్ఞాన సంచారమే...'' అని సాగుతుందది. సంచారానికి జ్ఞానానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆ కవి "సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి'' అంటాడు.

 వీళ్లు ఎక్కడెక్కడ తిరిగారో ఆ రకంగా ఎంత జ్ఞానులై ఉంటారో! వీళ్లు మాట్లాడేది ఏ భాషైనా, హిందీ వచ్చి ఉండొచ్చు అనుకుని, హిందీలో అడిగాను " మీరు పదే పదే పాడుతున్నారు కదా 'హృద్ మాఝారె రాఖిబో''అని, ఆ పాట అర్థమేమిటి? ఎవరి గురించి?'' వాళ్లలో పెద్ద సన్యాసి గంగరాయి చెట్టు వేరుపైన తల పెట్టుకుని పడుకున్న వాడల్లా లేచి"ఇంకెవరి గురించి పాడుతాం బాపూ! ఆ కిషన్ కన్నయ్య గురించే''అన్నాడు. అని నేను అడగకుండానే తన దగ్గరున్న ఏక్‌తారాని మీటుతూ పాట మొత్తం పాడాడు. ఎంత బాగుందో పాట! మొత్తం రికార్డు చేసుకుని క్యాంప్‌లోకి వచ్చాను. ఆ రాత్రి ఆ పాటగుండా నా కాలం ప్రయాణం చేసింది.

మరుసటి రోజు క్యాంప్‌కి రాగానే వాళ్లు ఉన్నారా లేదా అని నా కళ్లు వెదుకులాడాయి. వాళ్లు లేరు కానీ, వాళ్లకి సంబంధించిన పాత్రలు సరంజామా అన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్లు వస్తే చెప్పమని చెప్పి క్యాంప్‌లోకి వచ్చాను. సాయంత్రం నాలుగున్నరకి టీ కోసమని బయటికి వచ్చినపుడు వాళ్ల దగ్గరికి వెళ్లాను. అదే దృశ్యం.. పొయ్యిమీద మసలుతున్న తేనీరు.

ఎక్కడెక్కడికో వెళ్లిన ఆ చెట్టుపక్షులు తిరిగివచ్చి రాత్రి నిద్రకి పక్కని స్థిరపరుచుకుంటున్నాయి. ధూళి ధూసరిత నారింజ సంధ్య, బారులు తీరి ఎటో వెళుతున్న కొంగలు...ఎటు చూసినా పచ్చదనం ఆవరించిన పల్లెటూరు. మనసుకేమిటో ఒకటే సంతోషం కలిగింది. ఆ సంతోషంలోంచే అడిగాను ఏక్‌తారా పట్టుకునివున్న సన్యాసిని "నిన్న పాడిన పాటకి అర్థమేమిటో చెప్తావా'' అని. అతను నవ్వి "బాబూజీకి ఆ పాట బాగా నచ్చినట్లుంది.



 అంతా కృష్ణుడి మహిమ, ఆ పాటలో ప్రేమ ఉంది'' అని చెప్పి, ఒక్కో వాక్యమూ పాడుతూ అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. "శతకోటి జన్మలు ఎత్తి ఎత్తి / కడాన పొందితిమీ మానవజన్మ /ఈ జన్మ జారిపోతే మళ్లీ దొరికేనా/ఇక మళ్లీ దొరికేనా/ నిను మది గుడిలో దాస్తా..విడిచిపెట్టను/ నిను గుండెల్లో దాస్తా విడిచిపెట్టను/ విడిచిపెడితే వేణుగోపాలా మళ్లీ దొరికేవా.../ నీ కళ్లలో కళ్లు కలిపాను ఇక విడువలేను // నిన్ను గుండెల్లో// మన్మోహనా కృష్ణా మునిజన సమ్మోహనా/కృష్ణా/ జై రాధికా మన్మోహనా/ కాదన్నా విడిచిపెడతానా/వెళతానంటే వెళ్లనిస్తానా....// నిన్ను హ ృదయంలో//......పాట సాగుతుండగానే ఆకాశం నీలమేఘ వర్ణంలోకి మారింది, నారింజ ఎండ వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నా. వర్షం జోరున కురవడం మొదలుపెట్టింది.

