Friday, June 12, 2015

Soul Circus by Venkat Siddha Reddy

“రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే.”
చిత్వాన్ గాడు ఈ మాట చెప్పకుండా వుండుంటే ధైర్యం చేసి ఎప్పుడో నేనూ కథలు రాయడం మొదలుపెట్టుండే వాడినేమో!
ఒక రాత్రి పీకాక్ లేక్ ఒడ్డున కూర్చుని ఎదురుగా నీటిలో తనని చూసుకుంటూ మురిసిపోతున్న చంద్రుడిని, నిమిషానికోసారి రాయి విసిరి విసుగుపుట్టిస్తుండగా చెప్పాడీ మాట.
ఏడేళ్లయింది చిత్వాన్ ని మొదటి సారి కలిసి. కరెక్ట్ గా చెప్పాలంటే తొమ్మిదేళ్ల రెండు నెలల ఇరవై ఏడు రోజులు.
ఆ రోజు నా పుట్టిన రోజు. పార్టీలో కలిశాడు. ఫిలాసఫీ స్టూడెంట్ శేషగిరి ఫ్రెండ్ అతను. చదివేది మా యూనివర్శిటీలో కాదు. అయినే ఎప్పుడూ మా క్యాంపస్ లోనే అతని క్యాంప్.
ఆ రాత్రి పార్టీ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే కొంతమంది రిచ్ డే స్కాలర్స్ వెధవల దగ్గర్నుంచి అప్పు తీసుకున్నాను. తాగుతున్న పెగ్ లోంచి గుప్పున డబ్బు వాసన. నెలకి సరిపడా మెస్ బిల్లు ఒక్క రాత్రిలో ఆవిరైపోతుంటే లోపలెక్కడో గిల్టీ ఫీలింగ్. ఇంటి దగ్గర అమ్మ ఉదయాన్నే గుడికెళ్లి నా పేర పూజ చేపించినందుకు హుండీలో 11, పూజారికి 51 రూపాయల ఖర్చు. నాన్న నా పుట్టిన రోజన్న ఆనందంతోనో, నన్నెందుకు కన్నాడన్న బాధతోనో, లేక అసలీ జీవితంలోని శూన్యతకు నివాళిగానో తాగిన కల్లు సీసాల ఖర్చు ముప్పై ఆరు రూపాయలు. నాన్న పనికెళ్తే రోజుకి 150 రూపాయలు. నా హ్యాపీ బర్త్ డే సందర్భంగా నేను నాట్ సో హ్యాపీగా పెట్టిన ఖర్చు 1512 రూపాయలు.
నా గిల్టీ ఫీలింగే అనుకుంటా రెండో పెగ్ కే వాంతిలా బయటకొచ్చింది. నాకసలే పరిచయం లేని చిత్వాన్ నా చెవులు మూస్తూ నాకు పరిచయమై ఆ తర్వాత నా కళ్లు తెరిపించాడు. మరో పెగ్ అందిస్తూ, పీత్వా పీత్వా పునః పీత్వా… అంటూ ఏదో చెప్పాడు. యూ బ్లడీ ఫెలో… నాకీ సంస్కృతం అర్థం కాదంటూ, మిక్సింగ్ లేకుండానే రా కొట్టేశాక నాకర్థమయింది- ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నానని.
హూ ఆర్ యూ? అంటే సమాధానం లేని ప్రశ్న అని తీసిపారేసి, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫార్మాలిటీ…ఐ యాం జరాతుష్ట్ర అని పరిచయం చేసుకున్నాడు.
ఆ రోజు నా జీవితంలో ఒక విచిత్రం. నాకు తెలిసిన మా వెధవలు శేషగిరి, వర్మ, మౌళి, శ్రీకాంత్ ఉండగా, వాంతించడంలో నాకు సహకరించిన చిత్వాన్ నాకు ఆ కొద్ది సేపట్లోనే ఆప్త మిత్రుడైపోయాడు. ఇతరులకు మంచి చేయడం కర్తవ్యం కాదు. అదొక ఆనందం. అది మన సంతోషాన్నీ ఆరోగ్యాన్నీ పెంచుతుంది – నాకు హెల్ప్ చెయ్యడం వెనుక ఉన్న కుట్ర ని బట్టబయలు చేశాడు.
మూడో పెగ్ కి అందరూ ఔట్ అయిపోతారనుకుంటే ఇంకా క్రీజ్ లో యాక్టివ్ గా ఉన్న మా వాళ్ల కోసం చిత్వాన్ గాడి కైనెటిక్ హోండాలో బయల్దేరి, ఇరవై కిలోమీటర్ల చీకటిలో చింతలబస్తీలో ఫుల్ కొన్నాక గానీ మాకు వెలుగు దొరకలేదు.
మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుంది, మరో సంవత్సరం లోపల వేలకు వేలు సంపాదిస్తానన్న నమ్మకం మనసులో లేకపోతే ఇలా అప్పులు చేసి మరీ పార్టీలిచ్చేవాడిని కాదని నా గిల్ట్ ని వాడి  మీద కక్కేశాను.
నువ్వు నాకు పరిచయం లేకపోవచ్చు. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. లోకమంతా ఇలాంటి నువ్వులే. ఎంతమందిని చూడలేదు…అని నవ్వుతూ చెప్పాడు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిగెరెట్ల కోసం ఆగినప్పుడు. అప్పుడే కొత్తగా కలిసినట్టు, హాయ్ ఐ యామ్ చార్వాక అని హ్యాండ్ షేక్ చేశాడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కుత్వా ఘృతం పీవేత్. భస్మీ భూతస్య దేహస్య. పునరాగమనం క్రుత.
ఛీ నాకు నెయ్యివాసన పడదని చెప్పినందుకు ఆ రోజు చిత్వాన్ నవ్విన నవ్వు గుర్తుకు తెచ్చుకుంటే ఇంకా నా చెవుల్లో మారుమోగుతుంది. మనిషన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి…అని మళ్లీ హ్యాండ్‍షేక్….ఇంకో కొత్త అవతారం.
