Sunday, December 8, 2013

ఇది నిజం...

ఇది నిజం...

మార్పుకు అతీతమైన క్షణం యేదీ...

ఇంత దూరం తోడొచ్చిన అడుగుల్ని అడగొద్దు
ఎన్నో చూపుల్ని కలిపిన కన్నుల్నీ అడగొద్దు
కళ్ళూ మూసి నిశ్చలంగా గుండెచప్పుడైన క్షణాల్ని అడుగు..
ఫక్కున నవ్వుతాయి..
అమాయకత్వానికి..

గడిచిన ఆకాశం
యే ఉదయంలోనూ దొరకదు
రాత్రి వలువలు చుట్టుకున్న ఆలోచనలు
రోజుకో రంగు సింగారించుకుంటాయి
మనసు అరచేతపట్టుకుని
అద్దంలా చూడు
నేను కనిపించానా..
అద్దం అబద్ధమే చెప్తుంది..

ఋతువులు రాగాలే
ఆలాపనల మోహాలే
మబ్బుల వానల పలుకుల్ని
ఆకుల దొన్నెల్లో అందుకునే చేతులే
కురవని కాలం
తడిసే హృదయం
రెంటి లిపికీ మౌనమే అనువాదం

-- జయశ్రీ నాయుడు


No comments:

Post a Comment