Saturday, August 31, 2013

ఇంద్రధనసు by ARUN SAGAR

ఇంద్రధనసు
మియర్ మేల్ సంకలనంలోని లవ్వాలజి ట్రియాలజిలో ఇది చివరిది 

ఫేర్వెల్ టూ యు. ఆల్ ద బెస్ట్ టు మి. వీడ్కోలు చెప్పడమెలాగో నేర్చుకో. ప్రేమకైనా ప్రాణానికైనా, ప్రాణాన్నిమించిన ప్రేమకైనా. వమ్ము కాదనుకున్న నమ్మకానికైనా, వికలమవదనుకున్న విశ్వాసానికైనా. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పక తప్పదు. స్పర్శల జాడలకైనా, జ్ఞాపకాల నీడలకైనా వీడ్కోలు తప్పదు. పాయింట్ టూ పాయింట్-స్టేజి కేరియర్. ఎక్కడ ఎక్కే వాడు అక్కడ. ఎక్కడ దిగే వాడు అక్కడ-గప్చుప్. తప్పు ఎంత మాత్రమూ తనది కాదు.

తెలిసీ వలచుట తొలినేరం. ఆత్రేయ చెప్పినా వినలేదేమిరా నాయనా. తెలిసి తెలిసి విలపించుటలో తీయదనం? బిట్టర్ స్వీట్ అంటే ఇదేనా మడోనా? ది పవర్ అఫ్ గుడ్ బై. అదేంటో తెలియదు. కాని వీడ్కోలు చెప్పాలంటే చాలా శక్తి కావాలి. పైగా ఇది పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు కాదు. వేరే!

అయినా ఆ హ్రుదయద్వారం మరెవరికోసమో తెరచి ఉన్నపుడు రమ్మన్నా వెళ్లి ఫలితం లేదు. ఆ హ్రుదయవేదిక ఎవరికో శయ్య కానున్నపుడు ఆశలు వికసించి అస్సలు ఉపయోగం లేదు. వీడ్కోలు స్వేఛ్చాగీతమట-దేని నుంచి దేనికొరకు దేని వలన స్వేఛ్చ. బందీ అవుతావో లేదో నీ ఇష్టం. బంధించే హక్కు నీకెక్కడిది?

పోయేదేమీలేదు. ఈ గుండెమీద కొత్త గాయాలకు చోటులేదు. దాక్కోవడానికి రహస్య స్థలాలు లేవు. కప్పుకోడానికిక ముఖాలు మిగిలిలేవు. వీడ్కోలు చెప్పడానికి గుండె కావాలి. దాని నిండా ధైర్యం కావాలి. కాని నిండుకుండలే జాగ్రత్తగా ఉండాలి-నీరైనా నిప్పయినా!

నువు డ్రీం సాంగైతే వేసుకోలేవు. ఎక్కడవున్న ఏమైనా తన సుఖమే నువు కోరుకున్న కోరుకోకపోయినా ప్రాబ్లమేమీలేదు. ఓరీ మధ్యయుగపు కాదలన్! తన సుఖం తను కోరుకోడం ముఖ్యం. నువు వీడ్కోలు చెప్పడమే మహాభాగ్యం.

చెప్పరా ఓ తెలుగువాడా పాడరా ఓ పాచిపాట. ప్రియా నీ జ్ఞాపకాలు చాలు వాటితో బతికున్నంతకాలం బతికేస్తాను. కిసుక్కు కిర కిర కిసుక్కు కిర్! నవ్వుతారురా జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. రొమాంటిక్ కష్టాల సెల్ఫ్ డిస్ట్రక్షన్. అందరానిదాని సంగతొదిలెయ్. చెయిజారిపోయిన పొందు?

నువ్వెవరయ్యా బాబూ చెయిజారుతుందని తెలియదా. మనం ముందే చెప్పుకున్నట్టుగా తెలిసికూడా వలచి మరి ఇప్పుడిక్కడ ఏడుస్తూకూచుంటే-టైం లేదు గురూ తర్వాత కలుద్దాం. ఈలోగా వెళ్లి ఆ కంఫెషన్ క్యూబికల్ ముందు కూర్చుని ధ్యానం చెయ్.

మామూలుగా మనం చెప్పాలంటే: వన్ లైఫ్ టూ లివ్. వన్ లవ్ టూ లవ్. ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యి కారంపొడి వేసిచెప్పాలంటే వన్ లవ్ టు లివ్ ఫర్.

డూ యు థింక్ ఇట్ ఈజ్ పాజిబుల్? మళ్లీ అడుగుతున్నా చెప్పు. ప్రేమంటే కమిట్మెంట్ల కట్టా?

ఇది బూస్ట్ లోని సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ కాదు. నీ గుండె కండరాల రెటైనింగ్ పవరెంతో చెప్పు. ఫేర్వెల్ ఈజ్ ద టైం యూ స్టార్ట్ మిస్సింగ్ దెం. వీడ్కోలు చెప్పాలంటే మామూలు పని కాదురా అన్నా. దానికన్నా అసలా సిచ్యుయేషన్ తెచ్చుకోకుండా ఉండటమే బెటర్.

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని బెంగపడిపోతున్నవు కదూ. దిగులు మేఘాలమధ్య, దారి తెలియని మసక చీకట్ల ముసురు మధ్య; గుబులు గుండె శబ్దాన్ని ఏకాంతంగా వింటున్నవు కదూ. వద్దు ఏడవద్దు. కమాన్ హాండ్సం! పాత సామెతలూ సూత్రాలూ చట్రాలూ చట్టాలూ సతీవ్రతాలూ పతీధర్మాలూ చూసి భయపడవద్దు. ప్రేమలు ప్రణాళికలు కావు. ప్రేమలు సంభవాలు. యూ డోంట్ నో వెన్ యూ ఫాల్ ఇన్ లవ్. సమయమూ సందర్భమూ లేకుండా, హెచ్చరికలు ఎగురవేయకుండా వచ్చి ముంచే విస్మయాలు, విభ్రమాలు, విచిత్రసంచలనాల మనోవిన్యాసాలు.

తప్పు తనది కాదు. నీది. ఎప్పటికైనా వీడ్కోలు చెప్పకతప్పదని తెలిసీ...నువ్వే అపరాధి.

నీకు దమ్మూధనియాలు ఉంటే వీడ్కోలు చెప్పు. నీకు దిధై ఉంటే వీడ్కోలును ఫ్లయింగ్ కిస్ లా కాచ్ చేసి పాకెట్ బుక్ పేజీల్లో నెమలి ఫింఛంలా పడేసి మర్చిపో.

కాని నాకు తెలుసురా. నీకేకాదు, హ్రుదయం ఉన్న ఎవడికైనా వీడ్కోలు చెప్పడమంటే గుండెను పీకి నేలకేసి రుద్దడమే. ఒసెయ్! ఈ బాధ భరించలేనే. ప్రొజాక్ లో జవాబుందా, మేన్షన్ హౌస్ లో శాంతి ఉందా?
-అరుణ్ సాగర్


Tuesday, August 27, 2013

లవ్ ఆజ్ కల్ - Mere Male- by Arun Sagar


ఉమ్రుభర్ కోయి తుం నే పుకార్ కర్తె హై ఉన్ కా నాం; ఓ ఫిర్ నహీ ఆతే! శలభము, ఆత్మహననము, పార్వతీ కోసము మొదలైన ఆత్మవినాశనము. బ్రేక్ డాన్స్ వేరురా ఇది-హార్ట్ బ్రేక్. అర్ధరాత్రి దాటినా గూడు చేరని పక్షులుంటయి. సంజకెంజాయలు మాయమైనా ఆకాశం వీడని విహంగాలుంటయి. టైముకి ఇంటికెళ్లాలని రూలేమైన ఉందా.

ఒకసారి నవ్విపడేసిన జోకు మళ్లీవిసిరితే లాభంలేదు. కానీ బాధ అలాకాదు. ఒకసారి దు:ఖపడి వదిలేస్తే పోయేదా? వెన్నులో దిగిన బాకు లాగా-ఫిర్ వొహి యాదే! ంజానికి ఇట్స్ సో హార్డ్ ఫర్ మెన్. అందరూ అనుకునేది అబద్ధం. పురుషుల ప్రేమ కూడా నిబద్దం. నిజం చెప్పాలంటే బ్రేకప్ నుంచి కోలుకోడానికి యూ టేక్ మోర్ టైం దేన్ ఉమెన్ మై బ్రదర్. నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతేనా ఇక ఆత్మహత్యే శరణ్యం....  