ఆ రాత్రి తిరిగి పీకాక్ లేక్ చేరుకుని మిక్సింగ్ కి కూల్‍డ్రింక్ లేక నీళ్లతోనే కలిపిన నాలుగో పెగ్ చేదుగా లోపలకి జారుతుండగా అన్నాడు, “ఈ రోజునుంచీ పీకాక్ లేక్ ని నెమళ్లకొలను గా రీనేమ్ చేస్తున్నాను.”
ఆ ఒక్క రాత్రిలో ఎన్ని వేషాలేశాడో వెధవ. ఎన్ని వేషాలేసినా చీకటి పడుతుండగా ఒమర్ ఖయ్యాం అయిపోయేవాడు. ఈ కొలను ఒడ్డున కూర్చున్న మనకేం కావాలి? ఓ బిర్యానీ, ఓ యూరోపియన్ సినిమా, ఓ హాఫ్ ఓల్డ్ మాంక్.
అలా నెమళ్ళ కొలను లో జరిగిన పరిచయం భీముల కొలను దాకా తీసుకెళ్లింది. ఎక్కడ్నుంచుచ్చాడో నా జీవితంలోకి. ఎన్ని జ్ఞాపకాలు. ఎన్ని ఆలోచనలు. ఎన్ని సంగతులు, సరదాలు. వేల కిలోమీటర్ల ప్రయాణాలు. ఎన్ని అనుభవాలు, పరిచయాలు.
శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో కుండపోత వర్షంలో దూరంగా ఉన్న రాయిని చూసి పులి అనుకుని భయాందోళనలతో ఎదురుచూసిన క్షణాలు, జమ్ము తావిలో వైష్ణోదేవి గుడికి వెళ్లే దారిలో పదిహేను రోజుల తర్వాత తిన్న పప్పు అన్నం, నాసిక్ లో త్రయంబకేశ్వర గుడి లో పొందిన తన్మయత్వం, ఏడవడం నాకు రాదని చెప్పిన తర్వాత రోజే గ్రేవ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లైస్ చూసి భోరున ఏడవడాలు, ఎల్లోరాలో కైలాష గుడి చూసి నోరెళ్ళబెట్టడం, హంపీ, విరూపాపూర్ గద్దె, మౌళారూజ్ కెఫె….ఎన్నని చెప్పను….చిత్వాన్ అంటే జ్ఞాపకాల ప్రవాహం.
కానీ ప్రతి ప్రవాహం ఎక్కడో దగ్గర ఆగిపోవాల్సిందేనా? ఏమో చూస్తున్నంత సేపూ ఏ ప్రవాహమూ ఆగిపోవాలనిపించదు. కానీ నిజం వేరు.
నిద్రపట్టని ఆ రాత్రి రెండింటికి ఫోన్ మ్రోగితే…ఎవడో టైం సెన్స్ లేని ఇండియన్ బ్రూట్ అయ్యుంటాడనుకున్నాను. ఫోన్ లో చూస్తే వర్మ అని కనిపించింది. మా మధ్య ఉన్న నాలుగున్నర గంటల కాల వ్యత్యాసం బాగా తెలిసిన వాడే! అయినా ఇప్పుడెందుకు చేస్తున్నాడని విసుక్కుంటూనే ఫోన్ ఎత్తాను.
చిత్వాన్ చచ్చిపోయాడని వర్మ చెప్పినప్పుడు లోపల్లోపల ఏదో ఒక భాగం హఠాత్తుగా నాలోని తెలియని లోతుల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయిట్టనిపించింది.
అందుకే అంత్యక్రియలు జరగాల్సించి ఒక్క చిత్వాన్ కే కాదు. నాలోపల్లోపల చనిపోయిన ఆ భాగానికి కూడా అనిపించింది. రగిలించి, ఆజ్యం పోసి, అన్వేషించమని నన్ను అగ్నిగుండంలోకి తోసేసినందుకో, లేక మల్టినేషనల్ కంపెనీల అద్దాల మేడల జిలుగు వెలుగులకాంతిలో మైమరచిపోతూ, ఏసి గదుల్లో కుషన్డ్ సీట్లకు వేడి కలిగిస్తూ, నన్ను నేను మరిచిపోయిన పాపాన్ని కడగెయ్యాల్సిన అవసరం వచ్చినందుకో… అర్జెంట్ గా లండన్ నుంచి ఇండియా బయల్దేరాను.
*****
నీకు జరిగింది కథ కాదు. నీలో జరిగిందే కథ.
నాలో అంటే?
అవును. లోపల. నీలోపలే అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోలు తిత్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్; ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనె అది కథ అవుతుంది. లేకపోతే అది ఆవు వ్యాసమే! ఇప్పటివరకూ వచ్చిన కథలే మళ్లీ వస్తాయి. ఇప్పటివరకూ చెప్పిన నీతే మళ్లీ చెప్తారు. అప్పుడు ఈ భూమ్మీద కొత్త కథంటూ పుట్టదు. గో డూ సమ్ సోల్ సర్కస్ అనేవాడు చిత్వాన్.
వాడు చెప్పిందేదీ నాకు పూర్తిగా ఎప్పుడూ అర్థం కాలేదు. అన్నింటికీ అర్థాలు వెతకడంలోనే మనిషి తనలోని మ్యాజిక్ ని కోల్పోయాడనేవాడు చిత్వాన్.
ఇంత మాట్లాడుతావు, ఇన్ని తెలుసు నీకు, రాయొచ్చుగా అన్నానొక రాత్రి పూట.
అప్పుడు చెప్పాడు- రాయడమంటే ఏమనుకున్నావు? రాయడమంటే  నీ లోపలున్న  అగ్నిగుండాన్ని బద్దలు చెయ్యడం. రాయడమంటే ఒక తపస్సు. అన్కాన్షియస్ సెల్ఫ్ నుండి విసిరేయబడ్డ ఎన్నో నిన్నులను జల్లెడ బట్టడం. రాయడమంటే నీ కళ్లు తెరిపించే అనుభవం. రాయడమంటే నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడం. అలా ఒక పేజీ అయినా రాయగలిగితే మనసుకి శుద్ధి జరుగుతుంది. జ్ఞానోదయమవుతుంది. అసౌకర్యంగా అనిపించినా నిన్నొక కొత్త వ్యక్తిగా ఆవిష్కరించుకుంటావు.