 ఆహ్లాదకరమైనా ఆ వానకి పక్షులన్నీ ఆనందంగా రెక్కలల్లాడిస్తూ స్నానం చేయడం మొదలుపెట్టాయి. నేనూ, ఆ సన్యాసులూ చెట్టుకింద పొడిగా వున్న చోటికి చేరాం. నేను చెట్టువేరు మీద కూర్చుని ఏక్‌తారా సన్యాసితో అన్నాను-"పాట వినడానికి బాగానే ఉంది కానీ ఏ నాటికీ ప్రత్యక్షం కాని, ఈ భౌతిక ప్రపంచంలో నిరూపితం కాని భగవంతుడ్ని గుండెల్లో దాచుకున్నా, గుడిలో దాచుకున్నా లాభమేమిటి? ఇదేం ప్రేమ? ఎప్పటికీ ప్రత్యక్షం కాని ఆ దేవుడ్ని కొలుస్తూ మీరు చెప్పే ఎప్పటికీ సఫలం కాని ఈ ప్రేమని, 'ప్రేమ' అనరు. పిచ్చి అంటారు.

ఈ పిచ్చితో మీరు సన్యాసులయ్యారు అంతే'' అన్నాను. అట్లని సిగరెట్ డబ్బా వారి ముందు విసిరేసాను. కానీ ఆ పెట్టెనెవరూ ముట్టలేదు. చిన్న సన్యాసి టీ గిన్నెను పొయ్యిపైకి ఎక్కించాడు. వాన విడువనే లేదు. వాన పడని స్థలాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏక్‌తారా సన్యాసి నా మాటలకి చాలా సేపటికి స్పందించి "సరే బాపూ ఇది ప్రేమ కాదనే అనుకుందాం. మరి మీరు దేన్ని ప్రేమ అంటారు?'' అన్నాడు. నేను అతనివైపు తలతిప్పలేదు. ఔను నిజమే దేనిని మనం ప్రేమ అంటాం. ఏమో నాకు తెలీదు. అదే అతనితో చెప్పాను- "దేనిని ప్రేమ అంటారో నాకు తెలీదు. కాని ఎవరిని ప్రేమించాలో మటుకు తెలుసు.

రాయినీ రప్పనీ కాదు, నా ప్రేమకు ప్రతిస్పందన కావాలి అదే నా ప్రేమ''. దానికి సన్యాసి నవ్వి, "బాపూ మీరు చెప్తున్న దానిని ప్రేమ అనరు. మీ భార్యని తీసుకోండి ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది కాబట్టి, వండివార్చి, మీ ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుతుంది కాబట్టి మీకు ఆవిడతో ఒక అవసర పరస్పరత ఉంటుంది. ఆ డిపెండెన్సీని మీరు ప్రేమ అంటున్నారు. ఉదాహరణకు మీకు మగపిల్లవాడు కావాలని ఉందనుకుందాం. మీ భార్య ఆడపిల్లల్నే కంటూ వస్తుంటే అప్పుడు మీకు ఆవిడ మీద మీరు చెప్పే ఆ ప్రేమ పోతుంది. అట్లా ఒక భౌతిక కారణం చేత వచ్చి మరో భౌతిక కారణం చేత పోయేదాన్ని ప్రేమ అనరు. అది అవసరం. ఈ భౌతిక ప్రపంచంలో మనుషుల మధ్య ఉన్నవన్నీ అవసర సంబంధాలే బాపూ'' అన్నాడు.

నేను అతని వంక చూశాను. అతని భాషలోని ఆంగ్ల పదాలు, అతను చెప్పిన వివరణా అతను విద్యావంతుడు అని తెలియచెప్పినట్టు అనిపించింది. అయినా " పిల్లలు మగో ఆడో కావడానికి తండ్రి కర్త అని వైద్యశాస్త్రం నిరూపించింది. నాకు మగపిల్లాడు పుట్టకపోతే నేనే కారణం నా భార్య కాదు'' అన్నాను, నా మాట మా చర్చకు సంబంధం లేనిదని తెలిసినా. సన్యాసి అది విని నవ్వి "చదువు లేని వాళ్ళం కదా బాపు పెద్ద పెద్ద విషయాలు మాకెలా తెలుస్తాయి. ఏదో ఒక పోలిక చెప్పా అంతే'' అన్నాడు. 

