Showing posts with label Jayashree Naidu. Show all posts
Showing posts with label Jayashree Naidu. Show all posts

Sunday, January 19, 2014

కాదిది దూరాభారం... - Jayashree Naidu


దూరం అడుగులేస్తోంది
దగ్గరను నెట్టేస్తూ..
కౌగిలించేంత దగ్గరలున్నాయి 
శ్వాసించిన క్షణాలున్నాయి 



క్షణాలు దారప్పోగులవుతున్నాయి
అనుభవాల్ని అల్లుకుంటూ...
భావం పరిమళించిన క్షణం
అదో విహంగ వీక్షణం 

పువ్వులు కనిపించని ముద్దిస్తున్నాయి
మరో మొగ్గకు చిగురవుతూ... 
ఇవేళ్టి గాలి కలగంటోంది 
అణువుల్ని నింపే పుష్పవనం కోసం 



వర్తమానమంతా అద్దంలో చూస్తోంది
గతకాలపు జ్ఞాపకాల ప్రతిబింబమౌతూ... 
అలంకరించుకుంటోంది
అలవాటుగా మారని అనిత్యంతో 

అరచేతులు రెండూ ఏకమౌతున్నాయి 
ఆ జ్ఞాపకాల దోసిలవుతూ... 
కాలమెంత సుగంధమో కదా
అక్షరాల్లోకి ఇమడనపుడు.



******** 19-01-2014

Monday, January 13, 2014

లైఫ్ ఈజ్ అ గేం - ప్లే ఇట్... Jayashree Naidu

చుక్కల్లా మినుకుమనే మాటల మధ్య
చిక్కగా అల్లుకునే ఆకాశపు మౌనం 

ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ మొదటికే వస్తాం 
ఎందుకీ శబ్దపు అసందర్భాలంటూ


ఖాళీతనపు పాదాలు జరిపి
మాటకి కొంచెం చోటిచ్చి

మధ్యలో పలువరుసలు తళుకులద్ది
గుండె మరకల్ని దాచాలనే ఆత్రం 

అన్నీ తెలుసు
ఏదీ తెలీదు
సరిహద్దు రేఖ మనమే  

అటు నుండి ఇటూ 
ఇటు నుండి అటూ 
గందరగోళపడే అవకాశాన్నిచూస్తూ
మనసు ఆడుకుంటుంది జీవితమై 

లైఫ్ ఈజ్ అ గేం - ప్లే ఇట్... 



Friday, January 3, 2014

ఇదీ స్నేహమే -- Jayashree Naidu

స్నేహం చిక్కదనం 
అద్దమని అనుకుంటాం కానీ.. 
ఒక్కో సరస్సులో.. ఒక్కో మనస్సు..

కొన్ని హృదయాల్లో ఘాటుదనం వెనక దాగిన
తేట దనం ఓ పట్టాన చేతికందదు
చూపుకిమడదు 

ఒడ్డున కూర్చుని
మాసాల తరబడి ఆలోచనల 
సమాసాల విశ్లేషణలు నడుస్తాయి
వూరగాయ కమ్మదనం లా
వీళ్ళూ అంతే...
కొంచెం ఓపికనే నెయ్యిని ప్రక్కనే వుంచుకోవాలి మరి

Tuesday, December 31, 2013

the best friend for a YEAR 2014 -- Jayashree Naidu

Empty the capsule
Let the grains fill it

spices or sweetens
Time is the ingredient

the lake or snowflake
ocean or a pond....

is an empty space
before water filled it

the vacuum is a welcome
be it the first step for creation

the night emptied the heart
and the dawn lit its sky!

Learn to vacuum the thought
and let the heart stay young! 

No Resolution is the Best Resolution
:) Welcome New Year 
You are gonna be the best friend for a YEAR!



Sunday, December 8, 2013

ఇది నిజం...

ఇది నిజం...

మార్పుకు అతీతమైన క్షణం యేదీ...

ఇంత దూరం తోడొచ్చిన అడుగుల్ని అడగొద్దు
ఎన్నో చూపుల్ని కలిపిన కన్నుల్నీ అడగొద్దు
కళ్ళూ మూసి నిశ్చలంగా గుండెచప్పుడైన క్షణాల్ని అడుగు..
ఫక్కున నవ్వుతాయి..
అమాయకత్వానికి..

గడిచిన ఆకాశం
యే ఉదయంలోనూ దొరకదు
రాత్రి వలువలు చుట్టుకున్న ఆలోచనలు
రోజుకో రంగు సింగారించుకుంటాయి
మనసు అరచేతపట్టుకుని
అద్దంలా చూడు
నేను కనిపించానా..
అద్దం అబద్ధమే చెప్తుంది..