 కాని, కొంతమందికి సరళరేఖ మీద సాఫీగా సాగిపోయే సెటిల్డ్ లవ్ అంటే ఇష్టం. బట్ లవ్ నెవర్ సెటిల్స్ డౌన్-ఎప్పటికప్పుడు స్కోర్లు సెటిల్ చేసుకోడంలోని అలజడిలోని ఉత్కంఠ! ఎక్సైట్మెంట్ లేని రెలేషన్షిప్ ఎందుకురా దండగ.

పుట్టు, పెరుగు, పెళ్లాడు, పిల్లల్నికను. మరెప్పుడు ప్రేమ. రేఖ ఏమని చెప్పింది. ట్రూలీ డీప్లీ ఇన్సేన్లీ స్పెషల్లీ హోప్లెస్లీ ఇన్ లవ్. హోప్ లెస్ గా ప్రేమించడమా? ప్రేమలోని తీవ్రవాదమా. మహర్షి గాడి అరాచకమా. దునియా భర్ లవ్ లీజియేగా: ఐ హావ్ ఇట్ ఫర్ హిం! (ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ గురించి రేఖ)

అయితే జీవితమంతా ఎవరి నామస్మరణలో కాలం గడిపామో వాళ్లే తూచ్ అంటే ఇక ఈ జీవితమెందుకు. బట్ రేఖ నెవర్ గేవ్ అప్. తు బదన్ మై హు ఛాయా, తు నహో తొ మై కహా హు?

మొపాసా పిపాస వీడలేదు. ప్రేమల కోసం హ్రుదయ కోశాల నుంచి కురిసే అమ్రుతధారల కోసం బిచ్చగాడై తిరిగాడు కదా. ఇది తీరని దాహం. రాజేష్ ఖన్నా దేశాలు పట్టిపోయాడు. వో...ఫిర్ నహీ ఆతే!

స్రుష్టిలో తీయనిది స్నేహమేనోయి. ఎయిటీస్ హైస్కూలు బంధాల కొటేషన్ ప్రకారం స్నేహం తీయనిదైతే, ప్రేమ? ఒక్క రుచి కాదు గురూ అమ్రుతం తాగితే చావుండదు. పలురుచులు లేనిదే బతుకుండడు. బంపీరైడ్ లోని థ్రిల్ సాదాసీదా సగటు కుటుంబప్రేమలో పండదు. తీపీ పులుపు కారం చేదూ కలగలసిన అనుబంధం నిరంతర నూతనం.

అనుబంధాలన్నీ కాలపరిమితితో పుడుతున్న వేళ. టైం టూ టైం రెఫ్రెష్ బటన్ నొక్కకపొతే నిలవని ప్రేమ. పరస్పర వ్యతిరేక వ్యక్తుల మధ్య ఐక్యత-ఘర్షణ. ఫ్రిక్షన్ లోంచి కొత్తదనం. కొత్తదనం లోంచి ప్రణయపరిమళం. కొంచెం స్ప్రే కొట్టుకోవాలి గురూ. ఎందుకంటే నిలబెట్టుకోడం ఓ ఫీట్. ముఖ్యంగా ప్రేమను. పాతకాలపు సెటప్ సంగతేమోగానీ కొత్తకాలంలో సర్కస్.

ఇక్కడే కదా అసలు ఎక్సైట్మెంట్ జలజల ప్రవహించేది. నిరంతరం గెలుచుకుని నిలబెట్టుకోడంలో నీతో నువ్వే పోటీపడడంలో ఏజ్ లెస్ రొమాన్స్! పాంపర్ చేసి, ప్రయిజ్ చేసి అలిగి, తొలగి. గెలిచి, ఓడి. 

 ఈ సందర్భంగా ఓ కొత్తసంగతిరా కొలంబస్. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల తప్ప తెలివిడి ఉన్న లేడీ ఎవరూ నిన్ను నిన్నుగా ప్రేమించదు. అది శ్రీశ్రీ గారితో ఎండ్ అయిపొయిన ఆశ. దునియా భర్ లవ్ లీజియేగా, ఐ హావ్ ఇట్ ఫర్ యు అని ఈ తరం హీరోయినెవరూ చెప్పదు. అది రేఖ చెప్పిన ఆఖరి డైలాగ్. న్యూ ఏజ్ లవ్ లో విజేతలవ్వాలంటే, జీవితం లోనూ గెలిచితీరాలి. గెలుస్తూనే ఉండాలి. గెలుస్తూనే చావాలి. యూ లాస్ట్ లైఫ్, యూ లూజ్ లవ్. ప్రేమంటే సులువు కాదురా. అదొక కెరీర్. ఎప్పుడూ ఫాంలో ఉండాలి. లేదంటే యువార్ అవుటాఫ్ గేం.

ఆడకపోతే థ్రిల్ లేదు. థ్రిల్ లేనిదే బతుకు లేదు. బతుకంటే ప్రేమ. ఒకపరి తిరస్కారం. ఒకపరి పురస్కారం. రోలర్ కోస్టర్లా సాగే ప్రేమ. ఇన్సేన్ అండ్ హోప్లెస్!

కాని గురూ ఎన్నిచెప్పుకున్నా ఒక పాట మాత్రం వాడిపోదు-మరపురాని బాధకన్నా మధురమేలేదూ. ఆ మాధుర్యం కోసమే పిపాసులవుతాం. శలభాలవుతాం. బాటంలైన్-ప్రేమ: వైల్డెస్ట్ పెయిన్!

అందువల్ల చేత-ఓదార్చుటకు నీవెవరు? ఓదార్పుకు గురియగుటకు నేనెవరు?

-అరుణ్ సాగర్
(మియర్ మేల్ కవితాసంపుటి లోని లవ్వాలజి (ట్రియాలజి)లో రెండవ పీస్)

Monday, August 19, 2013

Pain of a PoeM -- జయశ్రీనాయుడు

పెయిన్ అఫ్ ఎ పోయెం
- జయశ్రీ నాయుడు

గడియారం ముల్లు గుచ్చుతోంది
జ్ఞాపకాల లేసులు గుండె గలీబు అంచవుతున్నాయి
ఒకటా రెండా.. చుక్కల్లా లెక్కకు అందవు
మరుపు దాగుడుమూతవుతూ
నిన్ను తీసుకెళ్ళడం మరుస్తూనే వుంటుంది..

నువ్వొక మబ్బు తునక
మనసు కప్పుకున్న దుప్పటివి
దూదిపింజలా తేలిపోయే కాలం
సూర్యుడ్ని గుండెలో నింపుకుంటూ నేను

నువ్వొక వాన జల్లు
మనసు కురిసినంత సేపు
తడిచి ముద్దైన ప్రేమ
దోసిట్లో నిలవని నీళ్ళంత జ్ఞాపకం

నువ్వొక మమతల మెరుపు
కళ్ళు మిరుమిట్లు వెలుగు
వెన్నముద్దగ చేసే లోపే
చిమ్ముతున్న నవ్వుల జలపాతంలా వెళ్ళిపోతుంది

గుప్పెడు ఆలోచనలు కుమ్మరించి
లాలనగా నా వంక చూస్తూ వుంటుంది ఏకాంతం
చీకటివెలుగుల మొజాయిక్ అల్లుకుంటూ
నేనూ నా ఆలోచనలూ మాత్రమే మిగిలేది!


http://vaakili.com/patrika/?p=738

Thursday, August 8, 2013

Ramzan Rumi translation by ChinaveerabhadruDu

రంజాన్. ప్రార్థనలతో,ఉపవాసాలతో,దానాలతో గడిచిన నెల. మెహిదిపట్నంలో నేను చూస్తున్న ప్రతి రంజాన్ నెలా ఒకప్పుడు నేను శ్రీశైలంలో చూసిన మాఘమాసాన్ని గుర్తుతెస్తూంటుంది. గాల్లో ఒక తేటదనం, శుభ్రత్వం ఆవరించినట్టుంటాయి. మనుషులు కొద్దిగా కొంతసేపు ఈ ప్రపంచపు బరువు పక్కకు దించుకుని అగోచరమైన ఓదార్పునేదో అనుభవిస్తున్నట్టుంటారు. అది మతాతీత క్షణం. అటువంటి సందర్భంలో రూమీ మాటలే నాకు పదేపదే గుర్తొస్తుంటాయి. ఆయన ఇలా గానం చేసాడు:

మిత్రులారా, నేనేం చేసేది? నేనెవరో నాకే తెలియదు.
నేను క్రైస్తవుణ్ణి కాను, యూదునిగాను, పారశీకుణ్ణికాను, ముస్లిమునీ కాను.

