Sunday, April 5, 2015

కిటికీ దగ్గర... పాల్ ఎలూర్, ఫ్రెంచి కవి -- Translation by Nauduri Murthy

Source :  https://www.facebook.com/groups/kavisangamam/permalink/934978776554875/
కిటికీ దగ్గర... పాల్ ఎలూర్, ఫ్రెంచి కవి
మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే
నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు.
నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి.
నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను.
ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత,
చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు,
దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ
ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ.
నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది.
నాకేమీ అర్థం కావడం లేదని అనిపించిన రోజులున్నాయి.
నా సంకెళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయి.
నా కోరికలన్నీ నా కలల్లోంచి పుట్టినవే.
నా ప్రేమని నేను మాటలతో ఋజువుచేసేను.
నన్ను నేను ఎటువంటి అద్భుతమైన జీవరాశికి సమర్పించుకున్నాను!
నా ఆలోచనలు నన్ను బలవంతంగా, ఎంత దుఃఖమయమైన ప్రపంచంలోకి బంధిస్తున్నాయి!
నాదైన ఒక వింత ప్రపంచంలో నేను ప్రేమించబడ్డానని నమ్మకంగా అనిపిస్తుంది
నా ప్రేమిక భాష ఈ మానవభాషకి ఎంతమాత్రం చెందదు.
ఈ మానవ శరీరం నా ప్రేమిక శరీరాన్ని తాకనైనా తాకదు.
నా ఆలోచనలలో మోహ వాంఛలు అధికమూ, అనవరతమూ...
అయినప్పటికీ, నన్ను తప్పుచేయడానికి ఏదీ ప్రేరేపించలేదు.
***
సూచన: ఈ అనువాదంలో "ప్రేమిక" అన్న పదం స్త్రీ, పురుషులిద్దరికీ సమంగా వర్తిస్తుంది.
At the Window
.
I have not always had this certainty,
this pessimism which reassures the best among us.
There was a time when my friends laughed at me.
I was not the master of my words.
A certain indifference,
I have not always known well what I wanted to say,
but most often it was because I had nothing to say.
The necessity of speaking and the desire not to be heard.
My life hanging only by a thread.
There was a time when I seemed to understand nothing.
My chains floated on the water.
All my desires are born of my dreams.
And I have proven my love with words.
To what fantastic creatures have I entrusted myself,
in what dolorous and ravishing world has my imagination enclosed me?
I am sure of having been loved in the most mysterious of domains, my own.
The language of my love does not belong to human language,
my human body does not touch the flesh of my love.
My amorous imagination has always been constant
and high enough so that nothing could attempt to convince me of error.
.
Paul Eluard
French Poet

Sunday, September 7, 2014

Nanda Kishores Poem SECRETS



*Secrets*

1

మిణుకుమిణుకుమంటాయి కదా? అవన్నీ ఆత్మలు.ఎవ్వరికీ చెప్పొద్దు. ఆకాశం రాక్షసి.

పొద్దున మోహిస్తుంది కదా? నవ్వకు. రాత్రికి చంపేస్తుంది.

2

ఎగసి ఎగసిపడ్తాయి కదా? అవన్నీ ఆత్మలు. ఎవ్వరికీ చెప్పొద్దు. సముద్రం రాక్షసి.

తీరంలో పిలుస్తుంది కదా. వెళ్ళకు. లోపల దాచేస్తుంది.

3

పిడికెడు మట్టిని మైదానం చేసిందనీ, ఒక్క కన్నీటి చుక్క తనకోసం రాల్చినందుకు సెలయేరై ప్రవహించిందనీ ఆమెను ప్రేమించావు కదా? అదంతా మాయ. ఆమె కూడా రాక్షసి.

కొండంతా దిగులుతో నీ హృదయంమీద కూర్చుంటుంది కదా? ఓర్వకు. భూమిలో పాతేస్తుంది.

4

గాలికి ఊగిసలాడుతూ పువ్వులు రాల్చే ఈ చెట్లన్నీ ఎక్కడివనుకుంటున్నావు? పిచ్చి సన్నాసి. అవన్నీ ఆత్మలే. 

