అప్పుడప్పుడనిపిస్తుంది,ప్రేమించినప్పుడు నీ అవస్థ
గ్రీకు ఇతిహాసాల్లో సముద్రయానానికి సంసిద్ధమైన
నావికుల్లాంటిదని.తాళ్ళు, తెడ్లు,తెరచాపలు,తెగింపు,
అన్నీ ఉంటాయి, సానుకూలంగా వీచే గాలితప్ప.
ప్రార్థించడం, ప్రార్థించడం తప్ప మరో దారి లేదు.
అవతలిఒడ్డు కనిపించని ఇవతలితీరం మీద ఒక
శిశువులాగా నిస్సహాయంగా సంచరించక తప్పదు
ఆకాశం తెరుచుకునేదాకా కైమోడ్చిఉండకతప్పదు
ప్రయాణసన్నద్ధులైకూడా ముందడుగు పడనప్పుడు
తెలుస్తుంది, ప్రేమించడమంటే ఒకరినొకరు బలవంత
పెట్టుకోలేని బలహీనతని, ఎట్లాగైనా బలమంతా
కూడదీసుకు మరీ ఆ బలహీనత కాపాడుకోడమని.
No comments:
Post a Comment