నన్ను కొత్తగా పరిచయం చేసుకోవడంలోని అసౌకర్యం నాకు తెలుసు. నా భయాలు, బిడియాలు, కాంప్లెక్స్ లు, అలవాట్లు, పొరపాట్లు …ఎన్నని? వీటన్నింటిని ఇనుప చొక్కాలా తొడుక్కుని ఉన్నాను. దాన్ని తొడుక్కున్నంత త్వరగా విప్పలేమని తెలుసు.
నేనో భగ్నమైన కలని.  ఆగిపోయిన కలాన్ని. అందుకే ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఆజ్యం పోసుకున్న అతి ఉత్తేజిక ఊహలేవో నా మనసంతా నిండిపోయి భారమైపోతున్నా వాటిని అక్షరాల్లోకి తెచ్చే ధైర్యం చాల్లేదు.
*****
నేను నెల్లూరు చేరుకునే సరికే అంత్యక్రియలు అయిపోయాయి. నేనొచ్చే వరకూ ఆపడానికి నేనేమీ వాడికంత ఆప్తుడిని కాదు. కాదా? ఏమో?
ఒక రోజు వాడే అన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన ఒక స్నేహితుడి అవసరం ఉంది. వాళ్లతో నీ రహస్యాలు, నీ తలవంపులు, నీ ఉక్రోషాలు…అన్నీ పంచుకోవాలి.  మాస్కులన్నీ తీసేసి, హృదయాంతరాలను మథించి నీలోపలున్న నిన్నులందరినీ వారికి పరిచయం చేయాలి. అటువంటి నమ్మకమైన నిలువుటద్దంలాంటి ఒక స్నేహం కోసమే నా అన్వేషణ. నిన్ను కలిసాక నాకు ఆ స్నేహం దొరికినట్టే అనిపిస్తుంది. కానీ నువ్వు అలా కాదు. నీ చుట్టూ కట్టుకున్న గోడల్ని కూల్చలేవు. నీ గుట్టులన్నింటినీ ఎద గట్టుదాటనివ్వవు. సుఖాలను దరి చేరనివ్వవు. నీ సామ్రాజ్యంలోకి ప్రవేశం కేవలం నీకు, నీ కన్నీళ్లకు మాత్రమే! ప్రపంచ శోకాన్ని మొత్తం మూటకట్టి మోస్తున్నావు. వదిలెయ్. నాతో పాటు వస్తావా? కొన్నాళ్లు శ్రీశైలం అడవుల్లోకి వెళ్దాం.
వాడన్నంత సులభంగా అన్నీ వదిలెయ్యలేకపోయాను. భయాలు, బాధ్యతలు. జీవిక లో జీవితమే కాదు, చిత్వాన్ లాంటి స్నేహితులతో సంబంధాలనీ కోల్పో్యాను. ఎప్పుడైనా రాత్రి పూట ఏకాంతంలో గాలి పాట వింటున్నప్పుడు మళ్లీ  జ్ఞాపకాలన్నీ ఉప్పెనలా ఎగిసి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు చిత్వాన్ మాటలు గుర్తుకొస్తాయి.
బతికుండడం ముఖ్యం కాదు; బతకడమూ అంత ముఖ్యం కాదు. అసలీ జీవితంలో ఏదీ ముఖ్యం కాదు. ఈ జీవితం నీదనే భ్రమలో ఉన్నావేమో? బయటకు రా! దేవుడి దగ్గర్నుంచి మనం తీసుకున్న అప్పు ఈ జీవితం. అది తీరే వరకూ బ్రతకవలసిందే అనుకోవడం మూర్ఖత్వం. మిగతా అన్ని జంతువులకీ అది తప్పదు. కానీ మనిషనే జంతువుకి ఒక వరమిచ్చాడు దేవుడు. ఈ అప్పు తీర్చకుండా ఎగ్గొట్టొచ్చు. దేవుడు ఏమీ చెయ్యలేడు. మనల్ని ఆపలేడు.
మై హార్ట్ ఈజ్ ఏ జంగిల్. నాకు పువ్వుల సువాసనలు కావాలి. పులుల తో సావాసమూ కావాలి. రెండింటిలో ఏదో ఒకటే ఇస్తానంటే నేను పవ్వులనొదులుకుని పులుల దగ్గరకే వెళ్లిపోతాను. జీవితమంటే నాకిష్టమే. కానీ జీవితం కంటే మరింత కావాల్సింది ఏదో ఉంది. అందుకే నా ప్రాణాన్ని పట్టుకుని వేళ్లాడ్డం అంత ఇష్టం ఉండదు. ఇక చాలనుకున్నప్పుడు ఇక్కడ్నుంచి జంప్ అయిపోవడమే! పవర్ ఆఫ్ బటన్ నొక్కెయ్యడమే! అప్పటివరకూ అంతా నా ఇష్టానుసారమే!
స్టేషన్ లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వర్మ సుసైడ్ అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేయలేదు. కానీ సుసైడ్ అనే పదమే ఏదోలా అనిపించింది. చిత్వాన్ ది ఆత్మహత్య కాదు. హరాకిరి. చిత్వాన్ ఒక సమురాయ్.
*****
అడ్వెంచర్ అయిపోయింది. నీకంతా చెప్తే ఇంతేనా అనిపించొచ్చు. రాబందులా జీవితాన్ని వెంటాడే పేదరికంలోనే పుట్టి పెరిగుంటే నాకివన్నీ సాధారణంగానే అనిపించుండేవేమో! పేదరికం అంటే ఇలా ఉంటుందని తెలిసుంటే పస్తులుండి, రోజూ చస్తూనో, చస్తూ బతుకుతూనో, ఎలాగో బతికుండేవాడిని.  కానీ ఈ పేదరికం నాకు చాలా కొత్త.  జీవితంలో ఇదో కొత్త అడ్వెంచర్ ఏమో అనుకుని ఎప్పట్లానే రైడ్ ఇట్ ఆర్ డై అని ప్రయత్నించా. నా వల్ల కాలేదు. నా ఈ చర్యలోని ప్రత్యేకత ను గమనించి అభినందించ గలిగింది నీవొక్కడైవే కాబట్టి నీకు మాత్రమే రాస్తున్నాను. నీక్కూడా ఆ ప్రత్యేకత అర్థం కాకపోతే దిగ్భ్రాంతితో  ఐ విల్ రోల్ ఓవర్ ఇన్ మై ఓన్ గ్రేవ్…హ హ హ.