నేను తూర్పుకి చెందినవాణ్ణి కాను, పడమటివాణ్ణీ కాను.
నేను నేలదారిన రాలేదు, సముద్రమార్గానా రాలేదు. 
ప్రకృతిపొత్తిళ్ళనుంచి ప్రభవించినవాణ్ణికాను, అంతరిక్షంనుంచి ఊడిపడనూ లేదు.
నాది పృథ్వికాదు, ద్యులోకమూ కాదు.
నాకొక ఉనికి లేదు, అస్తిత్వం లేదు.

నేను హిందుస్థాన్ కి చెందినవాణ్ణి కాను, చీనావాణ్ణి కాను,మంగోల్ ని కాను, 
మధ్యాసియా వాణ్ణీ కాను.
యూఫ్రటీస్, టైగ్రిస్ ల మధ్యదేశం వాణ్ణి కాను, ఖొరాసాన్ కి అసలే చెందను.
నాదీ లోకం కాదు, పరలోకమూ కాదు
స్వర్గనరకాలతో సంబంధమే లేదు.

నేను ఆడాము కి చెందినవాణ్ణి కాను, అవ్వకి చెందినవాణ్ణీకాను, 
ఏ పరదైసుకీ చెందను,ఏ దేవదూతకీ చెందను.
నాకంటూ ఒక చోటు లేదు, ఆనవాలు లేదు.
దేహం లేదు, ఆత్మ లేదు, ఆత్మలకే ఆత్మ ఆధారమైన చోటు నాది .

నేను ద్వంద్వాన్ని వెంటాడాను, రెండు ప్రంపచాలూ ఒక్కటిగా జీవించాను.
నేను వెతికేదొక్కటే, తెలుసుకున్నదొక్కటే, చూసేదొక్కటే,ఎలుగెత్తి పిలిచేదొక్కటే
నేను అందరికన్నా మొదట చూసిందొక్కణ్ణే,అతడే చివరివాడూను, 
బయటా అతడే, లోపలా అతడే
అతడు తప్ప మరేదీ నేనెరగను.
ప్రేమపానంతో మత్తెక్కాను, రెండు ప్రపంచాలూ నా నుంచి జారిపోయాయి.
ఇప్పుడు నాకు ప్రేమపానం తప్ప మరేదీ పట్టదు

ఏ రోజైనా ఒక్క క్షణమైనా నీనుంచి ఎడబాటు తటస్తించిందా
జీవితకాలం దు:ఖం తప్ప మరేదీ మిగలదు.
ఏ రోజైనా ఒక్కక్షణమైనా నీతో ఏకాంతం దొరికిందా 
రెండు ప్రంపంచాల్నీ కాలరాచి మరీ నాట్యం చేస్తాను

తబ్రీజ్ నుంచి వచ్చిన నా మిత్రుడా
నేను లోకం నుంచి తేలిపోతున్నాను
సంతోషపారవశ్యమొక్కటే నేనిప్పుడు చెప్పుకోగలిగింది.

Saturday, August 3, 2013

రూమీ కవితలు

మిత్రులకోసం రూమీ కవితలు కొన్ని: Translated and Posted by Vadrevu Chinaveerabhadrudu

1

నేను నీతో ఉన్నప్పుడు, రాత్రంతా నిద్రలేదు
నువ్విక్కడ లేనప్పుడు అసలు నిద్రే రాదు.

దేవుణ్ణి స్తుతించాలి: రెండురకాలుగానూ నిద్ర
లేనందుకు, రెండింటిలోనూ తేడా ఉన్నందుకు.

2.

నేను నా ప్రేమకథ విన్నతొలిక్షణం నుంచీ
నీ కోసం వెతుకుతూనే ఉన్నాను, అదెంత
గుడ్డితనమో తెలుసుకోకుండానే.

ప్రేమికులంటే ఒకరోజుకి కలుసుకునేవాళ్ళు
కారు, మొదటినుంచీ ఒకరిలో ఒకరు 
కొనసాగుతుండేవాళ్ళే.

3.

మనం అద్దాలం, అందులో ముఖాలం కూడా
ఈ క్షణం మనం చవిచూస్తున్నది నిరంతరాన్నే
మనం నొప్పి, మనం ఔషధం కూడా
మనం పానీయం,మనం పాత్ర కూడా.

4.

ప్రేమ నా కార్యకలాపాన్నిపక్కకు నెట్టేసి 
నా రోజుల్ని కవిత్వంతో నింపేసింది.

మామూలుగా చేసినట్టు
మౌనజపం చాలదు.
చప్పట్లు కొట్టాలి
నాట్యం చేయాలి.

ఇన్నాళ్ళూ మర్యాదస్తుడిగా,
పెద్దమనిషిగా బతికాను
ఈ మహాప్రభంజనంలో
అదేదీ నిలబడేట్టు లేదు.

పర్వతం ప్రతిధ్వనిని 
తన హృదయాంతరాళంలో దాచుకున్నట్టు
నీ స్వరాన్ని నాలో నిలుపుకుంటాను

నీ జ్వాలలో ఒక
ఎండుకట్టెలాగా వచ్చిపడ్డాను
ఇంతలోనే భస్మమైపోతాను.

నిన్ను చూసినప్పుడే
నన్ను నేను శూన్యం చేసేసుకున్నాను
ఉండటం కన్నా ఈ లేకపోవడమే 
ఎంతో బావుంది.
నా అస్తిత్వాన్ని మింగేసే శూన్యం
అయినా అది అడుగుపెట్టగానే
నాలో ప్రాణం పరవళ్ళు తొక్కుతోంది.

నీలాకాశం. అయినా
లోకమొక గుడ్డివాడిలాగా
రోడ్డు మీద చతికిలబడింది.
కాని నీ శూన్యాన్ని చూసినవాళ్ళు
ఆ నీలాన్నీ, ఆ లోకాన్నీ కూడా
దాటి చూస్తారు.

మహమ్మద్ లాగా, యేసులాగా
గొప్ప ఆత్మ ఒకటి
తననెవరూ గుర్తుపట్టని
నగరం మధ్య నడిచిపోతుంది

అట్లాంటి శూన్యం ముందు
నువ్వు మోకరిల్లడాన్ని
ప్రశంసించేదే ప్రశంస.

సూర్యుణ్ణి ప్రశంసించడంటే ఏమిటి?
నీ కళ్ళని నువ్వు ప్రశంసించుకోవడం.
నువ్వు ప్రశంసించవలసిందొక సముద్రం
మనమెంట మాట్లాడినా ఇంతాచేసి 
ఒక తెప్పతో సమానం.

సముద్రం మీద ప్రయాణం,
ఎక్కడికో తెలియదు.
అయినా అపారసాగరంలో
మనమిట్లా పోతూండటమే
గొప్ప భాగ్యం,
పూర్తి మెలకువ.

నిద్రపోతున్నామని
దిగులెందుకు?ఎంతకాలంగా
నిద్రపోతున్నామన్నదేమంత
విషయం కాదు.

ఇంతకాలంగా జబ్బుపడ్డాం
సరే,పోనివ్వండి,ఇప్పుడు 
చూడండి చుట్టూ,
చెప్పలేనంత
ఉల్లాసం.

