Tuesday, July 30, 2013

జయశ్రీ నాయుడు || కభీ కభీ మేరే దిల్ మే... ||

.కభీ కభీ మేరే దిల్ మే 


గాత్రం పాదరసంలా ప్రవహించింది
శబ్దం నిశ్శబ్దాన్ని నిలదీసింది 

ఓక నిశ్శబ్దం ఎన్నో శబ్దాలకు మాతృక
ఒక వెలుతురు ఎన్నో చీకట్ల మధన జననం 
ఒక చూపు ఎన్నో గుడ్డితనాల గమ్యం 
ఒక జ్ఞానం ఎన్నో అజ్ఞానాల తీరం 

పయనించాలనుకున్న పాదాలు 
ముందుకో వెనుకకో 
విరామం లో ఆరామాన్ని వెతుక్కునే లోగా
మరో పయనం కోసం పిలుపులు 


కభీ కభీ మేరే దిల్ మే 
ఖయాల్ ఆతా హై 

జీవితపు వేళ్ళెక్కడో పాతుకుని 
బైటకు పంపిన చిగుళ్ళ పచ్చదనం
రోజుల్లా పుష్పిస్తుందా 

ప్రతి రేకూ విత్తై మొలకెత్తే
ఓ మోహన ఘడియ కోసమేనా 
ప్రతి కలా కాలం చీటీ మీద అక్షరమవడానికేనా 

కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై 

(ఇవేళ ముఖేష్ గాత్రం మనసంతా 
కభీ కభీ.. పాడుకుంటూ.. ) 

జయశ్రీ నాయుడు ||అంతా అ'మాయకత్వమే|


ఉదయం తో మేల్కొని 
రోజంతా దూదిపింజల్లా 
వెంటనడుస్తాయి..

జ్ఞాపకాలై 
సాయంత్రాన అలిసి 
గుండెకు తరలించిన ఆలోచనలు 

అలలు మోసుకొచ్చే నీటి తుంపరలు
తీరం లెక్కించని రేణువులు

ఆకాశం కప్పుకున్న అరుణం 
ఉదయానిదా అస్తమయానిదా.. 

నీకైనా తెలీని కాలం పెదవి మెదపలేదేమో

అంతా అ'మాయకత్వమే

Sunday, July 28, 2013

Article by Vadrevu Chinaveerabhadrudu


ఎవరో అన్నారు, సంగీతాన్ని అనుకరించి మాత్రమే నేర్చుకోగలమని. బహుశా ఆ మాట కవిత్వకళకి కూడా వర్తిస్తుంది. నా మటుకు నేను కొందరు కవుల్ని నమూనాలుగా పెట్టుకునే కవిత్వసాధన చేస్తూంటాను. అట్లాంటి కవుల్లో జర్మన్ కవిశ్రేష్టుడు రేనర్ మేరియా రిల్కె (1875-1926)ని ముఖ్యంగా చెప్పుకోవాలి. ....
ఎవరో అన్నారు, సంగీతాన్ని అనుకరించి మాత్రమే నేర్చుకోగలమని. బహుశా ఆ మాట కవిత్వకళకి కూడా వర్తిస్తుంది. నా మటుకు నేను కొందరు కవుల్ని నమూనాలుగా పెట్టుకునే కవిత్వసాధన చేస్తూంటాను. అట్లాంటి కవుల్లో జర్మన్ కవిశ్రేష్టుడు రేనర్ మేరియా రిల్కె (1875-1926)ని ముఖ్యంగా చెప్పుకోవాలి.

నా రాజమండ్రి రోజుల్లోనే (1982-87) నేను రిల్కే గురించి విన్నాను. బైరాగి 'ఆగమగీతి ' లో రిల్కే కవితలు మూడు అనువాదాలున్నాయి. కాని ఆ కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ కవిత్వశిల్పాన్ని అవగతం చేసుకోవడానికి నాకు చాలా ఏళ్ళే పట్టింది.

దాదాపు ఒక శతాబ్దంగడిచిన తరువాత కూడా అయన కవిత్వానికి సరికొత్త అనువాదాలు వెలువడుతున్నాయి. జె.బి.లీష్ మేన్ లాంటి తొలితరం అనువాదకులు మొదలుకుని ఎడ్వర్డ్ స్నో, స్టీఫెన్ మిచెల్ లాంటి మలితరం అనువాదకులదాకా ప్రతి కొత్త అనువాదకుడూ ఆయన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తూనేవున్నాడు.