నాతోపాటు మా వాళ్లు చాలామందే వచ్చారు. కానీ అమ్మ ఉత్తరం నాకే ఇచ్చింది.  నేనొస్తానని అంత ఖచ్చితంగా ఎలా తెలుసో, వచ్చినా అది నా కోసమే అని అమ్మకి ఎలా తెలుసో మొదట నా కర్థం కాలేదు. చిత్వాన్ గదిలో కూర్చుని ఎన్ని సార్లు చదివానో ఆ ఉత్తరం.
మధ్యాహ్నానికి అందరూ వెళ్లిపోయారు. వర్మ నేనే మిగిలాం. తనకి చెన్నై లో పనుందని కాసేపటికి వర్మ కూడా బయల్దేరాడు.
ఎక్కడ నేను, ఎక్కడ చిత్వాన్. వాడూ వాడి నేపాలీ మొహం. వాడికి వాడు పెట్టేసుకున్నాడు చిత్వన్ అని పేరు. దీర్ఘం మేమిచ్చింది. నీకెందుకీ పేరంటే అదే నేను అనే వాడు. తండ్రి ద్వారా వాడికొచ్చిన పేరు కృష్ణ మూర్తి. తన అస్తిత్వానికి పూర్తి బాధ్యత తనే తీసుకున్నా అందులో ఏ అతికొద్ది భాగమో తన నేపాలీ తల్లికే ఇచ్చాడు కానీ, తండ్రి ని ఎప్పుడూ తన లో కలవనివ్వలేదు. తండ్రి ఒక డబ్బుల బస్తా. అంతే. ఇంకేమీ కాదు.
వేదాయపాళెం దాటాక ఎక్కడో మూలలో ఒక సింగిల్ బెడ్ రూం ఇల్లు. అందులోని ఒక్క బెడ్ రూం పూర్తిగా వాడిదే. గది నిండా పుస్తకాలు. బెడ్ మీద సగం సగం చదివి వదిలేసినవి, నేల మీద తాటాకు బుక్ మార్క్‌లతో పడి ఉన్నవీ, చిందరవందరగా … మా ఇద్దరికీ బాగా ఇష్టమైన అబిడ్స్ సండే మార్కెట్ లో పోసిన పుస్తకాల కుప్పల్లా …చూస్తే సమాధానాల కోసం ఎన్ని పుస్తకాలెతికాడో అనిపించింది. కానీ జీవితమనే ప్రశ్నకు సమాధానాలు వెతకొద్దు. సమాధానం దొరికిందనుకున్న ప్రతి సారీ జీవితం మరో కొత్త ప్రశ్నలా ఉదయిస్తుందని చెప్పింది కూడా వాడే!
అసలు వాడి మొహమే ఒక ప్రశ్నార్థకం. చింకీ గాడిలా ఉండే వాడు సడన్ గా తెలుగులో మాట్లాడ్డమే అందరికీ అన్ని చోట్లా ఆశ్చర్యం కలిగించేది. అందుకే వాడికి పరిచయస్థులు ఎక్కువ.
కానీ ఎంతమంది పరిచయమున్నా, పుస్తకాల షెల్ఫ్ లో ఒకే ఒక్క ఫోటో. నేనూ-వాడు. హంపీలో మౌలారూజ్ కెఫె లో తీసుకున్న ఫోటో. నవ్వుతూ వాడు, నవ్వాలా వద్దన్నట్టు నేను.
*****
హంపి. మొదటి సారి.
నాకు ఫ్రాన్స్ లో ఉద్యోగం వచ్చింది. ఇంకో వారంలో వెళ్లిపోతాననంగా చిత్వాన్ ని కలవాలనిపించింది. ఎక్కడా వాడి జాడే లేదు. చివరికి హంపి లో మౌలా రూజ్ కెఫె లో ఉంటాడని తెలిసింది.
మౌలారూజ్ అని చెప్పారు. స్పెల్లింగ్ చూస్తే మౌలిన్ రోగ్ అని ఉంది. ఇద్దరు ముగ్గురిని అడిగి కన్ఫర్మ్ చేసుకుని మరీ వచ్చాను. వాళ్లు నవ్వుతుంటే సిగ్గేసింది అన్నాను.
సిగ్గు ఎందుకురా రోగ్. వాళ్లకది మౌలారూజ్ అవ్వొచ్చు. నీకూ నాకూ ఇది మౌలిన్‌రోగ్. సరేనా? పద సైజరెట్టే తాగుదాం అని వాడి భాషలో వాడు.
వాడు నాకెప్పుడూ వింతే!
మళ్లీ వాడిని ఎప్పుడు కలుస్తాననే భయమేమో ఎప్పుడూ లేనిది నా బాధల సంచీని వాడి ముందు పొర్లించాను.
పన్నెండేళ్ల వయసు. ఆరో తరగతి. ట్రంకు పెట్టె. సాయంత్రం కల్లా తిరిగొస్తానన్న అమ్మా నాన్న. హాస్టల్ బయటే రాత్రంతా ఎదురుచూస్తూ నేను, ఎక్కాలు నేర్చుకోమని హాస్టల్ వార్డన్ దెబ్బలు. పొలంలోని కాలువలో ఆకు పడవల పోటీలు, ఊరి బయట గాలిపటాలు,  తాటి కాయల బండ్లు, ఇవన్నీ చివరికి జ్ఞాపకాలేనా? ఒక సారి ఇల్లు వదిలేశాను. మళ్లీ ఇప్పుడు నెమల్ల కొలను, హిమాలయాల్లో ట్రెక్కింగ్, జమ్ము తావిలో చలికి వణికిపోవడం. అవంతిక, స్వాతి, మాళవిక, సంధ్య, చందన, నువ్వు, వర్మ, శేషు… చివరికి అన్నీ జ్ఞాపకాల్లాగే మిగలాల్సిందేనా? ఇంకోసారి అన్నీ వదిలేసి వెళ్లాల్సిందేనా?