 వాన నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. భక్తులలో చలనం మొదలైంది. కానీ నాకు అక్కడి నుంచి లేచి వెళ్లాలనిపించలేదు. హృదయంలో ఏదో తపన బయల్దేరింది. అవును..అసలు ప్రేమంటే ఏమిటి? దేన్ని ప్రేమ అని పిలవాలి? ఇతను చెప్పినట్టు అన్నీ అవసర సంబంధాలే అయితే మనం ప్రేమ అని చెప్పుకుంటున్నది భ్రమ మాత్రమే. మనం ఊరికే ఏవేవో గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుని ఒకలాటి భావస్కలనాన్ని పొందుతున్నాం అంతే! ఇదంతా వట్టి బూటకం. నాకెందుకో దుఃఖం కలిగింది. ఆ సన్యాసి వైపు తిరిగి "బాబా ఆ పాట మళ్లీ పాడుతావా'' అన్నాను. అతను కాదనలేదు.

ఏక్‌తారా మీటుతూ పాడటం మొదలుపెట్టాడు. ఎంత బాగుంది పాట. ఎంత గొప్ప మెసేజ్‌ని ఎంత సరళంగా చెప్పేస్తుంది. ఈ సన్యాసి ప్రార్థిస్తున్న భగవంతుడు చరిత్రలోనైనా దాఖలాలు ఉన్నాయో లేవో కానీ ఇతను ఆ భగవంతుడి పట్ల ఒక ఇష్టాన్ని పెంచుకున్నాడు. తన హృదయం నుండి భగవంతుని హృదయానికి వారధి వేసుకుని మమేకతను పెంచుకున్నాడు. ఆ భగవంతుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాకపోవచ్చు. కానీ భగవంతుడున్నాడనే ఇతని నమ్మకం సడలిపోదు. ఆ దేవుడు ఇతని భౌతిక అవసరాలేమీ తీర్చకపోవచ్చు. కానీ ఇతను భగవంతుడ్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఔను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమే దీని పేరే ప్రేమ. ప్రేమ అంటే అవతలి వ్యక్తి హృదయపూర్వకంగా ఏమైనా ఇయ్యగలిగితే పుచ్చుకోవడం. ఏమీ ఇవ్వలేకపోయినా అతని పట్లో, ఆమె పట్లో ఉన్న పూర్వ భావాన్నుండి మరలకపోవడం.

ఆలోచనల్లోంచి బయటికి వచ్చి నిట్టూర్చి,"బాబా మీకు ఒక కథ చెబుతాను, అది ప్రేమో కాదో చెప్తారా''అన్నాను. ఆ సన్యాసి తల ఊపాడు. "నేను మెడిసిన్ చదివేటప్పటి సంగతి ఇది. ఆ ఏడాది ఎంట్రన్స్ ఫస్ట్ రాంకర్ నాగేందర్ మా కాలేజ్‌లోనే చేరాడు. నల్లగా ఎత్తుగా అందంగా ఉండేవాడు. మితభాషి. సంపన్న గ్రామీణ కుటుంబానికి చెందినవాడు. 

 అతనికీ నాకూ ఎందుకో బాగా స్నేహం కలిసింది. మొదటి ఏడాది గడిచి రెండో ఏడాదిలోకి ప్రమోటయ్యాం. మా జూనియర్లు వచ్చారు. వాళ్లలో ఒకరు దీపాన్విత. నాగేందర్ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఎవరు ఎవరికి ఎందుకు నచ్చుతారో మీ దేవుడ్నే అడగాలి బాబా! ఎందుకంటే ఆ అమ్మాయి సాదాసీదాగా ఉండేది, చదువు కూడా అంతంత మాత్రమే. నాగేందర్ ఎంట్రన్స్‌లోనూ కాలేజిలోనూ ఫస్ట్ ర్యాంకర్. ఏక సంథాగ్రాహి. అందుకని అతను ప్రేమించడం ఆ అమ్మాయి అదృష్టమని మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించేసాం. ఇంక ఆలస్యమెందుకు, ఆ పిల్లకి చెప్పేయమని బలవంతం కూడా పెట్టాం.