ఆ కనులతో కనులు కలిపాను - సామాన్య

ఐదు వందల ఏళ్ల పురాతనమైన కృష్ణ మందిరం అది. సాదాసీదాగా ఉన్న అతి చిన్న గుడి ఆవరణలో అటూ ఇటూ వరుసగా పది నివాస గదులున్నాయి. బహుశా అక్కడి పూజారులు, బయటి నుండి వచ్చే వైష్ణవి, వైష్ణవులు బస చేయడానికి ఉద్దేశించినవి అయ్యుండొచ్చు. మందిరం ఎదురుగా నాలుగుకాళ్ల మండపం. మందిర గోపురంపై కువకువమంటూ హాయిగా ప్రేమించుకుంటున్న పావురాలు. కుడిచేతివైపు పెద్దకొలను, కొలను నిండా విరగ పూసిన కలువలు. గలగలమంటూ తనపైన వాలిన పక్షులనడిగి ప్రాపంచిక చలన సమాచారాన్ని రాబడుతూ కొలను ఒడ్డున పెద్ద రావిచెట్టు. మందిరం నుండి బయటికి వచ్చేస్తే ప్రవేశద్వారం వద్ద మందిరం. మందిరంలో కృష్ణుని పాదముద్రలు వున్న ఒక బండరాయి.

 మేము ఆ మందిరానికి మెడికల్ క్యాంప్ చేయడానికి వచ్చాం. ప్రతి ఏడూ జూన్ మాసపు మొదటి వారంలో అక్కడ తిరనాళ్లు జరుగుతుంది. నేను పనిచేసేది శ్రీకృష్ణ మనోహరి మెడికల్ కాలేజ్‌లో. మా కాలేజి యజమానురాలు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కృష్ణ భక్తురాలు. ఇది ఆమె స్వగ్రామం. అందుకని ఏటా మేమిక్కడ మెడికల్ క్యాంప్‌ను ఆనవాయితీగా పెడుతుంటాం. అంతేకాదు ఈ గ్రామంలో ఎవరికి రోగమొచ్చినా ఆ బాధ్యత మా భుజస్కందాలపైనే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామాన్ని మా యజమాని దత్తత తీసుకుంది.

తిరనాళ్లకి ఈ ఏడాది కూడా దేశం నలుదిక్కుల నుండి భక్తులు వచ్చారు. అతి బీదలు, అతి ధనవంతులు..చీమల్లా చుట్టూ మనుషులే. మా క్యాంప్‌కి పక్కన ఒక పదిమంది బీద సన్యాసుల గుంపు కూర్చుంది. గంగరాయి చెట్టు చల్లటి నీడ కింద పొయ్యి పెట్టి అక్కడే వంట చేసుకుంటున్నారు. వంట చేస్తూ పాడుతున్నారు. వాళ్లు ఏ రాష్ట్రం వాళ్లో నాకు తెలీదు కానీ ఆ గుంపు నుండి పదే పదే వినిపించే ఒక పాట నా హృదయాన్ని హత్తుకుంది. అనుకరణకు తావులేని పచ్చిదనం, కొత్తదనం వారి గొంతుల్లో విని విని రెండవ రోజు సాయంత్రం టీ కోసమని బయటకొచ్చి ఆ గంగరాయి చెట్టుకిందకు చేరుకున్నాను.

వాళ్లు టీ కాచుకుంటున్నారు. నన్ను చూసి పరిచయంగా నవ్వారు. గిన్నెలోంచి టీని అందరూ తమ తమ గ్లాసుల్లోకి ఒంపుకుని ఆనందంగా తాగుతున్నారు. ఎందుకో ఆ దృశ్యం నాకు విపరీతమైన ఆనందాన్ని కలిగించి ఒక పాటని జ్ఞాపకం తెచ్చింది *"సంచారమే ఎంత బాగున్నది, దీనంత ఆనందమేమున్నదీ, జ్ఞాన సంచారమే...'' అని సాగుతుందది. సంచారానికి జ్ఞానానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆ కవి "సంచరించేవి శక్తితో ఉన్నవి/ మూలకున్నవి మురిగిపోతున్నవి'' అంటాడు.

 వీళ్లు ఎక్కడెక్కడ తిరిగారో ఆ రకంగా ఎంత జ్ఞానులై ఉంటారో! వీళ్లు మాట్లాడేది ఏ భాషైనా, హిందీ వచ్చి ఉండొచ్చు అనుకుని, హిందీలో అడిగాను " మీరు పదే పదే పాడుతున్నారు కదా 'హృద్ మాఝారె రాఖిబో''అని, ఆ పాట అర్థమేమిటి? ఎవరి గురించి?'' వాళ్లలో పెద్ద సన్యాసి గంగరాయి చెట్టు వేరుపైన తల పెట్టుకుని పడుకున్న వాడల్లా లేచి"ఇంకెవరి గురించి పాడుతాం బాపూ! ఆ కిషన్ కన్నయ్య గురించే''అన్నాడు. అని నేను అడగకుండానే తన దగ్గరున్న ఏక్‌తారాని మీటుతూ పాట మొత్తం పాడాడు. ఎంత బాగుందో పాట! మొత్తం రికార్డు చేసుకుని క్యాంప్‌లోకి వచ్చాను. ఆ రాత్రి ఆ పాటగుండా నా కాలం ప్రయాణం చేసింది.

మరుసటి రోజు క్యాంప్‌కి రాగానే వాళ్లు ఉన్నారా లేదా అని నా కళ్లు వెదుకులాడాయి. వాళ్లు లేరు కానీ, వాళ్లకి సంబంధించిన పాత్రలు సరంజామా అన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్లు వస్తే చెప్పమని చెప్పి క్యాంప్‌లోకి వచ్చాను. సాయంత్రం నాలుగున్నరకి టీ కోసమని బయటికి వచ్చినపుడు వాళ్ల దగ్గరికి వెళ్లాను. అదే దృశ్యం.. పొయ్యిమీద మసలుతున్న తేనీరు.

ఎక్కడెక్కడికో వెళ్లిన ఆ చెట్టుపక్షులు తిరిగివచ్చి రాత్రి నిద్రకి పక్కని స్థిరపరుచుకుంటున్నాయి. ధూళి ధూసరిత నారింజ సంధ్య, బారులు తీరి ఎటో వెళుతున్న కొంగలు...ఎటు చూసినా పచ్చదనం ఆవరించిన పల్లెటూరు. మనసుకేమిటో ఒకటే సంతోషం కలిగింది. ఆ సంతోషంలోంచే అడిగాను ఏక్‌తారా పట్టుకునివున్న సన్యాసిని "నిన్న పాడిన పాటకి అర్థమేమిటో చెప్తావా'' అని. అతను నవ్వి "బాబూజీకి ఆ పాట బాగా నచ్చినట్లుంది.



 అంతా కృష్ణుడి మహిమ, ఆ పాటలో ప్రేమ ఉంది'' అని చెప్పి, ఒక్కో వాక్యమూ పాడుతూ అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. "శతకోటి జన్మలు ఎత్తి ఎత్తి / కడాన పొందితిమీ మానవజన్మ /ఈ జన్మ జారిపోతే మళ్లీ దొరికేనా/ఇక మళ్లీ దొరికేనా/ నిను మది గుడిలో దాస్తా..విడిచిపెట్టను/ నిను గుండెల్లో దాస్తా విడిచిపెట్టను/ విడిచిపెడితే వేణుగోపాలా మళ్లీ దొరికేవా.../ నీ కళ్లలో కళ్లు కలిపాను ఇక విడువలేను // నిన్ను గుండెల్లో// మన్మోహనా కృష్ణా మునిజన సమ్మోహనా/కృష్ణా/ జై రాధికా మన్మోహనా/ కాదన్నా విడిచిపెడతానా/వెళతానంటే వెళ్లనిస్తానా....// నిన్ను హ ృదయంలో//......పాట సాగుతుండగానే ఆకాశం నీలమేఘ వర్ణంలోకి మారింది, నారింజ ఎండ వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నా. వర్షం జోరున కురవడం మొదలుపెట్టింది.

 ఆహ్లాదకరమైనా ఆ వానకి పక్షులన్నీ ఆనందంగా రెక్కలల్లాడిస్తూ స్నానం చేయడం మొదలుపెట్టాయి. నేనూ, ఆ సన్యాసులూ చెట్టుకింద పొడిగా వున్న చోటికి చేరాం. నేను చెట్టువేరు మీద కూర్చుని ఏక్‌తారా సన్యాసితో అన్నాను-"పాట వినడానికి బాగానే ఉంది కానీ ఏ నాటికీ ప్రత్యక్షం కాని, ఈ భౌతిక ప్రపంచంలో నిరూపితం కాని భగవంతుడ్ని గుండెల్లో దాచుకున్నా, గుడిలో దాచుకున్నా లాభమేమిటి? ఇదేం ప్రేమ? ఎప్పటికీ ప్రత్యక్షం కాని ఆ దేవుడ్ని కొలుస్తూ మీరు చెప్పే ఎప్పటికీ సఫలం కాని ఈ ప్రేమని, 'ప్రేమ' అనరు. పిచ్చి అంటారు.

