దూరం అడుగులేస్తోంది
దగ్గరను నెట్టేస్తూ..
కౌగిలించేంత దగ్గరలున్నాయి
శ్వాసించిన క్షణాలున్నాయి
క్షణాలు దారప్పోగులవుతున్నాయి
అనుభవాల్ని అల్లుకుంటూ...
భావం పరిమళించిన క్షణం
అదో విహంగ వీక్షణం
పువ్వులు కనిపించని ముద్దిస్తున్నాయి
మరో మొగ్గకు చిగురవుతూ...
ఇవేళ్టి గాలి కలగంటోంది
అణువుల్ని నింపే పుష్పవనం కోసం
వర్తమానమంతా అద్దంలో చూస్తోంది
గతకాలపు జ్ఞాపకాల ప్రతిబింబమౌతూ...
అలంకరించుకుంటోంది
అలవాటుగా మారని అనిత్యంతో
అరచేతులు రెండూ ఏకమౌతున్నాయి
ఆ జ్ఞాపకాల దోసిలవుతూ...
కాలమెంత సుగంధమో కదా
అక్షరాల్లోకి ఇమడనపుడు.
******** 19-01-2014