Sunday, January 12, 2014

జవాబు లెరుగని ప్రశ్నలు - Maruvam Usha

జవాబు లెరుగని ప్రశ్నలు
~~~~~~~~~~~~~~

- ప్రశ్నల్లో ఎప్పుడూ ఏమీ ఉండదు. మనలో ఏముందో అది బయటికొస్తుందంతే...

1

కిటికీ అద్దానికి అతుక్కున్న తూనీగ కి
ఎగిరిపొమ్మని అరిచరిచి చెప్పాక,
అద్దానికి ఈవలి వైపు నాలో అలజడి

దాని రెక్కల హోరు అంటే నాకు మక్కువ: ఎందుకు?
నా వీపు మీద చరిత్ర వదిలిన మూటల బరువు ని మరిపిస్తాయనా!

ఈ జడత్వం లో నా అస్తిత్వమంతా ఒక్క మూసలోకి ఇరికిస్తూ,
తరాల కుబుసాలు విడవలేక,
ఈ ఒక్క అంతరాత్మ తో కలహిస్తూ పడి ఉన్నానెందుకు?

2

తామరాకు మీద బొట్టు బతుకు ఎందరికి తెలుసు?

అతుక్కుపోలేక, నిలవలేక, ప్రవాహం లో కలిసిపొలేక
ఆకు మీద నర్తిస్తూ..

విశ్వం పత్రం లా పరుచుకుని ఉంది
శయనించలేని దుర్బలతలో,
'లాలి పాట' ఎరుగని ఓ పసితనం,
యుగాల పర్యంతం నిద్రలేమి లో అలమటిస్తూనే ఉంది
మాట నేర్పిన మౌనం తో జతకడుతూనే ఉంది.

https://www.facebook.com/maruvam.usha

No comments:

Post a Comment