ఋతువులు రాగాలే
ఆలాపనల మోహాలే
మబ్బుల వానల పలుకుల్ని
ఆకుల దొన్నెల్లో అందుకునే చేతులే
కురవని కాలం
తడిసే హృదయం
రెంటి లిపికీ మౌనమే అనువాదం

-- జయశ్రీ నాయుడు


Saturday, October 26, 2013

||ఓ క్షణం కవితైన వేళ... || జయశ్రీనాయుడు


కవీ..
ఎక్కడి కాలాన్నో తెచ్చి 
హృదయాన్ని అద్ది 
పదాల పోగులకి తళుకులద్దే అద్దకపు పని వాడివి

కొంచెం ప్రేమ కొంచెం కన్నీరు 
మిణుగురుల్లాంటి ఆశలూ 
తూనీగలంటి కొంటెతనాలూ
నీ చుట్టూ పోగేసుకుంటావు
ఓ స్వాప్నిక ప్రేమ మయమౌతావు! 




నీలోని అణువణువూ అనుభూతిమయమైనపుడు
పంచుకోలేని ఏకాంత సమయమైనపుడు
కలలన్నీ కణాల్ని నిప్పుకణికల్ని చేస్తున్నపుడు 
నీ లోని కల్లోలానికి తిరుగుబాటు నేర్పుతావు 
అక్షరాల సైన్యం తో సామ్రాజ్యాలు జయిస్తావు 

నీలోని బాధ గట్లు తెగి ప్రవహిస్తే 
నీలోని లోతులు నిన్ను స్పృషిస్తే
నీలోని ఆకాశం దిక్కులు చాలనిదైతే
భోరుమనే రోదనే రుద్రావతారమైతె.. 
పద తాండవానికి వేదికవవుతావు 




నిరాశల దుప్పట్లని కప్పుకున్న హృదయాన్ని 
నిలువునా దహించే ధైర్యంతో 
నీకు నీవే స్నేహిస్తూ 
జీవితపు అడవిలో దాగిన అందాల్ని చూపే వెన్నెలౌతావు 

అక్షరాల దారుల్ని దాటి 
వెలుగులోని వేగుచుక్కని పలకరిస్తావు

అందుకే.. పదాల ప్రాణానివి
గుండె సడి అనువాదానివి 
ఎన్నో కాలాల సాక్షివి

ఆ క్షణానికి సార్థకతవి!!!!



https://www.facebook.com/groups/kavisangamam/permalink/643640909021998/?notif_t=like

Saturday, October 12, 2013

||సముద్రానికో విన్నపం || జయశ్రీనాయుడు


అతి సామాన్యం నువ్వు
అలా వొచ్చీ ఇలా వెళ్ళే నడక నీది..
అన్నీ దాచుకుని అలలు అలలుగా గుంభనపు నవ్వులూ

నీలోకి నడిచొచ్చే ప్రతి నావనీ 
పొత్తిళ్ళలో పాపలా లాలిస్తూ
నీదగ్గర వున్నదేదో ఇచ్చి పంపుతావు
తెడ్లైన మరలైనా 
నిన్ను కోసుకుంటూ వెళ్ళినా 
నీతో ఆటలే అనుకుంటావు.. 

నీ చీర చెంగులా పరుచుకున్న తీరం 
అంచులు తడుముకుంటూ వెళ్ళాను
అంతలోనే తండ్రిలాంటీ గుంభనపు గూడు చూశాను
ఎంతకాలమలా గడిచిపోతుందో తెలీదు
నీ అనంతమంటే నా కంటికి ఓ దీక్ష
జీవితమంతా చేపట్టాలనిపిస్తుంది

అప్పుడప్పుడు అకారాన్ని ముందు పెట్టుకుని
ఎత్తులు కొలవలేని
కొలతలకు అందని
అసామాన్యమవుతావు..
ఎవరి మీద కోపం చెప్పు
నీలో నీకె మధనమవ్తూ
తీరాల్ని బద్దలు కొడుతూ
అర్థం కాని నాన్నల కోపంలా 
భయపెడుతుంటావు 




ఒక్క మాట చెప్పొచ్చుగా.. 
ఆవరణం దాటినా 
ఆకాశాన్ని కొలవాలని నీకనిపించినా
చీకటిని పగలే చూపెట్టి భయపెట్టాలనిపించినా
నీ లోతుల్లో మర్మాలనీ... గాయలనీ పోగేసుకుని కుమిలిపోయిన క్షణాల్లో.. ఒక్క లిప్తని ఇలా ప్రకటిస్తుంటావు...

నీలం.. కత్రినా.. ఫైలిన్... మా భాషకు అందేవి ఇవే.. 
నీ వెంతచెప్పినా అర్థం చేసుకోలేని భాషలు మావి
అలల ఎత్తుల్లో ఆపదల్నీ
మబ్బుల్లో అల్ప పీడనాన్నీ
వాయుగుండమనే గండాన్నీ చూడటమే మాకొచ్చు
నీ బాధకు యే తయెత్తూ కట్టలేను
నీకేం కావాలో తీసుకెళ్ళు అనడం తప్ప
కానీ మనిషిని కదా.. ప్రాణమంటే తీపెక్కువ
అది మాత్రం వొద్దులే.. నీకెలాగూ ఉప్పదనమే ఇష్టం అని గుర్తు చేస్తున్నా..  





https://www.facebook.com/groups/kavisangamam/635864246466331/?comment_id=635870233132399&notif_t=like