ఈ పిచ్చితో మీరు సన్యాసులయ్యారు అంతే'' అన్నాను. అట్లని సిగరెట్ డబ్బా వారి ముందు విసిరేసాను. కానీ ఆ పెట్టెనెవరూ ముట్టలేదు. చిన్న సన్యాసి టీ గిన్నెను పొయ్యిపైకి ఎక్కించాడు. వాన విడువనే లేదు. వాన పడని స్థలాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏక్‌తారా సన్యాసి నా మాటలకి చాలా సేపటికి స్పందించి "సరే బాపూ ఇది ప్రేమ కాదనే అనుకుందాం. మరి మీరు దేన్ని ప్రేమ అంటారు?'' అన్నాడు. నేను అతనివైపు తలతిప్పలేదు. ఔను నిజమే దేనిని మనం ప్రేమ అంటాం. ఏమో నాకు తెలీదు. అదే అతనితో చెప్పాను- "దేనిని ప్రేమ అంటారో నాకు తెలీదు. కాని ఎవరిని ప్రేమించాలో మటుకు తెలుసు.

రాయినీ రప్పనీ కాదు, నా ప్రేమకు ప్రతిస్పందన కావాలి అదే నా ప్రేమ''. దానికి సన్యాసి నవ్వి, "బాపూ మీరు చెప్తున్న దానిని ప్రేమ అనరు. మీ భార్యని తీసుకోండి ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది కాబట్టి, వండివార్చి, మీ ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుతుంది కాబట్టి మీకు ఆవిడతో ఒక అవసర పరస్పరత ఉంటుంది. ఆ డిపెండెన్సీని మీరు ప్రేమ అంటున్నారు. ఉదాహరణకు మీకు మగపిల్లవాడు కావాలని ఉందనుకుందాం. మీ భార్య ఆడపిల్లల్నే కంటూ వస్తుంటే అప్పుడు మీకు ఆవిడ మీద మీరు చెప్పే ఆ ప్రేమ పోతుంది. అట్లా ఒక భౌతిక కారణం చేత వచ్చి మరో భౌతిక కారణం చేత పోయేదాన్ని ప్రేమ అనరు. అది అవసరం. ఈ భౌతిక ప్రపంచంలో మనుషుల మధ్య ఉన్నవన్నీ అవసర సంబంధాలే బాపూ'' అన్నాడు.

నేను అతని వంక చూశాను. అతని భాషలోని ఆంగ్ల పదాలు, అతను చెప్పిన వివరణా అతను విద్యావంతుడు అని తెలియచెప్పినట్టు అనిపించింది. అయినా " పిల్లలు మగో ఆడో కావడానికి తండ్రి కర్త అని వైద్యశాస్త్రం నిరూపించింది. నాకు మగపిల్లాడు పుట్టకపోతే నేనే కారణం నా భార్య కాదు'' అన్నాను, నా మాట మా చర్చకు సంబంధం లేనిదని తెలిసినా. సన్యాసి అది విని నవ్వి "చదువు లేని వాళ్ళం కదా బాపు పెద్ద పెద్ద విషయాలు మాకెలా తెలుస్తాయి. ఏదో ఒక పోలిక చెప్పా అంతే'' అన్నాడు. 

 వాన నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. భక్తులలో చలనం మొదలైంది. కానీ నాకు అక్కడి నుంచి లేచి వెళ్లాలనిపించలేదు. హృదయంలో ఏదో తపన బయల్దేరింది. అవును..అసలు ప్రేమంటే ఏమిటి? దేన్ని ప్రేమ అని పిలవాలి? ఇతను చెప్పినట్టు అన్నీ అవసర సంబంధాలే అయితే మనం ప్రేమ అని చెప్పుకుంటున్నది భ్రమ మాత్రమే. మనం ఊరికే ఏవేవో గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుని ఒకలాటి భావస్కలనాన్ని పొందుతున్నాం అంతే! ఇదంతా వట్టి బూటకం. నాకెందుకో దుఃఖం కలిగింది. ఆ సన్యాసి వైపు తిరిగి "బాబా ఆ పాట మళ్లీ పాడుతావా'' అన్నాను. అతను కాదనలేదు.

ఏక్‌తారా మీటుతూ పాడటం మొదలుపెట్టాడు. ఎంత బాగుంది పాట. ఎంత గొప్ప మెసేజ్‌ని ఎంత సరళంగా చెప్పేస్తుంది. ఈ సన్యాసి ప్రార్థిస్తున్న భగవంతుడు చరిత్రలోనైనా దాఖలాలు ఉన్నాయో లేవో కానీ ఇతను ఆ భగవంతుడి పట్ల ఒక ఇష్టాన్ని పెంచుకున్నాడు. తన హృదయం నుండి భగవంతుని హృదయానికి వారధి వేసుకుని మమేకతను పెంచుకున్నాడు. ఆ భగవంతుడు ఎప్పటికీ ప్రత్యక్షం కాకపోవచ్చు. కానీ భగవంతుడున్నాడనే ఇతని నమ్మకం సడలిపోదు. ఆ దేవుడు ఇతని భౌతిక అవసరాలేమీ తీర్చకపోవచ్చు. కానీ ఇతను భగవంతుడ్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఔను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమే దీని పేరే ప్రేమ. ప్రేమ అంటే అవతలి వ్యక్తి హృదయపూర్వకంగా ఏమైనా ఇయ్యగలిగితే పుచ్చుకోవడం. ఏమీ ఇవ్వలేకపోయినా అతని పట్లో, ఆమె పట్లో ఉన్న పూర్వ భావాన్నుండి మరలకపోవడం.

ఆలోచనల్లోంచి బయటికి వచ్చి నిట్టూర్చి,"బాబా మీకు ఒక కథ చెబుతాను, అది ప్రేమో కాదో చెప్తారా''అన్నాను. ఆ సన్యాసి తల ఊపాడు. "నేను మెడిసిన్ చదివేటప్పటి సంగతి ఇది. ఆ ఏడాది ఎంట్రన్స్ ఫస్ట్ రాంకర్ నాగేందర్ మా కాలేజ్‌లోనే చేరాడు. నల్లగా ఎత్తుగా అందంగా ఉండేవాడు. మితభాషి. సంపన్న గ్రామీణ కుటుంబానికి చెందినవాడు. 

 అతనికీ నాకూ ఎందుకో బాగా స్నేహం కలిసింది. మొదటి ఏడాది గడిచి రెండో ఏడాదిలోకి ప్రమోటయ్యాం. మా జూనియర్లు వచ్చారు. వాళ్లలో ఒకరు దీపాన్విత. నాగేందర్ ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఎవరు ఎవరికి ఎందుకు నచ్చుతారో మీ దేవుడ్నే అడగాలి బాబా! ఎందుకంటే ఆ అమ్మాయి సాదాసీదాగా ఉండేది, చదువు కూడా అంతంత మాత్రమే. నాగేందర్ ఎంట్రన్స్‌లోనూ కాలేజిలోనూ ఫస్ట్ ర్యాంకర్. ఏక సంథాగ్రాహి. అందుకని అతను ప్రేమించడం ఆ అమ్మాయి అదృష్టమని మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించేసాం. ఇంక ఆలస్యమెందుకు, ఆ పిల్లకి చెప్పేయమని బలవంతం కూడా పెట్టాం.