అంతా ఓపిగ్గా విన్నాడు. అదే నాకు వాడిలో బాగా నచ్చే విషయం. అంతా విన్న తర్వాత మొదలు పెట్టాడు.
ఫక్ దిస్ నోస్టాల్జియా. అదొక జబ్బు. ముందు దాన్నుంచి బయటపడు. అసలు నీ సమస్యేంటో తెలుసా? నువ్వు మీ అమ్మనాన్నలకు పుట్టిన వాడివనుకుంటావు. కానీ ప్రతి రోజూ, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్లీ కొత్తగా పుడ్తావు. నువ్వు వుంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడూ ఉంటాడు. కొన్ని సార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్లాలి.
వాడు చెప్పాడు. నేను విన్నాను. కానీ వాడు చెప్పినంత సులభమా?
పుస్తకాల షెల్ఫ్ మీదున్న ఫోటో కావాలని అమ్మని అడిగాను. తీసుకోమంది. జేబులో ఫోన్ మోగింది సైలెంట్ గా.
అన్నింటికీ మించి ఆ రోజు మాత్రం నా ఫోన్ మోగకూడదనుకున్నాను. నాక్కొంచెం విశ్రాంతి కావాలి. ప్రశాంతత కావాలి. చిత్వాన్ విధ్వంసం ని కొద్దిగానైనా అర్థం చేసుకోవాలి. కానీ అనుకుంటే ఆగిపోయేది కాదు రియాలిటీ. మనమేమనుకున్నా దానిపాటికది జరిగిపోవడమే దాని పని. మనమే ఎక్కడో గతంలో ఆగిపోయుంటాం. లేదా కాలంకంటే ముందుకు పరిగెత్తి కలల లోకంలో ఇరుక్కుపోయుంటాం.
ఫోన్ మోగింది. గ్యారెంటీగా ఆఫీస్ వాళ్లనుకున్నాను. కాదు.
ప్రమద. ఏం జరిగిందన్న పొడి మాటలు. కేవలం ఫార్మాలిటీ కోసం. అవసరం వేరు. వచ్చేటప్పుడు ప్రియ పచ్చళ్లు, కరాచీ బిస్కెట్లు, తెలుగు సినిమా డివిడిలు…ఇంకా ఏవేవో కోరికల చిట్టా! మనసు లేని అందమైన బిచ్. రాత్రి చార్మినార్ కి ఎక్కొచ్చు. ఫ్లైట్ ఏ అర్థరాత్రికో. అన్నీ కొంటానికి టైమైతే ఉంది. కానీ మనసైతే ఇంకెక్కడో ఉంది. నాలుగొందలయాభై కిలోమీటర్ల దూరంలో. హంపీలో మౌలారూజ్ కెఫెలో గాలికెగురుతున్న ఎర్రటి కర్టెన్లు. మెరుస్తున్న గాజు గ్లాసులు.
ఫోన్ కాల్ అయ్యాక మరోసారి చిత్వాన్ గాడు నాకు రాసిన ఉత్తరం చదువుతుంటే హఠాత్తుగా హంపీ వెళ్లాలనిపించింది.
హంపీలోనే చివరి సారిగా వాడిని చూసింది. వాడితో మాట్లాడింది.
*****
జీవితంలో అసలు మనమేం చెయ్యాలో కనుక్కునేందుకు, మనల్నేం చెయ్యద్దొంటారో అది చేస్తే మార్గం తెలుస్తుంది.
ఉంచుకున్న దాని కొడుకుని కదా! పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాడు మా బాబు. కొంచెం వయసు రాగానే అమ్మ తరుపున పోరాడాను. నాన్న కాళ్ల బేరానికొచ్చాడు. రిచ్ బాస్టర్డ్. డబ్బుల్తో కొనేద్దామనుకున్నాడు. నేపాలీ వాడినైతే మాత్రం మీ బిల్డింగ్ లకు సెక్యూరిటీ గార్డ్ గా మిగిలిపోవాలనుకోలేదు. నాన్నా ఏ ఊరెళ్తే ఆ ఊర్లో. వాడు నాకొక ఏటియం మాత్రమే. చివరికి రిటైర్ అయ్యి సొంత ఊరు నెల్లూర్లో సెటిలయితే మేమూ అక్కడికే వచ్చాము.
ఇది ఇలా చెయ్యకూడదంటే అదే చేస్తూ వచ్చాను. పోరాడి నా జీవితాన్ని క్లైమ్ చేసుకున్నాను.
కానీ అదృష్టవంతుడు మా బాబు. పోయాడు. ఏటియం పర్మనెంట్ గా ఔట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. అయితే జీవితం ఆగిపోతుందా ఏంటి? డబుల్ పిహెచ్‍డి. ఉద్యోగం నాక్కాకుండా ఎవరికిస్తారు. ఇచ్చారు. కానీ అంతా కొత్త. ఒక రోజు దుకాణం మూసేశాను. నా కొద్దీ జీతాల జీవితం అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగాను. చివరికి హంపి చేరుకున్నాను. విరూపాపూర్ గద్దె. ఇక్కడ ఈ మౌళారూజ్ కెఫే. గాలికెగుర్తున్న ఈ ఎర్రటి కర్టెన్లు, మెరుస్తున్న ఈ గాజు గ్లాసులు. వీటన్నింటి మధ్యలో ఆమె. జీవితం మళ్లీ ఇక్కడే ఫ్రెష్ గా మొదలయింది.
ఎవరామె?
తెలియదు. ఎక్కడెక్కడో తిరిగి హోస్పేట్ లో ట్రైన్ దిగాను. పెద్ద సూట్ కేస్ ఆమెది. మోయలేనంత బరువు. నేనే దింపాను. తర్వాత ఇక్కడ మౌళారూజ్ కెఫెలో కనిపించింది. నేనామెకి తెలుసు. తను నాకు తెలుసు. చూసినప్పుడల్లా నా భారము ను మోసిన ఓ తోటి ప్రయాణికుడా నీకు కృతజ్ఞతలు అన్న భావంతో చూస్తుంది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ మేమొక మాట మాట్లాడింది లేదు. కానీ ఏదో తెలియని అదృశ్య దారం మా హృదయాలను ముడివేసిందన్నది మాత్రం నిజం. కానీ ఆ ముడి ఇక్కడ ఈ లోకంలో లేదు. మరెక్కడో ఒక సుదూర వింత ప్రపంచంలో…
లవ్ ఎట్ ఫస్ట్ సైటా?