హోలీ వచ్చింది. అబ్బాయిలం అమ్మాయిల హాస్టల్ దగ్గరికి వెళ్లి గోలగోలగా రంగులు చల్లుకుంటున్నాం. నాగేందర్ దీపాన్వితని పక్కకి పిలిచాడు. ముందే తెచ్చి పెట్టుకున్న బొకేని, కార్డ్‌ని, చిన్నగిఫ్ట్‌ని ఆ అమ్మాయి చేతిలో ఉంచి, ఆకుపచ్చటి రంగుని ఆ పిల్ల తెల్లని మణికట్టు వద్ద రాసి "ఐ లవ్ యు దీపా'' అన్నాడు. మేమందరం ఈలలేస్తూ గట్టిగా కేరింతలు కొట్టాం. అంతే మేమందరం ఆశ్చర్యపడేట్టు ఆ అమ్మాయి ఆ బొకేని, బహుమతిని నేలమీదకి విసిరేసి ఒక్క నిముషం కూడా అక్కడ నిలబడకుండా విసవిసా హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది. నాగేందర్ స్తంభితుడై నిలబడ్డాడు. నేను వాడి దగ్గరికెళ్లి కుదిపి "పదరా హాస్టల్‌కి వెళ్దాం'' అన్నాను. వాడేం మాట్లాడలేదు వచ్చేశాడు.
ఆ తరువాత దాని గురించి ఏం పట్టనట్లు కొన్ని రోజులు మామూలుగానే ఉన్నాడు. ఆ తరువాత నుండి నెమ్మదిగా తనలో తను అనుకుంటున్న 'దీప నాకు కావాలిరా, ఇదిగో ఇట్లా కూర్చుని ఆలోచిస్తుంటే అది లేకుండా బ్రతకడమెట్లాగో అర్థం కాకుండా ఉంది'' అనేవాడు. ఎప్పుడూ దీప...దీప అదే ధ్యాస. అంత తెలివైనవాడు కదా, అయినా కావాలనే ఒక సంవత్సరం పరీక్ష రాయకుండా ఫెయిలై దీప క్లాసులో కలిసాడు. రోజూ ఆ అమ్మాయిని చూడటానికి క్లాసుకి వెళ్లినా క్లాసులో విన్నదే సరిపోయేదనుకుంటా ప్రతి సబ్జెక్టులో టాప్‌గా నిలిచేవాడు. మేం నాలుగో ఏడుకి, వాడు మూడో ఏడుకి వచ్చాక ఒకరోజు మళ్లీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఏదో జన్మజన్మల శత్రుత్వం ఉన్నట్లు ఆ పిల్ల వాడిని ఛీకొట్టింది.

 మేమందరం కూడబలుక్కుని వాడికి కూడా చెప్పకుండా ఆ పిల్లని కలిసి అడిగాం "నిన్ను అంతగా ప్రేమిస్తున్న ఆ అబ్బాయిని కాదనటానికి కారణమేమిటి? వాడికి దేనికి లోటు?'' అని. ఆ అమ్మాయి చాలా సింపుల్‌గా చెప్పేసింది, "నేను ప్రేమ పెళ్లి చేసుకోనని మా అమ్మకి మాటిచ్చాను. అది తప్పను'' అని. మేము ఆ పట్టుదలకి ముచ్చటపడి "సరే వాడి పేరెంట్స్‌ని మీ ఇంటికి వచ్చి అడగమంటాం'' అన్నాం. అందుకు ఆ పిల్ల చాలా మొండిగా "అతని కులం, మా కులం, అతని ప్రాంతం, మా ప్రాంతం వేర్వేరు, మా అమ్మ నాన్న ఒప్పుకోరు'' అన్నది. మాకు ఆశ్చర్యమేసింది, ఏం స్వభావమిది అని..నేను కథను అక్కడ ఒక నిమిషం ఆపి "మీ దేవుడు కూడా కులాలు పాటిస్తాడట కదా బాబా! ఇంతకీ మీరు దేవుడు ప్రేమించే కులంలోనే పుట్టారా?''అన్నాను కొంత వెటకారంగా. అందుకు ఆ సన్యాసి వెంటనే బదులు పలకలేదు.