రిల్కే కవిత్వంలో ఇంద్రజాలం ఏమిటి? దాన్ని కొన్ని మాటల్లో స్పష్టంగా చెప్పడం కష్టం. ఒక్కమాట మాత్రం చెప్పవచ్చు. అతడిది కఠినాతికఠినమైన సాధన. తెంపులేని అన్వేషణ. తనకవితలెలా ఉన్నాయో చెప్పమని అడిగిన ఒక యువకవికి అతడిచ్చిన సలహా 'లెటర్స్ టు ఎ యంగ్ పొయెట్ (1929) గా పుస్తకరూపంలో ప్రసిద్ధి చెందింది. కవితాసాధకులు ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం అది. అందులో ఒకచోట ఇలా అంటాడు:

'నిన్ను రాయడానికిపురికొల్పుతున్నదేదో కనిపెట్టు, ఆ కోరిక నీ హృదయాంతర్భాగాల్లో వేళ్ళుతన్నుకుందో లేదో చూడు.నువ్వు రాయకుండా ఉండలేకపోతే నీకు చచ్చిపోయినట్టనిపిస్తుందా-నిన్ను నువ్వు తరచి చూసుకో. అన్నిటికన్నా ముందు ఈ ప్రశ్న. నీ ఏకాంతసమయంలో, రాత్రి నిశ్శబ్దంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో: నేను రాసితీరాలా? దానికి విస్పష్టమైన సమాధానం కోసం నిన్ను నువ్వు తవ్వి చూసుకో. ఒకవేళ అవునని జవాబు వచ్చిందనుకో,ఇక నీ జీవితం మొత్తం ఆ అవసరానికి తగ్గట్టుగా మలుచుకో.ని జీవితంలోని ప్రతి ఒక్క సాధారణ, అప్రధాన క్షణం కూడా ఆ కోరికకి అనుగుణంగానే జీవించు. అప్పుడు ప్రకృతికి చేరువగా జరుగు. నువ్వు చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ,ఇష్టపడుతున్నదీ, పోగొట్టుకుంటున్నదీ ప్రతి ఒక్కటీ మొదటిసారి నీకే సంభవిస్తున్న మనిషిలాగా రాయి..'

రిల్కే రోడే అనే ప్రపంచ ప్రసిద్ద శిల్పికి కార్యదర్శిగా పనిచేసాడు. రోడే రాతిని శిల్పంగా చెక్కినట్టుగా రిల్కే దృశ్యాన్నీ, అనుభూతినీ కవితగా మార్చాలని తపించాడు. అందుకని విమర్శకులు రోడే రిల్కే కవిత్వాన్నే ఒక శిల్పంగా మార్చేసాడన్నారు. ఒక కవి తనకు గోచరిస్తున్నదాన్ని కవితగా మలచడమెలానో తెలుసుకోవాలంటే రిల్కే కవిత్వాని పదే పదే చదవడం కన్నా దగ్గరిదారి లేదు.

ఆ కవిత్వ శిల్పానికి రెండు ఉదాహరణలు. మొదటిది అర్చైచ్ తొర్సొ ఒఫ్ ఆపొల్లొ (1908) కవిత. ఒక కవిని ప్రపంచం మర్చిపోకుండా ఉండటానికి ఇటువంటి కవిత ఒక్కటి చాలు అన్నాడొక విమర్శకుడు. రెండవది, ఒక పండు మీద రాసిన కవిత థె ఫ్రుఇత్(1924).

1.

ప్రాచీన భగ్నదేవతావిగ్రహం

ఆ శిరసెలాఉండేదో మనకెప్పటికీ తెలియదు, కాంతి
సమస్తం ఆ ప్రసిద్ధ నేత్రాల్లో పరిపక్వమైంది, కాని ఆ
మొండెం మాత్రం కొద్దిగా కాంతిమందగించిన వీథిదీపంలా
జ్వలిస్తూనే ఉంది, ఎన్నాళ్ళకిందటో అందులో రగిలించిన

అతడి దృష్టి మాత్రం దాన్నింకా అంటిపెట్టుకు మెరుస్తోంది,
లేకపోతే, ఎగిసిపడుతున్న ఆ వక్షస్థలతరంగానికి నీ కళ్ళు
బైర్లు కమ్మేవి కావు, ప్రజననకేంద్రంవైపు ఒకింత మెలితిరిగిన
కటిప్రదేశం మీంచి ఒక మందహాసం దూసుకుపోయేదికాదు

ఆ భుజాల పారదర్శకపు వాలుకింద రాయిగా,చల్లగా
మిగిలిపోయి, వన్య మృగాల ఉన్నిలాగా నిగనిగలాడేదికాదు,
తన రేఖలన్నిటితోనూ తారగా మారేదికాదు, ఇప్పుడక్కడ
నిన్ను పరికించని చోటు లేదు, నువ్వు మారక తప్పదు.