మనలోని ఫీలింగ్సన్నింటినీ ఇలా సాధారణీకరించడం నాకు నచ్చదు.
మరి ఎన్నాళ్లిలా ఆమెకి చెప్పకుండా?
ఎన్నాళ్లైనా ఫర్వాలేదు. రోజుకో ప్రేమ లేఖ రాస్తున్నా. కానీ ఇచ్చే ఆలోచన లేదు. ధైర్యం లేదనొద్దు. నాకు చాలా కోపమొస్తుంది. భూమి ఆమె. నేను చంద్రుడు. మధ్యలో సూర్యుడూ ఉన్నాడు. అది సమస్య కాదు. అదే నిజం. సూర్యుడు ఉన్నాడు కాబట్టే భూమి ఉంది. కానీ నేనూ అవసరమే. పూర్తిగా కాదు. కానీ గుడ్డి లాంతరులా. నేనూ అవసరమే!
అలా ఎలా? ఇన్నేళ్ల నీ జీవితాన్ని ఒక్క క్షణంలో కలిగిన నీ ఫీలింగ్ కి అంకితం చేసేస్తావా?
ఎన్నేళ్ల జీవితమని కాదు. నాకు ముఖ్యమైంది ఇప్పుడు. ఇక్కడ. అంతే. హంపిలో ఈ శిధిలాలన్నీ చూస్తే నీకేమనిపించింది? జీవితమొక్క ఆశాశ్వత నీకు కనిపించలేదా? నాకైతే ఈ శిధిలాల్నుంచి నేర్చుకున్నంత మరెక్కడా నేర్చుకోలేమనిపిస్తుంది. నాకిక్కడ చాలా బావుంది. ఇక్కడి రాళ్లు నాతో మాట్లాడతాయి. వాటి భాష నాకు అర్థమవుతోంది. సగం విరిగిపోయిన కోట గోడలు, ఆ గుడి ముందు శిధిలమైన శిల్పమొకటి నాతో మాట్లాడతాయి.  ఏ దారిలో వెళ్లినా చివరికి శిధిల్లాలోకే దారి తీస్తుందని చెప్తాయి. అందుకే జీవితం నన్ను ఎక్కడ్నుంచో మూసుకొచ్చి ఇక్కడ ఆమె ముందు పడేసింది.
ఏముందామెలో?
చూడటు? ఏం చేస్తుంది?
కాఫీ కలుపుతోంది.
అది నీ దృష్టిలో కాఫీ కలపడమనే సాధారణ చర్య కావొచ్చు. వృత్తాకారంలో ఉన్న కాఫీ మగ్ లో స్పూన్ పెట్టి ఆమె తిప్పడం చూడు. ఆ వృత్తంలోకి ఆమె చూస్తున్న చూపు చూడు. విశ్వం మొత్తాన్ని ఆకర్షించి సుడులు తిరుగుతున్న ఆ  కప్ లోనికి లాగేస్తున్నట్టుగా లేదూ?
ఆమె ను చూస్తున్నంత సేపూ నా గురించి, ఈ ప్రపంచం గురించి ఏ కంప్లైంట్స్ లేవు. ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను. ఆమె కావాలనుకునే నేను మాత్రమే. ఇంకే కోరికలూ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు లేవు.
చూడు ఇప్పుడు ఆమె కాఫీ పట్టుకుని ఇటు వస్తుంది. కళ్లు మూసుకుని ఆమె అడుగుల శబ్దాన్ని విను. వినిపించడం లేదా? సముద్రపు హోరు. తడి ఇసుకలో ఆమె వేస్తున్న అడుగుల సవ్వడి. గాలికి ఎగిరిపోతూ రెపరెపలాడుతున్న ఆమె చీర కొంగు. వినిపిస్తోందా? ఆమె తలలో ఎప్పటికీ వాడిపోని ఆ గులాబీ?
*****
కార్లో హోస్పేట్ చేరుకునే సరికి అర్థరాత్రయింది. అంత రాత్రి పూట హంపీలో ఉండడంకంటే హోస్పేట్ లో ఏదైనా హోటల్లో ఉండడం మేలని అన్నాడు డ్రైవర్. కానీ నాకు హంపీకే వెళ్లాలనిపించింది. అతను హంపీలో డ్రాప్ చేసి వెళ్లిపోయాడు.
హంపీలో శిధిలాలు శిలుహెట్ లో మళ్లీ ప్రాణం పోసుకున్నట్టనిపించాయి.
బస్టాండ్ లో టీ బంకు దగ్గర ఇంకా కొంతమంది జనాలు పోగై ఉన్నారు. నడుచుకుంటూ విరూపాక్ష ఆలయం చేరుకున్నాను. గుడి బయట నాలాంటి నిద్రపట్టని నిశాచరులు తచ్చాడుతున్నారు. గుడి ఎదురుగా ఉన్న ఫ్లడ్ లైట్ స్తంభం కింద కూర్చున్నాను. ఏం చేద్దామని హంపీ వచ్చాను? ఏంటి నాకు వాడితో సంబంధం? శనివారం రాత్రి. ఇప్పుడు లండన్ లో ఉండుంటే? చిన్నగా వర్షం మొదలైంది. అప్పటివరకూ గుడి ఎదురుగా ఉండే షాపుల బయటే నిద్రపోతున్న వాళ్లు తమ పక్కలు సర్దుకుని లోపలకి వెళ్లిపోయారు. నిద్రపట్టని నిశాచరులూ కాసేపటికి అక్కడ్నుంచి మాయమయ్యారు.  ఒంటరిగా నేను. ఎదురుగా విరూపాక్షుడు.