కాసేపటికి "కథ పూర్తి చెయ్యి బాపూ'' అన్నాడు. నేను మళ్లీ మొదలుపెట్టాను "దీపను కలిసిన విషయాన్ని నెమ్మదిగా నాగేందర్‌కి చెప్పాం. ఇక ఆ పిల్లని మరిచిపొమ్మని చెప్పాం. నాగేందర్ అప్పుడేమీ మాట్లాడలేదు. తరువాత పదిరోజులకి వాళ్లింటికి వెళ్లాడట. అక్కడేం జరిగిందో మాకు అతను చెప్పలేదు. మరో పదిరోజులకి దీపాన్విత క్లాస్ నుండి హాస్టల్‌కి వెళుతున్నపుడు నాగేంద ర్ ఆమె మీద యాసిడ్ పోశాడు. చాలా జాగ్రత్తగా ఆమె చుట్టుపక్కల ఉన్న మిగిలిన అమ్మాయిలని కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి వెళ్లండి అని చెప్పి వాళ్లు వెళ్లాక యాసిడ్ ఆమె ముఖం మీద పోసి, ఆగి, ఆమె ఆక్రందనని విని హాస్టల్‌కి వచ్చి, ఆ విషయాన్ని మాకు చెప్పి హాస్టల్ వదిలి వెళ్లిపోయాడు.

మరి కాసేపటికి పోలీసులు వచ్చారు. మమ్మల్నందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఎన్ని రోజులు ప్రయత్నించినా నాగేందర్ మాత్రం పోలీసులకు దొరకలేదు. మరికొంతకాలానికి రైలుకిందపడి చచ్చిపోయాడని తెలియవచ్చింది. అందరం బాధపడ్డాం. ఎంత తెలివైనవాడో, ఎంత మంచి డాక్టర్ కాగలిగేవాడో గుర్తొస్తే విపరీతంగా దుఃఖమొచ్చేది. అందరికీ దీపాన్విత మీద ద్వేషం కలిగేది. చచ్చిపోతే పోయాడు మంచిపని చేసి పోయాడు అనుకునేవాళ్లం.

యాసిడ్ దాడి తరువాత ఆ అమ్మాయి చాలా సార్లు ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లింది, కొన్ని సార్లు ప్రభుత్వ సహాయంతో, కొన్నిసార్లు సొంతడబ్బులతో. అయినా ఆ అమ్మాయి ముఖం ఎంత వికారంగా మారిపోయిందంటే పెద్దవాళ్లకి కూడా ఆ పిల్ల ముఖం చూస్తే భయం వేసేది. ఆ అమ్మాయికి కూడా అది తెలుసేమో ఎప్పుడూ ముఖాన్ని చున్నీతో కప్పేసుకునేది.

తరువాత మా కోర్సులు ముగిసిపోయాయి. ఎవరి ఊర్లకి వాళ్లు వెళ్లిపోయాం. కానీ మా అందరి మనసుల్లో నాగేందర్ నిలిచిపోయాడు. ఎప్పుడు గుర్తొచ్చినా ఒక్కటే అనుకునే వాళ్ళం ఎంత ప్రేమించాడు ఆ పిల్లని. అంత గొప్ప ప్రేమని కాదన్నది దుర్మార్గురాలు, వాడి జీవితాన్ని నాశనం చేసిందని. బాబా ఇప్పుడు చెప్పండి నాగేందర్ చేసింది తప్పా? తప్పే అయితే ఎందుకని తప్పు? కులము, డబ్బు, స్తోమత అన్నీ పుట్టేటప్పుడు నిర్ణయించుకుని పుట్టము కదా? డబ్బు లేదనో చర్మం రంగు నల్లగా ఉందనో, కాని కులమనో హృదయపూర్వకమైన ప్రేమని తిరస్కరించడం తప్పు కాదా?'' అన్నాను.