హోలీ వచ్చింది. అబ్బాయిలం అమ్మాయిల హాస్టల్ దగ్గరికి వెళ్లి గోలగోలగా రంగులు చల్లుకుంటున్నాం. నాగేందర్ దీపాన్వితని పక్కకి పిలిచాడు. ముందే తెచ్చి పెట్టుకున్న బొకేని, కార్డ్‌ని, చిన్నగిఫ్ట్‌ని ఆ అమ్మాయి చేతిలో ఉంచి, ఆకుపచ్చటి రంగుని ఆ పిల్ల తెల్లని మణికట్టు వద్ద రాసి "ఐ లవ్ యు దీపా'' అన్నాడు. మేమందరం ఈలలేస్తూ గట్టిగా కేరింతలు కొట్టాం. అంతే మేమందరం ఆశ్చర్యపడేట్టు ఆ అమ్మాయి ఆ బొకేని, బహుమతిని నేలమీదకి విసిరేసి ఒక్క నిముషం కూడా అక్కడ నిలబడకుండా విసవిసా హాస్టల్ లోపలికి వెళ్లిపోయింది. నాగేందర్ స్తంభితుడై నిలబడ్డాడు. నేను వాడి దగ్గరికెళ్లి కుదిపి "పదరా హాస్టల్‌కి వెళ్దాం'' అన్నాను. వాడేం మాట్లాడలేదు వచ్చేశాడు.
ఆ తరువాత దాని గురించి ఏం పట్టనట్లు కొన్ని రోజులు మామూలుగానే ఉన్నాడు. ఆ తరువాత నుండి నెమ్మదిగా తనలో తను అనుకుంటున్న 'దీప నాకు కావాలిరా, ఇదిగో ఇట్లా కూర్చుని ఆలోచిస్తుంటే అది లేకుండా బ్రతకడమెట్లాగో అర్థం కాకుండా ఉంది'' అనేవాడు. ఎప్పుడూ దీప...దీప అదే ధ్యాస. అంత తెలివైనవాడు కదా, అయినా కావాలనే ఒక సంవత్సరం పరీక్ష రాయకుండా ఫెయిలై దీప క్లాసులో కలిసాడు. రోజూ ఆ అమ్మాయిని చూడటానికి క్లాసుకి వెళ్లినా క్లాసులో విన్నదే సరిపోయేదనుకుంటా ప్రతి సబ్జెక్టులో టాప్‌గా నిలిచేవాడు. మేం నాలుగో ఏడుకి, వాడు మూడో ఏడుకి వచ్చాక ఒకరోజు మళ్లీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఏదో జన్మజన్మల శత్రుత్వం ఉన్నట్లు ఆ పిల్ల వాడిని ఛీకొట్టింది.

 మేమందరం కూడబలుక్కుని వాడికి కూడా చెప్పకుండా ఆ పిల్లని కలిసి అడిగాం "నిన్ను అంతగా ప్రేమిస్తున్న ఆ అబ్బాయిని కాదనటానికి కారణమేమిటి? వాడికి దేనికి లోటు?'' అని. ఆ అమ్మాయి చాలా సింపుల్‌గా చెప్పేసింది, "నేను ప్రేమ పెళ్లి చేసుకోనని మా అమ్మకి మాటిచ్చాను. అది తప్పను'' అని. మేము ఆ పట్టుదలకి ముచ్చటపడి "సరే వాడి పేరెంట్స్‌ని మీ ఇంటికి వచ్చి అడగమంటాం'' అన్నాం. అందుకు ఆ పిల్ల చాలా మొండిగా "అతని కులం, మా కులం, అతని ప్రాంతం, మా ప్రాంతం వేర్వేరు, మా అమ్మ నాన్న ఒప్పుకోరు'' అన్నది. మాకు ఆశ్చర్యమేసింది, ఏం స్వభావమిది అని..నేను కథను అక్కడ ఒక నిమిషం ఆపి "మీ దేవుడు కూడా కులాలు పాటిస్తాడట కదా బాబా! ఇంతకీ మీరు దేవుడు ప్రేమించే కులంలోనే పుట్టారా?''అన్నాను కొంత వెటకారంగా. అందుకు ఆ సన్యాసి వెంటనే బదులు పలకలేదు.

కాసేపటికి "కథ పూర్తి చెయ్యి బాపూ'' అన్నాడు. నేను మళ్లీ మొదలుపెట్టాను "దీపను కలిసిన విషయాన్ని నెమ్మదిగా నాగేందర్‌కి చెప్పాం. ఇక ఆ పిల్లని మరిచిపొమ్మని చెప్పాం. నాగేందర్ అప్పుడేమీ మాట్లాడలేదు. తరువాత పదిరోజులకి వాళ్లింటికి వెళ్లాడట. అక్కడేం జరిగిందో మాకు అతను చెప్పలేదు. మరో పదిరోజులకి దీపాన్విత క్లాస్ నుండి హాస్టల్‌కి వెళుతున్నపుడు నాగేంద ర్ ఆమె మీద యాసిడ్ పోశాడు. చాలా జాగ్రత్తగా ఆమె చుట్టుపక్కల ఉన్న మిగిలిన అమ్మాయిలని కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి వెళ్లండి అని చెప్పి వాళ్లు వెళ్లాక యాసిడ్ ఆమె ముఖం మీద పోసి, ఆగి, ఆమె ఆక్రందనని విని హాస్టల్‌కి వచ్చి, ఆ విషయాన్ని మాకు చెప్పి హాస్టల్ వదిలి వెళ్లిపోయాడు.

మరి కాసేపటికి పోలీసులు వచ్చారు. మమ్మల్నందరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఎన్ని రోజులు ప్రయత్నించినా నాగేందర్ మాత్రం పోలీసులకు దొరకలేదు. మరికొంతకాలానికి రైలుకిందపడి చచ్చిపోయాడని తెలియవచ్చింది. అందరం బాధపడ్డాం. ఎంత తెలివైనవాడో, ఎంత మంచి డాక్టర్ కాగలిగేవాడో గుర్తొస్తే విపరీతంగా దుఃఖమొచ్చేది. అందరికీ దీపాన్విత మీద ద్వేషం కలిగేది. చచ్చిపోతే పోయాడు మంచిపని చేసి పోయాడు అనుకునేవాళ్లం.

యాసిడ్ దాడి తరువాత ఆ అమ్మాయి చాలా సార్లు ప్లాస్టిక్ సర్జరీలకు వెళ్లింది, కొన్ని సార్లు ప్రభుత్వ సహాయంతో, కొన్నిసార్లు సొంతడబ్బులతో. అయినా ఆ అమ్మాయి ముఖం ఎంత వికారంగా మారిపోయిందంటే పెద్దవాళ్లకి కూడా ఆ పిల్ల ముఖం చూస్తే భయం వేసేది. ఆ అమ్మాయికి కూడా అది తెలుసేమో ఎప్పుడూ ముఖాన్ని చున్నీతో కప్పేసుకునేది.

తరువాత మా కోర్సులు ముగిసిపోయాయి. ఎవరి ఊర్లకి వాళ్లు వెళ్లిపోయాం. కానీ మా అందరి మనసుల్లో నాగేందర్ నిలిచిపోయాడు. ఎప్పుడు గుర్తొచ్చినా ఒక్కటే అనుకునే వాళ్ళం ఎంత ప్రేమించాడు ఆ పిల్లని. అంత గొప్ప ప్రేమని కాదన్నది దుర్మార్గురాలు, వాడి జీవితాన్ని నాశనం చేసిందని. బాబా ఇప్పుడు చెప్పండి నాగేందర్ చేసింది తప్పా? తప్పే అయితే ఎందుకని తప్పు? కులము, డబ్బు, స్తోమత అన్నీ పుట్టేటప్పుడు నిర్ణయించుకుని పుట్టము కదా? డబ్బు లేదనో చర్మం రంగు నల్లగా ఉందనో, కాని కులమనో హృదయపూర్వకమైన ప్రేమని తిరస్కరించడం తప్పు కాదా?'' అన్నాను.

సన్యాసి నిట్టూర్చి "బాపూ డబ్బు, రంగు, రూపం మన చేతుల్లో లేనట్లే మన ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు మన చేతుల్లో ఉండవు. అన్నీ ఉన్న మీ స్నేహితుడు ఆ అమ్మాయికి నచ్చకపోయి ఉండొచ్చు. ఏమీ లేని వాళ్లు నచ్చనూ వచ్చు. ఇదంతా పక్కన పెడితే, బాపూ ఒక్క మాట చెప్పు, నీ స్నేహితుడికి ఆమెని ప్రేమించే హక్కు ఎంత వుందో అతన్ని కాదనే హక్కు ఆమెకూ అంతే వుంటుంది కదా.

నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పినందుకు యాసిడ్ పోస్తారా బాపూ? మనం మనుషులం అనే స్పృహ ఉందా మీకు? మీ నాగేందర్‌నే మరో అమ్మాయి ప్రేమించిందనుకుందాం. ఆవిడ నాగేందర్‌కు నచ్చలేదనుకుందాం. అప్పుడు ఆమె నాగేందర్ మీద యాసిడ్‌దాడి చెయ్యాలి కదా? దీనికి అంతం ఏది బాపూ? ఇది ప్రేమ కానే కాదు. మనం ఎవరికైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో అడగాలి. పోకిరీ వాళ్లమయుంటే ఆ అమ్మాయి ప్రేమకోసం బుద్ధిమంతులం అవ్వాలి. ఆ ప్రేమకోసం మనకి వీలైనంతా చేయాలి. అప్పటికీ అవతలి వ్యక్తిని మెప్పించలేకపోతే తప్పుకోవాలి-అదీ ప్రేమంటే. నాగేందర్ చేసింది మంచి పని, అతనిది గొప్పప్రేమ అంటున్న మీలో కూడా మానవత్వం ఎంత వుందో చూసుకోండి బాపూ'' అన్నాడు అసహనంగా.

చిన్న సన్యాసి అందరికీ టీలు తెచ్చి ఇచ్చాడు. ఈ సారి నాకూ ఇచ్చాడు. నేను టీ తీసుకుని ఒకసారి బలంగా నిట్టూర్చి సన్యాసితో "కథ అక్కడితో అయిపోలేదు బాబా, కొనసాగింది. మాకందరికీ పెళ్లిళ్లయ్యాయి. మా పిల్లలు మూడో క్లాసులకి నాలుగో క్లాసులకి వచ్చారు. ఒకనాటి రాత్రి హాస్పిటల్ నుండి వచ్చి ఫ్రెషయ్యి సిస్టం ముందు కూర్చుని మెయిల్ చెక్ చేసుకుంటున్నాను.

ఏదో ఇంగ్లీష్ పేరుతో మెయిల్ ఒకటి వచ్చింది. సబ్జెక్టులో రేయ్ రమేష్ నేను నాగేందర్‌ని రా! దీపాన్విత నాగేందర్‌ని రా అని ఉంది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మెయిల్ ఓపెన్ చేసాను. నాగేందర్! మా నాగేందర్! ఇంకెవరికి తెలుసు దీపాన్విత అనే పేరు? నాగేందర్ బ్రతికే ఉన్నాడు. నేను ఉత్తరం చదవడం మొదలుపెట్టాను, ఏమన్నాడు వాడు"రేయ్ నేను దీపాన్విత నాగేందర్‌ని రా'' అని. ఎంత ప్రేమ, ఎంత పిచ్చి ప్రేమ కదూ! దుఃఖం వచ్చింది. "మీరందరూ అనుకున్నట్టు నేను చచ్చిపోలేదు రా రమేష్, మా అమ్మవాళ్లు చాలా ప్రయత్నాలు చేసి, పోలీసులను మేనేజ్ చేసి నన్ను మారుపేరుతో ఫారిన్‌లో వున్న మా అత్త దగ్గరికి పంపేశారు.

నేనిక్కడ మళ్లీ మెడిసిన్ చదవడం మొదలుపెట్టాను. మీ అందరి గురించి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నాను. ముఖ్యంగా దీపాన్విత గురించి. అప్పుడు కోపంలో యాసిడ్ పోసినా తరువాత బాధ కలిగింది. తనని ఎలాగైనా ఫారిన్ రప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో తనకి పెళ్లయిపోయింది ఎవరో దయ్రార్ద హృదయుడితో. నిజం చెప్పాలంటే నాకు వాడ్ని చంపేయాలనిపించింది. పగలు,రాత్రి ఒకటే గుండెకోత. దీపాన్విత నాది, వాడెవడు మధ్యలో? దాని శరీర ము, మనసూ నాదే కావాలి. అది నన్ను కాదన్నది సరే, కానీ ఎవరికైనా దాన్ని ఎలా ఇవ్వగలను. ఎంత ప్రేమించాను దాన్ని.

అది గుర్తురాని క్షణం ఏదైనా ఉందని నేను గుండెమీద చెయ్యేసుకుని చెప్పలేనురా రమేష్, ఇండియా వచ్చి వాడ్ని చంపేద్దాం. అనుకున్నాను, అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఏం చెయ్యాలి? నా దీపాన్విత నాదిగానే ఉండాలి. రోజు రోజుకి దుఃఖం పెరిగిపోయింది. నెమ్మదిగా డిప్రెషన్ మొదలయింది. అమ్మ నాన్న వచ్చారు. ఎవరెవరో ఏదేదో చెప్పారు, ఏం చెప్పినా ఆ పిల్ల లేకుండా జీవించడమెలాగో నాకు అర్థం కాలేదు రా, ఇప్పుడు బ్రతికి నేను సాధించాల్సింది ఏముంది, ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ని కాగలనట, నిజమే కానీ ఆ ప్రఖ్యాతి నాకు ఏం తెచ్చిపెడుతుంది. దిశా నిర్దేశాన్ని కోల్పోయిన జీవితాన్ని జీవించి ఏం లాభం? దీపాన్విత ప్రేమని పొందలేని జన్మ వ్యర్థమనిపించింది. చచ్చిపోదామని అనుకున్నాను. పోయే ముందు నన్ను ప్రేమించే నిన్ను పలకరించి పోదామనుకున్నాను''.

నా మెదడు మొద్దుబారింది. ఇదంతా నిజమేనా అని వాళ్లింటికి ఫోన్ చేశాను. అంతా నిజమేనన్నారు. చాలా దుఃఖమేసింది. ఎంత గొప్ప ప్రేమికుడు? స్నేహితులమందరం కలుసుకుని వాడిని మరోసారి స్మరించుకున్నాం. మా మనసుల్లో వాడో అమర ప్రేమికుడు. ఇప్పుడు చెప్పండి బాబా నాగేందర్‌ది నిజమైన ప్రేమా? కాదా? అన్నాను. నా ముందు విద్యా విహీనుడితో సమానమైన ఆ పేద సన్యాసితో నా మాటకి అవుననిపించాలన్న పట్టుదల ఏదో నా గొంతులో కనిపించినట్టుంది. అందుకేనేమో అతను చాలా మృదువుగా "బాపూ! మీకు చెప్పగలిగే వాణ్ణి కానే కాదు. కానీ ఒక్క ప్రశ్న మీకై మీరే వేసుకోండి "అసలు ప్రేమంటే ఏమిటి'' అని. ప్రేమ హాయిగా నవ్వే పసిబిడ్డలాటిది.

మనం రమ్మని చేతులు చాస్తాం. పసిపాప ముఖం తిప్పుకుంటుంది. నా అంతటి వాడిని చేతులు చాస్తే రానంటుందా అని ఆ బిడ్డని లాగి నేలకేసి కొడతామా? ఊహించడానికి ఎంత కిరాతకంగా ఉంది ఆ దృశ్యం. నాగేందర్ ఆ అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. కాదన్నదని యాసిడ్ పోశాడు. అయినా సంతృప్తి కలగలేదు. తనని తాను హత్యచేసుకున్నాడు. దీనిని ప్రేమ అని, అందులోనూ చాలా గొప్ప ప్రేమ అని అంటున్నారు మీరు. కానే కాదు బాపూ. ప్రేమ అద్భుతమైనది. ప్రేమతో నిండివున్న మనసు వెన్నపూసలా మృదువుగా ఉంటుంది. ఎదుటి మనుషుల చిన్ని చిన్ని కష్టాలకు కూడా ఇట్టే కరిగిపోతుంది. ప్రేమ దాడి చేయదు. హత్యచేయదు. తనను తాను చంపుకోదు.