ఎందుకురా వెళ్లిపోయావ్ అని గట్టిగా అరవాలనిపించింది? నేనొచ్చే వరకూ ఆగలేకపోయావా? రాయడమంటే నడి రోడ్డు లో నగ్నంగా నిలబడ్డం కాదు, నడిరోడ్డులో నగ్నం గా వర్షంలో తడవడమని, నోస్టాల్జియా ఒక జబ్బు కాదు, అదొక గొప్ప మందనీ, రాయడమంటే అగ్ని పర్వతం బద్దలు కావడం కాదు, నిత్యం రగిలే గుండె మంటలను చల్లార్చుకోవడం అనీ, ది జంగిల్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హార్ట్; ఇట్ ఈజ్ ఇన్ ది హెడ్ అనీ…ఏదో ఒకటి. అది అబద్ధమో, నిజమో, నిజమైన అబద్ధమో, అబద్ధమైన నిజమో…ఏదో ఒకటి చెప్పి నిన్ను ఆపుండే వాడిని కదరా? ఎందుకురా వెళ్లిపోయావప్పుడే?
ఆఫ్టరాల్ ఈజ్ దిస్ ఆల్ జస్ట్ సమ్ మీనింగ్‌లెస్ సెంటిమెంటాలిటీ?
అయితే అవ్వనీ అనిపించింది. ప్యారిస్ లో ఉండగా మౌలారూజ్ 125 వ వార్షికోత్సవ వేడుకలకి వెళ్లినప్పుడు అక్కడ ఉండాల్సింది నేను కాదు మేము అనిపించింది. అప్పట్నుంచీ వాడిని కలవాలని, నెమళ్ల కొలను లో వాడితో మందు కొడ్తూ మాట్లాడాలని ఒకటే కోరిక. కానీ పని, పని, పని. పని గొడవలో చిత్వాన్ మాటే మర్చిపోయాను.
ఏమవుదామనుకున్నాను జీవితంలో? ఏమయ్యాను?
నువ్వు ఇవన్నీ వదిలెయ్. ఈ ఉద్యోగాలదేముంది? అందరూ చేస్తారు. నిన్ను ఇన్ని రోజులు రాయకుండా ఎందుకాపానంటే నువ్వు రాస్తే అది నాకు నచ్చాలి. రాయడానికేముంది. కుప్పలు తెప్పలుగా రాస్తున్నారు. రాయడం సులభం. కానీ అది మళ్లీ నువ్వే చదువుకుని నీ మొహం మీద నువ్వే ఉమ్మేసుకోవాలనిపించకూడదు. అందుకే ఆపాను. అంతే గానీ ఇలా నిన్ను నువ్వు అమ్ముకునే బిజినెస్ పెడ్తావనుకోలేదు. వాళ్లదీ గంటల లెక్కే. నీ లాంటి బిజినెస్ కన్సల్టెంట్స్ దీ గంటల లెక్కేగా! ఎందుకీ వ్యాపారం. ఇక్కడికొచ్చెయ్. హంపీలో ఎవరూ అడగరు నిన్ను. నీ కులమేంటి? నీ భాషేంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటీ? ఇవన్నీ ఉండవిక్కడ. మనం మనుషులమనే సాధారణ జీవులం. నువ్వు నీ జీవితాంతం ఎంత తాపత్రయపడి ఏం సృష్టించినా చివరికి ఇలా శిధిలమవ్వాల్సిందే అనే పాఠం చెప్పి పంపిస్తుంది హంపి. వీలైతే ఫ్రాన్స్ వెళ్లొద్దు. ఇక్కడే ఉండు.
మొదటిసారి చిత్వాన్ చెప్పింది పట్టించుకోకుండా వెళ్లిపోయాను. వాడు చెప్పింది విని ఆలోచించడానికి ఇదేం జీవన్మరణ సమస్య కాదనిపించింది. పేదరికం నుంచి దూరంగా అడుగులు వేస్తున్నాననుకున్నాను. కానీ జీవితం నుంచే చాలా దూరంగా వెళ్లిపోయానని తెలియలేదు.
వర్షం ఎప్పుడు తగ్గిందో తెలియదు. చుట్టూ వెలుతురు. ఉదయాన్నే జనాల తాకిడి.
హడావుడిగా లేచి తుంగభధ్ర నది ఒడ్డుకు బయల్దేరాను. వాడు లేడు. కానీ వాడి గుడి చూడాలి. గుడిలో వాడి దేవతను చూడాలి. మొదటి పడవ ఎక్కి విరూపాపూర్ గద్దె కి చేరుకున్నాను.
లాఫింగ్ బుద్ధ, సాయి ప్లాజా, ఊ లలలా, ఎవర్ గ్రీన్…ఒక దాని తర్వాత ఒకటి. మౌళారూజ్ ఎక్కడ?
కొంతమంది తెలియదన్నారు. కొంతమంది తెలుసుకానీ ఎక్కడుందో చెప్పలేక తల గోక్కున్నారు. ఐదేళ్ల క్రితం నేను చూసిన విరూపాపూర్ వేరు. వెతకని చోటు లేదు. మధ్యాహ్నానికి తిరిగి బోట్ ఎక్కబోతుండగా అంతకుముందు హంపీ వచ్చినప్పుడు వాడు మౌలారూజ్ కెఫె చేరుకోవడానికి చిత్వాన్ చెప్పిన డైరెక్షన్స్ నా చెవిలో మారుమోగాయి. వాడు చెప్పిన గుర్తులు పట్టుకుంటూ మరో ప్రయత్నం చేశాను.
ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. పచ్చని పంట పొలాలు. వాటికెదురుగా గుడెశె ఆకారాంలో ఒక నిర్మాణం. పూర్తిగా శిధిలావస్థలో ఉంది. లోపలకెళ్లాను. విరిగిపోయిన వెదురు బల్లలు, కుర్చీలు. అక్కడక్కడా తాగి పడేసిన బీరు సీసాలు. ఎర్రటి కర్టెన్లు లేవు. టేబుళ్ల మీద గాజు గ్లాసులూ లేవు. ఆమె లేదు. వాడెలాగూ లేడు. ఉండడు కూడా. కానీ ఆ విరిగిపోయిన టెబుళ్లు, కుర్చీల మధ్య వాడెప్పుడూ కూర్చునే టేబుల్ మాత్రం ఇంకా అలాగే చెక్కు చెదరకుండా నాలుగు కాళ్లపై నిలబడే ఉంది.