సన్యాసి నిట్టూర్చి "బాపూ డబ్బు, రంగు, రూపం మన చేతుల్లో లేనట్లే మన ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు మన చేతుల్లో ఉండవు. అన్నీ ఉన్న మీ స్నేహితుడు ఆ అమ్మాయికి నచ్చకపోయి ఉండొచ్చు. ఏమీ లేని వాళ్లు నచ్చనూ వచ్చు. ఇదంతా పక్కన పెడితే, బాపూ ఒక్క మాట చెప్పు, నీ స్నేహితుడికి ఆమెని ప్రేమించే హక్కు ఎంత వుందో అతన్ని కాదనే హక్కు ఆమెకూ అంతే వుంటుంది కదా.

నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పినందుకు యాసిడ్ పోస్తారా బాపూ? మనం మనుషులం అనే స్పృహ ఉందా మీకు? మీ నాగేందర్‌నే మరో అమ్మాయి ప్రేమించిందనుకుందాం. ఆవిడ నాగేందర్‌కు నచ్చలేదనుకుందాం. అప్పుడు ఆమె నాగేందర్ మీద యాసిడ్‌దాడి చెయ్యాలి కదా? దీనికి అంతం ఏది బాపూ? ఇది ప్రేమ కానే కాదు. మనం ఎవరికైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అడగాలి. పోకిరీ వాళ్లమయుంటే ఆ అమ్మాయి ప్రేమకోసం బుద్ధిమంతులం అవ్వాలి. ఆ ప్రేమకోసం మనకి వీలైనంతా చేయాలి. అప్పటికీ అవతలి వ్యక్తిని మెప్పించలేకపోతే తప్పుకోవాలి-అదీ ప్రేమంటే. నాగేందర్ చేసింది మంచి పని, అతనిది గొప్పప్రేమ అంటున్న మీలో కూడా మానవత్వం ఎంత వుందో చూసుకోండి బాపూ'' అన్నాడు అసహనంగా.

చిన్న సన్యాసి అందరికీ టీలు తెచ్చి ఇచ్చాడు. ఈ సారి నాకూ ఇచ్చాడు. నేను టీ తీసుకుని ఒకసారి బలంగా నిట్టూర్చి సన్యాసితో "కథ అక్కడితో అయిపోలేదు బాబా, కొనసాగింది. మాకందరికీ పెళ్లిళ్లయ్యాయి. మా పిల్లలు మూడో క్లాసులకి నాలుగో క్లాసులకి వచ్చారు. ఒకనాటి రాత్రి హాస్పిటల్ నుండి వచ్చి ఫ్రెషయ్యి సిస్టం ముందు కూర్చుని మెయిల్ చెక్ చేసుకుంటున్నాను.

ఏదో ఇంగ్లీష్ పేరుతో మెయిల్ ఒకటి వచ్చింది. సబ్జెక్టులో రేయ్ రమేష్ నేను నాగేందర్‌ని రా! దీపాన్విత నాగేందర్‌ని రా అని ఉంది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మెయిల్ ఓపెన్ చేసాను. నాగేందర్! మా నాగేందర్! ఇంకెవరికి తెలుసు దీపాన్విత అనే పేరు? నాగేందర్ బ్రతికే ఉన్నాడు. నేను ఉత్తరం చదవడం మొదలుపెట్టాను, ఏమన్నాడు వాడు"రేయ్ నేను దీపాన్విత నాగేందర్‌ని రా'' అని. ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమ కదూ! దుఃఖం వచ్చింది. "మీరందరూ అనుకున్నట్టు నేను చచ్చిపోలేదు రా రమేష్, మా అమ్మవాళ్లు చాలా ప్రయత్నాలు చేసి, పోలీసులను మేనేజ్ చేసి నన్ను మారుపేరుతో ఫారిన్‌లో వున్న మా అత్త దగ్గరికి పంపేశారు.