Thursday, April 24, 2014

Nauduri Murthy's కవిత్వం తో ఏడడుగులు - 30

 కవిత్వంతో ఏడడుగులు 30
.
అందరికీ చిన్నతనం ఎందుకు అంతనచ్చుతుందంటే, అప్పుడు మనం మనంగానే ఉండి, ఏ ముసుగులూ మనం ధరించి ఉండం గనక.
రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు, మనం బడికెళ్ళి నేర్చుకునేది అంతా గతం గురించిన సమాచారమే తప్ప, భవిష్యత్తుకి పనికొచ్చేది ఏదీ ఉండదు. అందుకని మనకు తెలియకుండానే సందర్భానికి తగ్గ ముఖం ... ఎడ్వర్డ్ డి బోనో చెప్పిన 6 ఠింకింగ్ హత్స్ లాంటివి (ఆయన లక్ష్యం వేరనుకొండి. సామ్యం అంకెలవరకే)... ధరించడం నేర్చుకుంటాం. మనసహజ ప్రకృతికి భిన్నంగా ఉంటుంది కనుకనే మన హిపోక్రిసీ (ఆత్మవంచన) బాగా తెలుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఈ ముఖాలుధరించడం అలవాటైపోయి, అదే మన సహజప్రవృత్తి అయిపోతుంది. దాలిగుంటలో కుక్క కూర్చుని జీవితాన్ని అవలోడనం చేసుకుంటూ, ఇంకెప్పుడూ తప్పుడుపని చేసి దెబ్బలు తినకూడదని నిర్ణయంతీసుకుని క్షణంలో మరిచిపోయినట్టు, రాత్రి ఎప్పుడో ఏకాంతంలో మనజీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు, మనం కాసేపు బాధపడినా, ఉదయం లేవగానే మళ్ళీ యధాప్రకారం మనజీవితంతో, మన ముఖాలెరువుతెచ్చుకోవడంతో రాజీ పడిపోతుంటాం. మన విలువలుకూడా కఠినమైన పరీక్ష ఎదురుకానంతవరకు నిలకడగానే ఉంటాయి. నిజమైన పరీక్షకి నిలబడి విలువలు పదిలంగా కాపాడుకునేది ఏ కొద్దిమందో.
సింహావలోకనాన్ని ఒక సాధనంగా తీసుకుని చేస్తున్నపని తప్పని పరోక్షంగా విమర్శించడం ఒక సాహిత్య ప్రక్రియ. క్రిందటివారం గేబ్రియల్ ఒకారా చెప్పినంత సమర్థవంతంగా, ఫాతిమా అల్ మతార్ ఈ కవితలో చెప్పగలిగింది.
.
వదనం
.
ఓ నా వదనమా!
నువ్వూ నేనూ ఎలా పెరిగాము!
నిన్ను నాకో ముసుగులా వాడడం ఎంత త్వరగా నేర్చుకున్నానో
అంత త్వరగా నువ్వు నీ బుగ్గల నునులేతదనం విడిచావు
విశాలమైన కన్నుల్లో అమాయకత్వాన్ని కూడా విడిచిపెట్టావు
వదనమా!
నీ వెనక దాక్కోడం ఎంత హాయిగా ఉంటుందో!
నిన్ను నా వయసుని మోయనియ్యడం ఎంత తేలికగా ఉంటుందో!
నా పిచ్చి పిచ్చి ఆలోచనల్నీ, ప్రతి సంతోషాన్నీ, ఆవులింతల్నీ, ప్రతి అసహ్యాన్నీ,
నా నిరాశాలనీ, అయిష్టాల్నీ, అవమానపు నిట్టూర్పుల్నీ
నువ్వు ప్రకటించేలా చేశాను.
వదనమా! వయోభారాన్ని నీమీద మోపి,
జీవితపు భయాల్నీ, అంతులేని కన్నీళ్ళనీ
నీ మీద రుద్ది, నీకు ఎన్నో
ఆకారాలూ, పేర్లూ, వ్యక్తిత్వాలూ ఆపాదించేను.
ఇప్పుడు ఒకసారి ఫొటోలలోకి చూస్తుంటే,
మరోసారి ఫొటోలలోకి తొంగి చూస్తుంటే నాకు అనిపిస్తోంది
నీకు నిజంగా నవ్వాలని అనిపించనపుడు
నిన్ను నేను నవ్వమని అనకుండా ఉండాల్సింది;
నిన్ను చిరాకుపరిచే వెక్కిరింతల్ని నేను తుడిచి ఉండాల్సింది.
చిట్లించిన నీ కనుబొమలు ఒకసారి
అవధిలేని నీ అహంకారాన్ని నువ్వు మరిచిపోయేలా చేసాయి;
నిష్కారణమైన ఆ కనుబొమల చిట్లింతల్ని విరమించుకోవలసింది..
నిన్ను కలిసిన ప్రతిసారీ,
ప్రతిబింబంగా అనుకోకుండా తారసపడినపుడూ, లేదా,
మరొకరి కనుపాపల్లోంచి నువ్వు నన్ను తేరిపారిచూసినపుడూ
నాకు నిన్ను గుర్తుపట్టడానికి ఒకటి రెండు క్షణాలుపడుతుంది.
నా ఆశలకీ,
నీ యవ్వనపు కవోష్ణరుచి ఎన్నటికీ మారదనుకునే
నా గాఢమైన అమాయకపు నమ్మకానికీ
విరుద్ధంగా, నువ్వెంత మరిపోయేవు!
వదనమా! నువ్వూ నేనూ ఎలా పెరిగాం!
ఈ పెదాలకీ, ఈ నయనాలకీ మధ్యన
నిర్విరామంగా మనం ఎన్ని కథలు చెప్పుకున్నామని!
ఎన్ని మరువలేని ప్రేమలు! ఎన్ని క్షమించరాని అబద్ధాలు!
వదనమా! నిజానికి నీకు ఇవన్నీ ఎలా చెప్పాలో మప్పింది నేనే
... నువ్వు తు. చ. తప్పకుండా అలాగే చెప్పావు.
నేను నిన్ను కపటంగా నటించమని ఆదేశించినపుడు
నాకు విధేయతతో, విశ్వాసంతో, నడుచుకున్నావు.
.
ఫాతిమా అల్ మతార్
సమకాలీన కువైటీ కవయిత్రి