ఒక మనిషిని తెచ్చి మన ఇంట్లో మన పడక గదిలో పెట్టుకుని సంభోగించి పిల్లల్ని కనడాన్ని మీరు ప్రేమ అంటున్నారు. అది ప్రేమ కాదు. వట్టి కామప్రకోపం. దాన్ని అదే పేరుతో పిలవడం మంచిది.
మీ నాగేందర్ ఆమెను నిజంగా ప్రేమించి ఉంటే ఆమె ఇష్టానికి ఆమెను వదిలేసి కూడా ప్రేమించేవాడు. ఆమె మనదని మనం భావించినంత సేపూ ఆమె మానసికంగా మనతోనే ఉంటుంది. బాపూ! మనల్ని మనం ఏకాంతంలో ఎక్కడ అన్వేషించుకుంటామో, అప్రమేయంగా ఏది మనల్ని ఆవహించగలదో, మనలో లయమై విడివడి కనిపించనిదేదో, విడివడలేనిదేదో అక్కడక్కడే మనం!!!'' అన్నాడు.

అతని మాటలు నాలో ఏదో శాంతిని నింపాయి. ఇద్దరం మౌనమయ్యాం. ఆ సన్యాసి పలికిన బరువైన చివర వాక్యాలు నిజానికి నాకు అర్థం కూడా కాలేదు కానీ అసలైన ప్రేమ ఏదో నన్ను ఆవ హించిన భావం కలిగింది.

నెమ్మదిగా చీకట్లు ముసురుకున్నాయి. నా స్నేహితులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నేను వాళ్లకి చేయి ఊపి ఇక్కడ ఉన్నానని చెప్పి సన్యాసితో "బాబా వెళ్తున్నాను. మీతో పరిచయం బాగుంది. ఆ పాట మరొకసారి పాడగలరా'' అన్నాను. అతను ఏక్‌తారా మీటుతూ పాడటం మొదలుపెట్టాడు. అతని అశిక్షిత కంఠం నుండి వినిపిస్తున్న ఆ ప్రేమ పాట మా చుట్టూ అలుముకుంటున్న చీకటిని దీప్తివంతం చేయడం మొదలుపెట్టింది.
అమీ ఓ నయొనె నయోన్ దియా ఆర్ తో ఫిర్ భో నా
(నేను ఆ కనులతో కనులు కలిపాను ఇక వెనుదిరగను)
జేతే దాయ్లె..జేతే దాయలే..జేతే దీబొనా
(వెళ్లాలనుకున్నా..వదిలెళ్లాలనుకున్నా..వెళ్లనీయను)
తొమాయ్ హ్రిద్ కమలే రాఖిభో ఛేడే దీబొనా **
(నిన్ను హృదయకమలంలో ప్రతిష్టించుకుంటాను విడిచిపెట్టను)

 gandavarapusamanya@gmail.com
............................................
* గోరటి వెంకన్న పాట
** బంగ్లాదేశ్, బెంగాల్‌లలో ప్రసిద్ధిగాంచిన బౌల్ జానపద గీతం

http://andhrajyothy.com/ContentPage.jsp?story_id=32168&category=sunday_special

https://www.facebook.com/groups/telugupustakam/497071713707979/?notif_t=group_comment

Thursday, August 1, 2013

జయశ్రీ నాయుడు|| ఓ సాయంత్రపు తలుపు ||


నన్ను నేను చూసినట్టుంది

ఎక్కడో దారులు మరిచి
దూరాన్ని కౌగిలించినట్టుంది

ఆలోచనల పూరేకులు
ఊపిరిలో నవ్వినట్టుంది

నాతో నేను దాగుడు మూతలుగా
ముందుకూ వెనక్కూ సాగుతున్న జీవితం

అప్పుడప్పుడూ
ఆశావేశం
అకాంక్షా మోహం

ఖాళీల్లో చూసుకుంటున్న ఆత్మాన్వేషణం

పూరణలన్నీ నిజాలుకావు
అసత్యాలన్నీ అజ్ఞానమవ్వవు

ఏదైనా సుందరమే
సంతోషాన్నిచ్చే
ఆకాశపు భాగమే


వెలుగునీడలన్నీ స్నేహించి
తూరుపు దారాల్ని  పేని
మాయా తివాచీ ని బహూకరిస్తాయి

సుందరమైన జీవితపు తునకల్లో
పయనించే దెక్కడికని అడక్కు
ప్రయాణీకుడివై ఆనందించు

--  జయశ్రీ నాయుడు

** KAVISANGAMAM RESPONSES
  • Satya Srinivas నాతో నేను దాగుడు మూతలుగా
    ముందుకూ వెనక్కూ సాగుతున్న జీవితం
  • Kapila Ramkumar పూరణలన్నీ నిజాలుకావు/ అసత్యాలన్నీ అజ్ఞానమవ్వవు .....నిజమే!
    2 hours ago · Like · 1
  • Kavi Yakoob ఖాళీల్లో చూసుకుంటున్న ఆత్మాన్వేషణం 

    పూరణలన్నీ నిజాలుకావు
    అసత్యాలన్నీ అజ్ఞానమవ్వవు/ Good poem.
    2 hours ago · Like · 1
  • Santhisri Santhi వెలుగునీడలన్నీ స్నేహించి 
    తూరుపు దారాల్ని పేని
    మాయా తివాచీ ని బహూకరిస్తాయి//bagundhi jayasriji..//
  • Pusyami Sagar సుందరమైన జీవితపు తునకల్లో
    పయనించే దెక్కడికని అడక్కు
    ప్రయాణీకుడివై ఆనందించు wah baguandi
  • Jayashree Naidu Satya Srinivas garu, Kavi Yakoob ji, Santhisri SanthiPusyami Sagar garu, Kapila Ramkumar garu.. Thank you for the hearty comments
  • Padma Sreeram "ఎక్కడో దారులు మరిచి
    దూరాన్ని కౌగిలించినట్టుంది
    ఆలోచనల పూరేకులు
    ఊపిరిలో నవ్వినట్టుంది"

    దూరాన్ని కౌగిలించడం నాకు తెలియని ప్రయోగం...జయశ్రీ జీ..నమో నమః
  • Mani Vadlamani ఏదైనా సుందరమే
    సంతోషాన్నిచ్చే
    ఆకాశపు భాగమే .భలే వుంది జయశ్రీ గారు అద్భుతం!
  • Jayashree Naidu Padma Sreeram.... భావాన్ని జీవిస్తున్నప్పుడు అన్నీ సజీవాలే....ఆత్మీయాలే Thank you... _/\_
    2 minutes ago · Like · 1
  • Jayashree Naidu Mani Vadlamani garu.. thanks andee.. add reqst pamputunnaanu.
  • Pavan Kondapalli Jeevita gamananni saralangaa adbhutangaavundi.Paatagaa raayagaligite chirakaalam migile janam paatautundi.aalochinchandi.
    21 hours ago · Unlike · 1
  • Humorist N Humanist Varchaswi //పయనించే దెక్కడికని అడక్కు
    ప్రయాణీకుడివై ఆనందించు//కవితకి తుది పదాలైనా ... మకుటాయమానంగా నిలబడ్డ పాదాలు.
    20 hours ago · Unlike · 1
  • Nauduri Murty జయశ్రీనాయుడుగారూ,
    ఇది ఒక సాయంత్రపు తలపా, తలుపా? గుణింతం తప్పుపడిందేమో ననుకుంటున్నాను. 

    అదిపక్కనబెడితే, ఈ కవిత చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా చివరి లైన్లు:
    ...See More
    13 hours ago · Unlike · 3
  • Jayashree Naidu Thank you so much Nauduri Murty garu.. నిజం చెప్పాలంటే - కవితని రీచెక్ చేసుకున్నప్పుడు నాక్కూడా ఆ లైన్లు బాగా నచ్చాయి. ఇది గుణింతం తప్పు కాదు. ఒక సాయంత్రం నా తలపుల్లో తలుపు తట్టిన భావాలు. Evening is like the closing part of the day for me. A threshold for night. So took it in that spirit. Hope it is justified. Please let me know sir if I am right.
    13 hours ago · Like · 3
  • Sita Ram superb
    11 hours ago · Like · 1
  • Mehdi Ali నాతో నేను దాగుడు మూతలుగా
    ముందుకూ వెనక్కూ సాగుతున్న జీవితం
    అప్పుడప్పుడూ
    ఆశావేశం 
    అకాంక్షా మోహం
    ఖాళీల్లో చూసుకుంటున్న ఆత్మాన్వేషణం very nice
    11 hours ago · Like · 1