నేనిక్కడ మళ్లీ మెడిసిన్ చదవడం మొదలుపెట్టాను. మీ అందరి గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను. ముఖ్యంగా దీపాన్విత గురించి. అప్పుడు కోపంలో యాసిడ్ పోసినా తరువాత బాధ కలిగింది. తనని ఎలాగైనా ఫారిన్ రప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో తనకి పెళ్లయిపోయింది ఎవరో దయ్రార్ద హృదయుడితో. నిజం చెప్పాలంటే నాకు వాడ్ని చంపేయాలనిపించింది. పగలు,రాత్రి ఒకటే గుండెకోత. దీపాన్విత నాది, వాడెవడు మధ్యలో? దాని శరీర ము, మనసూ నాదే కావాలి. అది నన్ను కాదన్నది సరే, కానీ ఎవరికైనా దాన్ని ఎలా ఇవ్వగలను. ఎంత ప్రేమించాను దాన్ని.

అది గుర్తురాని క్షణం ఏదైనా ఉందని నేను గుండెమీద చెయ్యేసుకుని చెప్పలేనురా రమేష్, ఇండియా వచ్చి వాడ్ని చంపేద్దాం. అనుకున్నాను, అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఏం చెయ్యాలి? నా దీపాన్విత నాదిగానే ఉండాలి. రోజు రోజుకి దుఃఖం పెరిగిపోయింది. నెమ్మదిగా డిప్రెషన్ మొదలయింది. అమ్మ నాన్న వచ్చారు. ఎవరెవరో ఏదేదో చెప్పారు, ఏం చెప్పినా ఆ పిల్ల లేకుండా జీవించడమెలాగో నాకు అర్థం కాలేదు రా, ఇప్పుడు బ్రతికి నేను సాధించాల్సింది ఏముంది, ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ని కాగలనట, నిజమే కానీ ఆ ప్రఖ్యాతి నాకు ఏం తెచ్చిపెడుతుంది. దిశా నిర్దేశాన్ని కోల్పోయిన జీవితాన్ని జీవించి ఏం లాభం? దీపాన్విత ప్రేమని పొందలేని జన్మ వ్యర్థమనిపించింది. చచ్చిపోదామని అనుకున్నాను. పోయే ముందు నన్ను ప్రేమించే నిన్ను పలకరించి పోదామనుకున్నాను''.

నా మెదడు మొద్దుబారింది. ఇదంతా నిజమేనా అని వాళ్లింటికి ఫోన్ చేశాను. అంతా నిజమేనన్నారు. చాలా దుఃఖమేసింది. ఎంత గొప్ప ప్రేమికుడు? స్నేహితులమందరం కలుసుకుని వాడిని మరోసారి స్మరించుకున్నాం. మా మనసుల్లో వాడో అమర ప్రేమికుడు. ఇప్పుడు చెప్పండి బాబా నాగేందర్‌ది నిజమైన ప్రేమా? కాదా? అన్నాను. నా ముందు విద్యా విహీనుడితో సమానమైన ఆ పేద సన్యాసితో నా మాటకి అవుననిపించాలన్న పట్టుదల ఏదో నా గొంతులో కనిపించినట్టుంది. అందుకేనేమో అతను చాలా మృదువుగా "బాపూ! మీకు చెప్పగలిగే వాణ్ణి కానే కాదు. కానీ ఒక్క ప్రశ్న మీకై మీరే వేసుకోండి "అసలు ప్రేమంటే ఏమిటి'' అని. ప్రేమ హాయిగా నవ్వే పసిబిడ్డలాటిది.