Hear the poem in her voice here: 
http://www.youtube.com/watch?feature=player_embedded&v=DRkKmkFfhk0

Face
.
Face, how we’ve grown, you and I
You’ve shed your baby cheeks,
Abandoned your innocent wide eyes
As I quickly learned to use you as my disguise
Face, it was so comfortable hiding behind you
So easy letting you carry my age
I made you convey my every whim, my every pleasure
My every loathing despise, my yawns,
My despairs, my detesting belittling sighs,
Face, I burdened you with years
And etched upon you life’s fears, and endless tears
And gave you shapes and names and persons
Looking at the photos now
Looking at the photos now
I wish I didn’t make you smile when you didn’t really want to
I wish I wiped off your resentful sneers
Your knotted brows made you once forget your relentless vanity
Loosen your unjustified frowns
Every time I met you, in some unexpected reflection
Or found you staring back at me through someone else’s eyes
It always takes me a second or two to recognize you
How you’ve changed against all of my wishes
My naive solid belief that the warmth of your youth
Would never really someday fade.
Face, how we’ve grown you and I
And in between these lips, and these eyes,
We’ve told incessant stories
Unforgettable loves unforgivable lies
Face, I was the one who taught you how to say
And indeed you have said
And when I commanded you to dishonestly express
You very faithfully, very obediently, said yes. 
.
FATIMA AL MATAR, 
Contemporary Kuwaiti Poetess 

https://www.facebook.com/groups/kavisangamam/permalink/740323446020410/

Thursday, February 20, 2014

కొన్ని మూగతనాలు - Jayashree Naidu

 కొన్ని మూగతనాలు

వస్తూ...
పరచుకున్న పచ్చికనంతా
మూటగట్టి 
గుండె కు గ్రీష్మాన్ని కానుకగా ఇచ్చి వెళతాయి

కొన్ని
ఆకాశాన్నీ టాస్ వేసి 
వెన్నెల్లనీ 
వేకువల్నీ దోచేస్తాయి 

కొన్ని 
తొలి చిగురు చూపై
వేరువరకూ చేరని
నీటి ప్రేమౌతాయి 

మామూలుతనమవ్వలేని 
అనుభవాలన్నీ 
ప్రశ్నార్థకాలవుతున్నపుడు 


భారాల్ని రాసే ఘడియల్లో 
ఎన్ని పదాల్ని వూరడిస్తే 
ఓ కన్నీటి చుక్క కు తులాభారమౌతుంది..???



