అతి సామాన్యం నువ్వు
అలా వొచ్చీ ఇలా వెళ్ళే నడక నీది..
అన్నీ దాచుకుని అలలు అలలుగా గుంభనపు నవ్వులూ
నీలోకి నడిచొచ్చే ప్రతి నావనీ
పొత్తిళ్ళలో పాపలా లాలిస్తూ
నీదగ్గర వున్నదేదో ఇచ్చి పంపుతావు
తెడ్లైన మరలైనా
నిన్ను కోసుకుంటూ వెళ్ళినా
నీతో ఆటలే అనుకుంటావు..
నీ చీర చెంగులా పరుచుకున్న తీరం
అంచులు తడుముకుంటూ వెళ్ళాను
అంతలోనే తండ్రిలాంటీ గుంభనపు గూడు చూశాను
ఎంతకాలమలా గడిచిపోతుందో తెలీదు
నీ అనంతమంటే నా కంటికి ఓ దీక్ష
జీవితమంతా చేపట్టాలనిపిస్తుంది
అప్పుడప్పుడు అకారాన్ని ముందు పెట్టుకుని
ఎత్తులు కొలవలేని
కొలతలకు అందని
అసామాన్యమవుతావు..
ఎవరి మీద కోపం చెప్పు
నీలో నీకె మధనమవ్తూ
తీరాల్ని బద్దలు కొడుతూ
అర్థం కాని నాన్నల కోపంలా
భయపెడుతుంటావు
ఒక్క మాట చెప్పొచ్చుగా..
ఆవరణం దాటినా
ఆకాశాన్ని కొలవాలని నీకనిపించినా
చీకటిని పగలే చూపెట్టి భయపెట్టాలనిపించినా
నీ లోతుల్లో మర్మాలనీ... గాయలనీ పోగేసుకుని కుమిలిపోయిన క్షణాల్లో.. ఒక్క లిప్తని ఇలా ప్రకటిస్తుంటావు...
నీలం.. కత్రినా.. ఫైలిన్... మా భాషకు అందేవి ఇవే..
నీ వెంతచెప్పినా అర్థం చేసుకోలేని భాషలు మావి
అలల ఎత్తుల్లో ఆపదల్నీ
మబ్బుల్లో అల్ప పీడనాన్నీ
వాయుగుండమనే గండాన్నీ చూడటమే మాకొచ్చు
నీ బాధకు యే తయెత్తూ కట్టలేను
నీకేం కావాలో తీసుకెళ్ళు అనడం తప్ప
కానీ మనిషిని కదా.. ప్రాణమంటే తీపెక్కువ
అది మాత్రం వొద్దులే.. నీకెలాగూ ఉప్పదనమే ఇష్టం అని గుర్తు చేస్తున్నా..
https://www.facebook.com/groups/kavisangamam/635864246466331/?comment_id=635870233132399¬if_t=like
No comments:
Post a Comment