మనం రమ్మని చేతులు చాస్తాం. పసిపాప ముఖం తిప్పుకుంటుంది. నా అంతటి వాడిని చేతులు చాస్తే రానంటుందా అని ఆ బిడ్డని లాగి నేలకేసి కొడతామా? ఊహించడానికి ఎంత కిరాతకంగా ఉంది ఆ దృశ్యం. నాగేందర్ ఆ అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. కాదన్నదని యాసిడ్ పోశాడు. అయినా సంతృప్తి కలగలేదు. తనని తాను హత్యచేసుకున్నాడు. దీనిని ప్రేమ అని, అందులోనూ చాలా గొప్ప ప్రేమ అని అంటున్నారు మీరు. కానే కాదు బాపూ. ప్రేమ అద్భుతమైనది. ప్రేమతో నిండివున్న మనసు వెన్నపూసలా మృదువుగా ఉంటుంది. ఎదుటి మనుషుల చిన్ని చిన్ని కష్టాలకు కూడా ఇట్టే కరిగిపోతుంది. ప్రేమ దాడి చేయదు. హత్యచేయదు. తనను తాను చంపుకోదు.

ఒక మనిషిని తెచ్చి మన ఇంట్లో మన పడక గదిలో పెట్టుకుని సంభోగించి పిల్లల్ని కనడాన్ని మీరు ప్రేమ అంటున్నారు. అది ప్రేమ కాదు. వట్టి కామప్రకోపం. దాన్ని అదే పేరుతో పిలవడం మంచిది.
మీ నాగేందర్ ఆమెను నిజంగా ప్రేమించి ఉంటే ఆమె ఇష్టానికి ఆమెను వదిలేసి కూడా ప్రేమించేవాడు. ఆమె మనదని మనం భావించినంత సేపూ ఆమె మానసికంగా మనతోనే ఉంటుంది. బాపూ! మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో, అప్రమేయంగా ఏది మనల్ని ఆవహించగలదో, మనలో లయమై విడివడి కనిపించనిదేదో, విడివడలేనిదేదో అక్కడక్కడే మనం!!!'' అన్నాడు.

అతని మాటలు నాలో ఏదో శాంతిని నింపాయి. ఇద్దరం మౌనమయ్యాం. ఆ సన్యాసి పలికిన బరువైన చివర వాక్యాలు నిజానికి నాకు అర్థం కూడా కాలేదు కానీ అసలైన ప్రేమ ఏదో నన్ను ఆవ హించిన భావం కలిగింది.

నెమ్మదిగా చీకట్లు ముసురుకున్నాయి. నా స్నేహితులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను వాళ్లకి చేయి ఊపి ఇక్కడ ఉన్నానని చెప్పి సన్యాసితో "బాబా వెళ్తున్నాను. మీతో పరిచయం బాగుంది. ఆ పాట మరొకసారి పాడగలరా'' అన్నాను. అతను ఏక్‌తారా మీటుతూ పాడటం మొదలుపెట్టాడు. అతని అశిక్షిత కంఠం నుండి వినిపిస్తున్న ఆ ప్రేమ పాట మా చుట్టూ అలుముకుంటున్న చీకటిని దీప్తివంతం చేయడం మొదలుపెట్టింది.
అమీ ఓ నయొనె నయోన్ దియా ఆర్ తో ఫిర్ భో నా
(నేను ఆ కనులతో కనులు కలిపాను ఇక వెనుదిరగను)
జేతే దాయ్లె..జేతే దాయలే..జేతే దీబొనా
(వెళ్లాలనుకున్నా..వదిలెళ్లాలనుకున్నా..వెళ్లనీయను)
తొమాయ్ హ్రిద్ కమలే రాఖిభో ఛేడే దీబొనా **
(నిన్ను హృదయకమలంలో ప్రతిష్టించుకుంటాను విడిచిపెట్టను)

 gandavarapusamanya@gmail.com
............................................
* గోరటి వెంకన్న పాట
** బంగ్లాదేశ్, బెంగాల్‌లలో ప్రసిద్ధిగాంచిన బౌల్ జానపద గీతం

http://andhrajyothy.com/ContentPage.jsp?story_id=32168&category=sunday_special

https://www.facebook.com/groups/telugupustakam/497071713707979/?notif_t=group_comment

No comments:

Post a Comment