Sunday, January 19, 2014

కాదిది దూరాభారం... - Jayashree Naidu


దూరం అడుగులేస్తోంది
దగ్గరను నెట్టేస్తూ..
కౌగిలించేంత దగ్గరలున్నాయి 
శ్వాసించిన క్షణాలున్నాయి 



క్షణాలు దారప్పోగులవుతున్నాయి
అనుభవాల్ని అల్లుకుంటూ...
భావం పరిమళించిన క్షణం
అదో విహంగ వీక్షణం 

పువ్వులు కనిపించని ముద్దిస్తున్నాయి
మరో మొగ్గకు చిగురవుతూ... 
ఇవేళ్టి గాలి కలగంటోంది 
అణువుల్ని నింపే పుష్పవనం కోసం 



వర్తమానమంతా అద్దంలో చూస్తోంది
గతకాలపు జ్ఞాపకాల ప్రతిబింబమౌతూ... 
అలంకరించుకుంటోంది
అలవాటుగా మారని అనిత్యంతో 

అరచేతులు రెండూ ఏకమౌతున్నాయి 
ఆ జ్ఞాపకాల దోసిలవుతూ... 
కాలమెంత సుగంధమో కదా
అక్షరాల్లోకి ఇమడనపుడు.



******** 19-01-2014

Monday, January 13, 2014

లైఫ్ ఈజ్ అ గేం - ప్లే ఇట్... Jayashree Naidu

చుక్కల్లా మినుకుమనే మాటల మధ్య
చిక్కగా అల్లుకునే ఆకాశపు మౌనం 

ఎన్ని చెప్పుకున్నా మళ్ళీ మొదటికే వస్తాం 
ఎందుకీ శబ్దపు అసందర్భాలంటూ


ఖాళీతనపు పాదాలు జరిపి
మాటకి కొంచెం చోటిచ్చి

మధ్యలో పలువరుసలు తళుకులద్ది
గుండె మరకల్ని దాచాలనే ఆత్రం 

అన్నీ తెలుసు
ఏదీ తెలీదు
సరిహద్దు రేఖ మనమే  

అటు నుండి ఇటూ 
ఇటు నుండి అటూ 
గందరగోళపడే అవకాశాన్నిచూస్తూ
మనసు ఆడుకుంటుంది జీవితమై 

లైఫ్ ఈజ్ అ గేం - ప్లే ఇట్... 



Sunday, January 12, 2014

జవాబు లెరుగని ప్రశ్నలు - Maruvam Usha

జవాబు లెరుగని ప్రశ్నలు
~~~~~~~~~~~~~~

- ప్రశ్నల్లో ఎప్పుడూ ఏమీ ఉండదు. మనలో ఏముందో అది బయటికొస్తుందంతే...

1

కిటికీ అద్దానికి అతుక్కున్న తూనీగ కి
ఎగిరిపొమ్మని అరిచరిచి చెప్పాక,
అద్దానికి ఈవలి వైపు నాలో అలజడి

దాని రెక్కల హోరు అంటే నాకు మక్కువ: ఎందుకు?
నా వీపు మీద చరిత్ర వదిలిన మూటల బరువు ని మరిపిస్తాయనా!

ఈ జడత్వం లో నా అస్తిత్వమంతా ఒక్క మూసలోకి ఇరికిస్తూ,
తరాల కుబుసాలు విడవలేక,
ఈ ఒక్క అంతరాత్మ తో కలహిస్తూ పడి ఉన్నానెందుకు?

2

తామరాకు మీద బొట్టు బతుకు ఎందరికి తెలుసు?

అతుక్కుపోలేక, నిలవలేక, ప్రవాహం లో కలిసిపొలేక
ఆకు మీద నర్తిస్తూ..

విశ్వం పత్రం లా పరుచుకుని ఉంది
శయనించలేని దుర్బలతలో,
'లాలి పాట' ఎరుగని ఓ పసితనం,
యుగాల పర్యంతం నిద్రలేమి లో అలమటిస్తూనే ఉంది
మాట నేర్పిన మౌనం తో జతకడుతూనే ఉంది.

https://www.facebook.com/maruvam.usha