కవీ..
ఎక్కడి కాలాన్నో తెచ్చి
హృదయాన్ని అద్ది
పదాల పోగులకి తళుకులద్దే అద్దకపు పని వాడివి
కొంచెం ప్రేమ కొంచెం కన్నీరు
మిణుగురుల్లాంటి ఆశలూ
తూనీగలంటి కొంటెతనాలూ
నీ చుట్టూ పోగేసుకుంటావు
ఓ స్వాప్నిక ప్రేమ మయమౌతావు!
నీలోని అణువణువూ అనుభూతిమయమైనపుడు
పంచుకోలేని ఏకాంత సమయమైనపుడు
కలలన్నీ కణాల్ని నిప్పుకణికల్ని చేస్తున్నపుడు
నీ లోని కల్లోలానికి తిరుగుబాటు నేర్పుతావు
అక్షరాల సైన్యం తో సామ్రాజ్యాలు జయిస్తావు
నీలోని బాధ గట్లు తెగి ప్రవహిస్తే
నీలోని లోతులు నిన్ను స్పృషిస్తే
నీలోని ఆకాశం దిక్కులు చాలనిదైతే
భోరుమనే రోదనే రుద్రావతారమైతె..
పద తాండవానికి వేదికవవుతావు
నిరాశల దుప్పట్లని కప్పుకున్న హృదయాన్ని
నిలువునా దహించే ధైర్యంతో
నీకు నీవే స్నేహిస్తూ
జీవితపు అడవిలో దాగిన అందాల్ని చూపే వెన్నెలౌతావు
అక్షరాల దారుల్ని దాటి
వెలుగులోని వేగుచుక్కని పలకరిస్తావు
అందుకే.. పదాల ప్రాణానివి
గుండె సడి అనువాదానివి
ఎన్నో కాలాల సాక్షివి
ఆ క్షణానికి సార్థకతవి!!!!
https://www.facebook.com/groups/kavisangamam/permalink/643640909021998/?notif_t=like
No comments:
Post a Comment