Thursday, August 1, 2013

Vadrevu Ch Veerabhadrudu ARticle 2


బెర్లిన్ ఫిల్ హార్మొనిక్ బృందం క్లాడియో అబ్బాడో నిర్వహించిన బితొవెన్ సింఫని-3 విన్నప్పుడు. 'ఎరోయికా ' గా ప్రసిద్ధి చెందిన ఈ సింఫని ని బితోవెన్ నెపోలియన్ కి అంకితమివ్వాలనుకున్నాడట. కాని బోనాపార్టి తనని చక్రవర్తిగా ప్రకటించుకున్నందుకు బితోవెన్ చాలా దు:ఖపడ్డాడట. పాశ్చాత్యసంగీతంలో సంప్రదాయయుగంనుంచి రొమాంటిక్ యుగానికి తలుపులు తెరిచిన ఈ కృతిని తలుచుకుంటూ:

సముద్రతీరగ్రామాలమధ్య ప్రయాణిస్తున్నప్పుడు
ఆకాశంలో కనవచ్చే శుభ్రనీలిమలాగా నిదానంగా
మొదలవుతుంది కాలం. ఇంతలోనే ఏ ప్రాచీన
అరణ్యాల్లోనో వన్యమృగాల్ని వేటాడే హోరు

ఏ చారిత్రిక యుగసంధ్యలోనో అతడొక ఉద్రిక్తతను
అనుభవించాడు. దాన్నిప్పుడు పునరన్వేషిస్తూ
వెయ్యి వయొలిన్లు, సెల్లో, ఓబోలు,బసూన్లు
బాకాలు, తాళాలు, బూరాలు, వేణువులు.

ఒక యోగిలాగా అతడే నిశ్శబ్దాన్ని ధ్యానించాడో
ఇప్పుడు దానికోసం మళ్ళా బిగించిన తంత్రులు,
ఉగ్గబట్టిన ఊపిరి, ఒక గడ్డిపోచలాగా నీ ప్రాణం
తేలిపోయి గాల్లో ఎగుర్తున్న సుకోమలవిముక్తి.

No comments:

Post a Comment