2.

పండు

అది నేలనుంచి అదృశ్యంగా పైకి పాకి పాకి
నిశ్శబ్దకాండంలో తన రహస్యాన్ని దాచుకుంది
లేతమొగ్గలో తననొక జ్వాలగా రగిలించుకుని
తన రహస్యాన్ని మళ్ళా తనలోకి లాక్కుంది

రాత్రింపగళ్ళు ప్రసవవేదనపడుతున్న చెట్టులో
ఒక వేసవి పొడుగుతా ఫలప్రదమయ్యింది
తనని పిలుస్తున్న విశాలాకాశాన్ని తక్షణమే
చేరుకోవాలని తనంతతానే ఆతృతపడింది

ఇన్నాళ్ళుగా పొందిన విశ్రాంతితో ఇప్పుడది
కొత్తగా, గుండ్రంగా, కాంతులీనుతున్నప్పటికీ
తన అంచుల్లోంచి పరిత్యక్తభావనతో తన
ప్రాదుర్భావకేంద్రానికే వెనుతిరుగుతున్నది

Thursday, July 18, 2013

వాడ్రేవు చిన వీరభద్రుడు A poem for today:

రాత్రంతా ఆకులమీంచి ఆకులమీద
రాలుతున్న వానచప్పుడు, బల్లలమీద
బొమ్మలాటవాళ్ళు మద్దెలమోగించినట్టు,
నేనిక్కడున్నానుగాని, నేనిక్కడ లేను.

మబ్బులు మాట్లాడుతున్న ప్రాచీనభాష
భూమికీ, అకాశానికీ, అంతరిక్షానికే
తెలుసు. అదేమిటో వివరించాలంటే
కొత్తగా నేనొక భాష కూడబలుక్కోవాలి

ఎన్నో వర్షాలు చూసాను, మబ్బులు
నాతో మాట్లాడటమిదే మొదటిసారి.
ఇట్లాంటి వర్షాలొక వందచూస్తేనే
నువ్వు శతవర్షాలు జీవించావంటారు

Tuesday, July 16, 2013

|| జ్ఞాపకాల మనసు|| -- జయశ్రీ నాయుడు


చూపు కంటికి మాత్రమే కాదు
మనసుకూ వుంది

స్పందనలోని అర్థం హృదయానికే కాదు
చూపుకూ చేరుతుంది

తెలియకనే పరుగులు తీసిన రోజులు
కనపడని అందాన్ని హత్తుకున్నాయి

చూపూ స్పర్శా కాలమూ చేసిన ఇష్టాగోష్టి లో
ఎన్ని నిశ్శబ్దాలు తమని తాము చెక్కుకున్నాయి

కథలైన మనసు పేజీలు
ఎన్ని రాతలకో సిరా ఐన ఆలోచనలు

పోగేసిన అక్షరాల్లోంచి
భావాన్ని జ్ఞాపకాలుగా వడపోస్తున్నాయి

మబ్బులోంచి చినుకులోకి... by AFSAR

మబ్బులోంచి చినుకులోకి...

----

ఆకాశం నేలకి రాసుకున్న ప్రేమలేఖ ఈ వాన
-ఖలీల్ జిబ్రాన్


1
కనిపించని వొక నిశితమయిన కుంచె
ఆకాశాన్ని అలా వొరుసుకుంటూ వెళ్ళిపోయింది
వొక దృశ్యంలోకి మనం
అందంగా వొదిగిపోయాం
అర్థాలు వెతుక్కుంటూ-

2
మబ్బులకు భలే తెలుసు,
మనిద్దరికీ ఏం కావాలో!

3
రాయలేని వొక ప్రేమలేఖ
గాలి అలలమీంచి కాసిని వాన చుక్కల బుగ్గల మీంచి
అలా రాసుకుంటూ వెళ్ళిపోయింది
హాయ్..రే...హాయ్...అని కూనిరాగం పాడుకుంటూ.

4
విడిపోడానికి నిరాకరించే
రెండు బిగి పెదవుల్లా
ఆకాశమూ నేలా.

5
ఇక
ఏక ధారగా వాన. 

Sunday, July 14, 2013

గుప్పెడు కాలం -- జయశ్రీనాయుడు

గుప్పెడు కాలం లో  వెలుగంత అనుభవం 

తెలియని క్షణాల నుంచి తెలుసుకున్న హృదయం

మరో తెలియని కాలం వైపు ప్రయాణం

నన్ను నేను నేనున్నానా అని ప్రశ్నించుకోలేదు 

హృదయాన్ని వానలో చినుకు చేశాను

నాకు నేనై తడుస్తున్నాను