హై. దిస్ ఈజ్ చిత్వన్. ఐ హోప్ యూ రిమెంబర్ మి.
సమ్ డే వెన్ యూ విజిట్ మౌలారూజ్, ప్లీజ్ గో టూ మై టేబుల్. ఐ హ్యావ్ ఏ మెసేజ్ ఫర్ యూ.
బై.
కేవలం మూడు లైన్ల ఒక ఈ మైల్. ఫ్రం కృష్ణమూర్తి ఎట్ జిమెయిల్ డాట్ కాం.
వీడుకూడా మోడ్రన్ అయిపోయాడు వెధవ. అడిగితే మొబైల్ ఫోన్, ఈమెయిల్, సోషల్ నెట్‍వర్క్  లాంటివన్నింటికీ తను దూరమని చెప్పేవాడు. కానీ హఠాత్తుగా ఒక రోజు వాడి నుంచే వచ్చిన ఈ మెయిల్. ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికప్పుడు వాడికో పెద్ద మెయిల రాసిపడేశాను. కానీ అనుకున్నట్టుగానే వాడినుంచి ఎటువంటి రిప్లై రాలేదు. ఈ సారి హాలిడేస్ కి ఇండియా వెళ్లినప్పుడు ప్రమద వాళ్లని గుంటూర్లో వదిలేసి ఒక వారం రోజుల పాటు చిత్వాన్ గాడితో హంపి వెళ్లాలని అనుకున్నాను ఆ రోజు. ఆఫీస్, మీటింగ్స్, సేల్స్ రిపోర్ట్స్, స్ట్రాటజీ మీటింగ్స్, షాపింగ్, పబ్బింగ్, గాసిపింగ్… ఈ గొడవలో ఎన్నో విషయాల్ని మర్చిపోయినట్టే కొన్ని రోజులకి వాడి సంగతే మర్చిపోయాను.
టేబుల్ కింద సెలోఫేన్ టేప్ తో నీట్ గా అంటించి ఉందో కాగితం.
ఇక్కడకొచ్చి చాలా రోజులయింది. ఆమె ను చూస్తున్నకొద్దీ, ఆమెను ప్రేమిస్తున్నకొద్దీ నేను రోజు రోజుకీ కొంచెం కొంచెంగా మరణిస్తున్నట్టనిపించింది. ప్రేమంటే ఏంటనుకున్నావు? ప్రేమే మరణం; ప్రేమించడమంటే అత్మహత్య చేసుకోవడం. ప్రేమలో అహం, అవాస్తవాలు మరణిస్తాయి. నా విషయంలో అది పూర్తిగా నిజమైంది. కానీ ఎన్ని అవాస్తవాలు మరణించినా ఆకలి అనే వాస్తవం మాత్రం నాకు దూరం కాలేదు. జేబులో డబ్బులు అయిపోయాయి. ఎందుకో హఠాత్తుగా ఒక రోజు పెరుగన్నం తినాలినిపించింది. మా నాన్న ఇంట్లో ఒక రోజు పెరుగన్నంతో పాటు తిన్న ఆవకాయ పచ్చడి గుర్తొచ్చింది. అంతే ఇక్కడ్నుంచి బయల్దేరి వెళ్లిపోవాలనిపించింది. ప్రపంచమంతా జయించిన ఆనందం ఆ అన్నం ముద్ద, ఆవకాయ పచ్చడి లో లేవనిపించింది. క్రేవింగ్ అంటే తెలుసా? ఆ క్రేవింగ్ తో అక్కడ్నుంచి బయల్దేరాను. ఆమె వద్దంది. తనతోనే ఉండమంది. కాళ్లు కూడా పట్టుకుంది. కానీ నేనప్పుడు ఏదీ ఆలోచించే స్థితిలో లేను. పెరుగన్నం-ఆవకాయ. నాకప్పుడు కావాల్సింది అదే! అందుకే నీకూ ఈ రహస్యం చెప్పాలనిపించింది. ఈ జీవితంలో ఏదేదో ఉందని నువ్విక్కడికి వెతుక్కుంటూ వస్తావని తెలుసు. అందుకే నీ కోసం ఈ మెసేజ్ ఇక్కడ దాచి వెళ్తున్నా! జాగ్రత్త గా విను.
వెన్ యూ ఆర్ గోయింగ్ బ్యాక్ ఫ్రం హియర్, డోన్ట్ ఫర్‍గెట్ యువర్ పికెల్స్. దటీజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ మై ఓన్లీ మెసేజ్ టు యూ.
అండ్…
బైదివే ఇది మెసేజ్ కాదు. రిక్వెస్ట్.
నువ్వు కథలు రాయడం మొదలు పెట్టాక దయచేసి నా గురించి,మౌలారూజ్ గురించి మాత్రం ఎక్కడా చెప్పొద్దు.  హంపిలో మౌలారూజ్ ఉండేదని, నాలాంటి వాడొకడుండేవాడని-చెప్పినా ఎవరూ నమ్మరు.
*****
ఫర్ సమ్ లైఫ్ ఈజ్ ఏ సీరీస్ ఆఫ్ ఎడ్వంచర్స్ అండ్ డెత్ బీయింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్.
చెప్పానుగా వాడు ఎవరికీ అర్థం కాడని.
అందుకే వాడు రాయొద్దని చెప్పినందుకైనా వాడి గురించే రాయాలనుకున్నాను. అది కూడా వాడే చెప్పిన మాటలతో మొదలు పెట్టాలనుకున్నాను.
“రాయడమంటే  నడిరోడ్డులో నిన్ను నువ్వు నగ్నంగా నిలబెట్టుకోవడమే.”
నన్ను నేను నగ్నంగా నిలబెట్టుకోవడమంటే నాకు సన్నిహితమైన నా ఆత్మీయ స్నేహితుడైన చిత్వాన్ ని నిలబెట్టడమే! నాకు తెలుసు వాడెక్కడ్నుంచో ఇదంతా చూసి తెగ సంబరపడిపోతుంటాడు. నాకది చాలు.
*****

​రచన

No comments:

Post a Comment